కృతజ్ఞత

3.236.222.124
మహాస్వామివారు తమ ఉపదేశం కేవలం ఆచరణ రూపంలో చూపారు. సన్యాస ధర్మ పరిపాలన విషయంలో వీరి నియమ ధృతి ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆ విషయం చెప్పుకోబోయే ముందు కొంచం క్రొత్తదనం కోసం వారి అనేక మహోన్నతమైన గుణములలో ఒకటైన కృతజ్ఞతా లక్షణాన్ని స్మరించుకొందాము. కృతజ్ఞత అనేది మహాపురుష లక్షణము.

వాల్మీకి నారదుని పదహారు ఉన్నతమైన లక్షణాలున్న మహాపురుషుడెవరైనా ప్రస్తుత కాలంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తూ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. . . అంటూ ఈ కృతజ్ఞతా లక్షణాన్ని ఉటంకిస్తాడు. దప్పికతో ఉన్నప్పుడు మనకు చల్లటి మంచినీరు ఒక గ్లాసు ఇచ్చిన వారి మేలు - మనం తరువాత కాలంలో అనేక పర్యాయములు వారికి మరగ కాచిన పాలు, చిక్కటి మజ్జిగ ఇచ్చే అవకాశం కలిగినా మరిచిపోరాదని పెద్దలు చెబుతారు. మహాస్వామివారికి వైయక్తికమైన అవసరాలు ఏమిటుంటాయి? అయితే తమ పూర్వీకులైన ఆచార్యులవారలకు, పీఠమునకు చేసిన మేలు ఎన్నడూ మరవక అటువంటి వారి యెడల ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం చూపుతూ వచ్చారు స్వామివారు. 
 
17వ శతాబ్ధంలో కర్ణాటక యుద్ధం మూలంగా ఏర్పడిన అస్తవ్యస్తత కారణంగా శ్రీమఠం కావేరీ తీరంవైపు తరిలివెళ్ళింది. క్లిష్ట పరిస్థితులలో మఠాన్ని ఉడయార్ పాళయయం సంస్థానాధీశుడు ఆహ్వానించి ఒక సంవత్సర కాలం పొషించారట. మళ్ళీ తంజావూరు ప్రభువులు ఆహ్వానించేంత వరకూ వీరు ఉడయార్ పాళయం రక్షణలోనే ఉన్నారు. క్రమశః సంస్థానాధిపతులు జమీందారులయి, జమీందారీ కూడా పోయి సాధారణ మనుష్యులైనారు. ఆస్తులన్నీ పోయి, జమీందారీ తాలూకు భేషజాలు, కోట మాత్రం మిగిలి పొషణభారం మోయలేని దుస్థితికి దిగజారారు. 
 
ఎప్పుడూ శిష్యుల లౌకికాభివృద్ధికి తమ పలుకుబడిని ఉపయోగించడానికి ఇష్టపడని స్వామివారు వీరి విషయం సంబంధిత అధికారులు తమ దర్శనానికి వచ్చినప్పుడు నేరుగా మాట్లాడి వీలయినంత సహాయం చేయించారు. సాధారణ వ్యక్తిగా ఒక వదులు జుబ్బా వేసుకొని జనీందారు వంశస్థుడు శ్రీవారి దర్శనానికి వచ్చేవాడు. స్వామివారు మఠాన్ని పోషించిన సంస్థానాధీశుని పేరు చెప్పి అతని మనవడంటూ సాదరంగా తివాచి తెప్పించి కూర్చోబెట్టేవారు. చివరికి అతడేదో ఖర్చులకు నగలు అమ్ముకోవలసి వచ్చింది. ఆ ప్రాంతాలలో ఆ రాళ్ళకు విలువ కట్టగలవారే లేరు. మదరాసు నుండి జొషి అనే మహాభక్తుడైన వజ్రాల వ్యాపారిని పిలిచి “పాపం! ఆ జమీందారు మోసపోతాడేమో! ఆ రాళ్ళకు విలువ కట్టరా! అయితే నీవు మాత్రం కొనడానికి వీలులేదు. అంతగా అయితే కొనగలిగే బేరగాళ్ళను చూపించవచ్చు”నని కట్టడి చేసి మరీ పంపారట. మహాస్వామివారు సిద్ధి పొందిన తరువాత ఈ మాజీ జమీందారు ఇంతకాలం నన్ను నా గౌరవాన్ని కాపాడిన స్వామి ఎక్కడ అంటూ గగ్గోలు పెట్టాడు. 
 
మరి గంగైకొండ చోళపురం బృహదీశ్వరుని మిగులుతో కదా పీఠం పోషించబడింది. క్రమశః భూములన్నీ అన్యాక్రాంత మైపోయాయి. నిలవరించడానికి జమీందారుకు అధికారం లేదు. ఉత్తరాది వరకు దండయాత్ర చేసి గంగైకొండ చోళుడు తను జయించిన రాజులందరిచేత మోయించుకొని వచ్చిన గంగాజలాలతో నిత్యం అభిషేకం చేయించుకొని మహా భోగాలనుభవించిన బృహధీశ్వరునికి నిత్య ధూప దీప నైవేద్యాలకు కరవయిపోయింది. అసలౌ జరగడం లేదని కాదు. విధి విధానంగా జరగడం లేదు. ఆ స్వామికి నిత్యం గంగనీళ్ళతో స్నానం చేసే అలవాటున్నది. పదహారు అడుగల ఆ మహాలింగానికి అయిదు మానికల బియ్యం వండి అధరవులతో ఆరగించే రివాజున్నది. 
 
ప్రతి కార్తీక పూర్ణీమనాటికి ఎనభై బస్తాలు బియ్యం వండి దానితో అభిషేకం చేస్తే నిండిపోయి ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క శివలింగంగా ప్రకాశించి భక్తులకు అన్ని శివలింగాల దర్శనం చేసిన పుణ్యం ప్రసాదించే అనుగ్రహ బుద్ధి ఉన్నది. ఈ సంప్రదాయాలన్నీ అడుగంటిపోయినాయి. 
 
1989లో శ్రీవారు తమ భక్తులతో సంభాషిస్తున్నారు “తల్లితండ్రులు అప్పుచేస్తే వారు తీర్చలేకపోయినప్పుడు పిల్లలు బాధ్యతవహించాలి కదా! నేను ఒక సన్యాసిని, నా పూర్వీకులు కూడా సన్యాసులే. మాకు డబ్బు గడించడానికి ఖర్చు చేయడానికి అధికారం లేదు. అయితే ఈ బీద సన్యాసికి సంక్రమించిన ఋణం నుండి విముక్తి చేయవల్సిన బాధ్యత శిష్యులైన మీ అందరి యెడల ఉన్నది కదా!” అని ఆరంభించి గంగైకొండ చోళపురపు బృహదీశ్వరుని మిగులులో తమ పీఠం పోషించిన వైనమంతా చెప్పి, 
 
“మమ్ము, రాజభోగాలతో పోషించిన ఆ బృహదీశ్వరునకిపుడు భోగాలు కరువయ్యాయి. అన్నాభిషేకం, విధి విధానమైన నైవేద్యం, గంగా జలాభిషేకం జరిగేలా చూడటం ద్వారా మీరంతా మమ్ము ఋణవిముక్తులను చేయాలి” అంటూ ముగించారు. అప్పటి నుండి ఈ కార్యక్రమాలు పరమ వైభవంగా జరుగుతున్నాయని వేరే చెప్పనక్కరలేదు.
 
--- శ్రీకార్యం చల్లా విశ్వనాథ శాస్త్రి, ఋషిపీఠం ప్రచురణల నుండి
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
 
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore