వైరవనస్వామి ఆలయము

3.236.221.156
వైరవనస్వామి ఆలయము, వనరోలినాధార్ ఆలయము, వైరవన్‌పట్టి, శివగంగ. తమిళ్‌నాడు.
వడుకాంతపురం అని పిలువబడే వైరవనస్వామి ఆలయము సుందరమైన అయిదు అంతస్తుల రాజగోపురముతో ఉన్న 1500 సంవత్సరముల పురాతనమైన ఆలయము. ఈ ఆలయములో శివుడు భైరవుడిగా ప్రత్యేక సన్నిధిలో అంబాళ్ అంబిక వెలసి యున్నాడు. వైరవన్‌పట్టి ఆలయం చెట్టియార్ సమాజంచే పోషించబడినది మరియు ఇది వారి మూడవ అతిపెద్ద ఆలయం. వైరవన్‌పట్టి ఆలయము తమిళ్‌నాడు రాష్ట్రములోని శివగంగ జిల్లాలో కరైక్కుడి పట్టణము నకు దగ్గరలో యున్నది. ఇది తమిళ్‌నాడు లోని అష్ట భైరవ స్థలములలో ఒకటి.

ఈ ఆలయం యొక్క గొప్పతనము ఏడు తాళముల స్తంభ శిల్పకళతో ప్రశసించబడినది. పురాణాల ప్రకారం, వైరవర్‌కు తిరుపత్తూరు ఇల్లుగా మరియు వైరవన్‌పట్టి హృదయ స్థానముగా మరియు ఇల్లుపాయిక్కుడిని పాదస్థానంగా పరిగణించబడినవి. ఈ ఆలయము యొక్క ప్రత్యేకత గ్రంధ కళ. ఈ ఆలయము భైరవుని ప్రాముఖ్యత కలిగిన ఆలయము.

స్థల పురాణము:

బ్రహ్మ అయిదవ శిరస్సును తీసివేయమని శివుడు భైరవుడుని ఆదేశించెను. సృష్టి కర్త అయిన బ్రహ్మకు శివుని వలే ఐదు తలలు కలవు. బ్రహ్మ ఈ విషయములో చాలా గర్వముతొ యుండెడి వారు. ఒక రోజు పార్వతి బ్రహ్మను తన భర్త శివుడే అనుకొని మర్యాద చేసి గౌరవించినది. కాని బ్రహ్మ ఆమె ప్పిదమును తెలపకుండా సకల మర్యాదలను అనుభవించెను.

పార్వతి దేవి తన తప్పును తెలిసికొని ఈ విషయమును శివునికి నివేదించినది. శివుడు తన ఉప ప్రతినిధి అయిన భైరవుడుని బ్రహ్మ చేసిన తప్పుకు శిక్షగా బ్రహ్మ ఐదవ తలను తీసివేయమని పంపెను. బైరవుడు ఈ ఆలయములో భక్తులకు దర్శనము.

వలరోలి పేరు వెనుక కధ

(కశ్యప ఋషి:
కశ్యప ఒక పురాతన ఋషి, అతను మన్వంతరలోని సప్తఋషులు అత్రి, వశిష్ఠ, విశ్వమిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజలతో ఒకరు. బలి చక్రవర్తి ఆస్థానంలో వామన అవతారము ఋషి కశ్యప అదితిల కుమారుడు. కశ్యప ఋషి దేవతలకు, అసురులకు, నాగులకు మరియు మానవాళి అందరికీ తండ్రి. అతను అదితిని వివాహం చేసుకొని అగ్ని, ఆదిత్యలు, మరియు ముఖ్యంగా మహా విష్ణువు ఐదవ అవతారమయిన వామనుడుకు ఏడవ మన్వంతరలో తల్లి తండ్రులయినారు. తన రెండవ భార్య దితితో కలిసి, అతను దైత్యలను జన్మనిచ్చాడు. దితి మరియు అదితి దక్ష ప్రజాపతి రాజు కుమార్తెలు మరియు శివుడి భార్య సతికి సోదరీమణులు. పరశురాముడు కార్తవీర్య అర్జునుడిని వధించి తాను స్వాధీనం చేసుకొనిన భూమిని కశ్యప మునికి దానముగా నిచ్చెను.అందువలన భూదేవిని "కశ్యపి" గా పిలువబడినది.

