పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి

34.204.186.91

వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణ భారము వహించిన తండ్రికి క్రృతజ్ఞత చూపడము మానవత్వము విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .

దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు. పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం. అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని పురాణ వచనం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటె, లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటె దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్తను అనాదారణ చేసిన ఎడల పునర్జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును. సర్ప హత్యా లేదా ఏదైనా నిరపరాదిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను యది మీకు సంభవము కాని ఎడల పితృ పక్షములో శ్రార్దము చేయవలెను. వైధీకులు రెండూ ను చేయాలి.శ్రాద్ధాచరణ విషయము నందు విశ్వేదేవతలు సాక్షిగా ఉందురు.శ్రీ మహా విష్ణువు శ్రాద్ధమునకు పర్యవేక్షకునిగా వుండును.ప్రధాన దేవతలు పితృదేవతలు ముగ్గురు.తండ్రి,తాత,ముత్తాత ,తండ్రి వసు స్వరూపుడు, తాత రుద్ర స్వరూపుడు, ముత్తాత ఆదిత్య స్వరూపుడు ఈ ముగ్గురూ వసు,రుద్ర,ఆదిత్య లోకముల యందు ఉందురని శాస్త్ర సంప్రదాయము. ఒకొకపుడు ఈ ముగ్గురూ వారి కర్మఫలాను భవానంతరము ఆ లోకములను విడిచి కర్మానుగుణముగ మరో లోకములో ప్రవేశించి ఉండవచ్చును. కానీ వారు ప్రవేశించిన లోకములు వారి స్థితి వసురుద్రాదిత్య లోకముల యందే తెలియబడును. శ్రాద్ధాచరణ విషయములో ఒకానొక స్థితిలో భోక్తలగు బ్రాహ్మణులు లభించనిచో కర్త అరణ్యమునకు వెళ్ళి నాకు బ్రాహ్మణులు లభింపలేదు అందుచేత శ్రాద్ధమును ఆచరించలేక పోవుచున్నాను. అని పెద్దగా ఏడవ వలెను. మరియు శ్రాద్ధాచరణ వాషయంలో ఇట్లుండవలెను. భోక్తలు తమ భోజన కాలములో కర్తవలు తమ కొరకు వండిన భక్ష్యాది పదార్ధములలో అపేక్షిత పదార్ధములను అడిగి భుజించవలెను.ఆయా భక్ష్య పదార్ధములు భుజించవలెనన్న కోరిక  ఉన్ననూ సిగ్గుతో అడగలేక భక్షించలేకపోయినచో ఆ దోషము భోక్తలదే. అయిననూ కర్త పరిశీలిస్తూ అడిగివేయనిచో ఆదోషము కర్తదేయగును.
శ్రాద్ధము జరుగుచుండగా విశ్వేదేవతలు వసురుద్రఆదిత్య లోకములకు వెళ్ళి అచటనున్న పితృదేవతలతో ఇట్లు చెప్పెదరు.
   ఓ పితృదేవతలారా  భూలోకములో మీ పుత్రపౌత్రాదులు మీ కొరకు శ్రాద్ధము ఆచరించుచున్నారు.అని చెప్పెదరు.ఆసమయంలో పితృదేవతలు ఆ లోకములోనే ఉన్నచో భూలోకములో పితృదేవతా స్వరూపముతో భుజించుచున్న బ్రాహ్మణుల భోజన తృప్తిననుసరించి పితృదేవతలు తృప్తి చెందెదరు.

Quote of the day

Once you start a working on something, don't be afraid of failure and don't abandon it. People who work sincerely are the happiest.…

__________Chanakya