కశ్యప ఋషి జననం మరియు వంశం
అతను సృష్టికర్త బ్రహ్మకు చెందిన పది మంది కుమారులలో (మానస-పుత్రులలో) మరీచి కుమారుడు. ప్రజాపతి దక్షుడు తన పదమూడు కుమార్తెలను (అదితి, దితి, కద్రు, దను, అరిష్తా, సురస, సురభి, వినత, తామ్ర, క్రోధవాస, ఇడా, ఖాసా మరియు ముని లను కశ్యప మునితో వివాహం చేసెను.
* ఆదితి లేదా ఆదిత్యస్ (ఆదితి కుమారులు) నుండి అతని కుమారులు, అనా, ఆర్యమాన్, భాగ, ధాటి, మిత్రా, పయాన్, శక్ర, సావిత్రి, త్వస్త, వరుణ, విష్ణు మరియు వివస్వత్. వీరు సౌర రాజవంశం వారు( సూర్యవంశ), తరువాత ఇక్ష్వాకు రాజవంశం అని పిలువబడింది, అతని మనవడు, ఇక్ష్వాకు రాజు, అతని తరువాతి రాజులు, కుక్షి, వికుక్షి, బానా, అనరణ్య, పృథు, త్రిశాంకు, చివరకు రఘు అనే పేరు పెట్టిన రాజు. (రఘు రాజవంశం), ఆపై దశరథ కుమారుడైన రాముడికి దారితీసినది.
దితికి చెందిన అతని కుమారులు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్ష మరియు కుమార్తె సిన్హిక, తరువాత కాలములో ఆమె విప్రాచిట్టి భార్య అయినది. హిరణ్యకశిపుకు నలుగురు కుమారులు, అనుహ్లాద, హ్లాద, ప్రహ్లాద, మరియు సంహ్లాద. వీరు దైత్యులను మరింత విస్తరించారు.
* గరుడ మరియు అరుణ అతని భార్య వినత ద్వారా కశ్యప కుమారులు
* నాగ (నాగవంశము) కద్రుకు చెందిన అతని కుమారులు.
* దానవులు దనుకు చెందిన అతని కుమారులు.
* భగవత పురాణం ప్రకారం అప్సరసలు కశ్యప మరియు మునికి జన్మించారు.
కశ్యప కుటుంబ శ్రేణిలో, అతనితో పాటు మరో ఇద్దరు మంత్రాలను కనుగొన్నారు, వారు అతని కుమారులు అవత్సర మరియు అసిత. అవత్సర ఇద్దరు కుమారులు, అవి నిద్రువ మరియు రేభా కూడా మంత్ర దర్శకులు. అసితకు శాండిలా అనే కుమారుడు జన్మించాడు, వీరి నుండి ప్రసిద్ధ శాండిల్య గోత్రము ప్రారంభమైనది.
'స్వరోచిష' అనే మన్వంతర కాలంలో, ఏడు ఋషులలో కశ్యప ఒకరు. హిమాలయాలలోని కాశ్మీర్ లోయకు ఈయన పేరు పెట్టారు. పురాణాల ప్రకారం కాశ్మీర్ లోయ విస్తారమైన ఎత్తైన సరస్సు అని, ఇది కశ్యప ఋషి చేత ఖాలి చేయబడినది. ఈ ఖాలి చేసిన సరస్సు స్థలములో అందమైన కాశ్మీర్ లోయ ఉద్భవించినది, అందువల్ల కశ్యప్మిరా అనే పేరు కాలక్రమాన్న భ్రష్టుపట్టి కాశ్మీర్ గా మారినది).
పురాణ చరిత్ర ప్రకారము ఈ ఆలయ కధ.
కశ్యప ఋషికి సూరన్ అనే కుమారుడు కలడు. ఈయన కఠోరమైన తపస్సు చేసి శివుని నుండి శివునిచే తప్ప మరియెవరి వల్లను మరణము లేకుండ వరమును పొందెను. ఈ వరమువలన తనకు మరణము లేదన్న గర్వముతో దేవతలను బాధించుచుండెను. ఇంద్రుడు తమ గురువైన బృహస్పతి వద్దకు సమస్య పరిష్కారమునకు వెడల బృహస్పతి శివుడు తప్ప మరియెవ్వరును ఈ సమస్యను పరిష్కరించలేరు అందువలన శివుని శరణోడమని తెలిపెను. ఇంద్రుడు శివుని ప్రార్ధించగా శివుడు భైరవుడిగా అవతరించి సూరన్‌ను వధించి ఒక దివ్యమైన కాంతిగా (తమిళములో పెరోలి) దర్శనమిచ్చెను. ఇచట ఈ ఆలయములో ఈయన వలరోలి నాధార్‌గా అధిష్టించి యున్నారు.
ఆలయ చరిత్ర:
ఈ ఆలయము త్రేతాయుగము నాటిది. ఈ ఆలయము పాండ్య రాజుల ఆధ్వర్యములో యుండెడిది. 718ADలో పాండ్య దేశములో స్థిరపడిన నాగరథర్ (నట్టుకొట్టై చెట్టియారులు) లకు 14వ శతాబ్దములో అప్పగించబడినది. పాండ్య రాజు 9 ఆలయములను నాగరధర్‌కు అప్పగించిరి అందులో వైరవన్‌పట్టి ఆలయము ఒకటి. మొదట ఈ ఆలయము మట్టితో కట్టినది. 1864లో నాగరధర్ ఈ ఆలయమును రాతి కట్టడముగా మార్చెను. ముఖ్యమైన చావడి అందమైన చెక్కుడు స్థంభములతో ఆకర్షణియముగా యుండును. ఈ ఆలయమును వారు చక్కటి శిల్పములతోను, రకరకాల రాతి చెక్కుడులతోను మరియు కుడ్య చిత్రములతోను అలంకరించిరి.
ఆలయము:
వైరవన్‌పట్టి ఆలయ ముఖ్య విగ్రహములు వలరోలినాధార్ స్వయంభు లింగరూపములో తూర్పు ముగముగా మరియు అంబాళ్ వడివుడై అమ్మైతో వెలసియున్నారు. గర్భగుడి బయట గోడపై శ్రీ రాములవారు ముకిళిత హస్తములతో సీతాదేవి ఉనికిని తెలుపుతున్న విశ్వరూపములో యున్న శ్రీ ఆంజనేయస్వామిని స్వాగతిస్తున్న తీరులో గలదు. ఈ రకముగా యున్న రాములవారిని భక్తులు ప్రార్ధించిన నిష్కపట గుణమును పొందెదరని నమ్మకము. ఈ ఆలయ రాజగోపురము పై అనేక సున్నముతో చేసిన శిల్పములు కలవు అందులో అతి అరుదయిన 12 ముఖములు 24 చేతులతో సుబ్రఃమణ్య స్వామి విగ్రహము కలదు.

శునక వాహనముతో భైరవుడు పద్మ పీఠముపై చతుర్భుజములతో అగ్రహముతో అమ్మవారి సన్నిధి ప్రక్కన ప్రత్యేక సన్నిధిలో దర్శనము. ఈయనని వయిరవన్ అని సంభొదించెదరు. ఈ ఆలయము వయిరవన్ ఆలయమని ప్రసిద్ది చెందినది. భైరవుని సన్నిధిలో స్త్రీ రాతి విగ్రహము కలదు. ఈ విగ్రహము వల్లి అమ్మై అనే భైరవుని మహా భక్తురాలు. ఈమె నాగరధర్ జాతికి చెందిన స్త్రీ. ఈమె తన జీవితమంతయు ఇచటి భైరవుని పూజించుటకు ఈ ఆలయమునందే జీవించినది. శ్రీ ఆండాళ్ వలె ఈమెకు కూడ దేవతగా పూజించుదురు. శివునిచే సృష్టించబడిన పవిత్ర తీర్ధము వైరవర్ తీర్ధము (పుష్కరిణి) ఆలయము బయట యున్నది. అమ్మవారి సన్నిధి వెనుక మూడు బల్లుల శిల్పములు కలవు. వైరవన్‌పట్టి ఆలయము తమిళుల ఆలయ శిల్ప కళకు ప్రసిద్ధి చెందినది.

ఏడు స్థంభముల మండపములో గంభీరముగా కూర్చొని యున్న శ్రీ దక్షిణామూర్తి సన్నిధి కలదు. దక్షిణామూర్తి విగ్రహము మరియు చిన్న చిన్న స్థంభములను (మీటితే శబ్ధము వెలువరించే) ఒకే రాతి పై చెక్కిరి. ఈ ఆలయ ప్రాకారములో గుఱ్రము పై యుద్దానికి సిద్దముగా యున్న యోధుడి అద్భుతమైన శిలా విగ్రహము చూడటము మరువకూడదు. ఈ ఆలయములో అనేక అందమైన శిల్ప కళాఖంఢములు కలవు అందులో మీనాక్షి కళ్యాణ వైభవ శిల్పము ఒకే రాతి పై చెక్కినది. ఆలయ పై కప్పు లోహపు దూలములతో కాకుండ రాతి కమ్మిల ఆదారముతో రాతి పలకలు అమర్చిరి. రాతి పలకలు రాతి కమ్మీలకు రాతితో చెక్కిన చీల మేకులతో బిగించ బడినవి. ఇది ఒక అద్భుతమైన చెప్పుకోదగిన భవన నిర్మాణ పనితనము. ఈ ఆలయములో 23 కాంస్య విగ్రహములు మొదటి పునఃరుద్దరణ కాలము నాటివి మరియు 12 ఊరేగింపు వాహనములు కలవు.

37 వైరవ పురాణము గురించి 43 రామయణ సన్నివేశములు, మహాభారతము సన్నివేశములూ అద్భుతమైన వివరణతో గోడపై చిత్రములు కలవు. వడివుడై అంబాళ్ మరియు శివ సన్నిధుల నడుమ వైరవర్ రాజ మార్తాండ భైరవర్‌గా తన శునక వాహనముతో ప్రత్యేక సన్నిధిలొ కలడు. సుందరమైన వడివుడై అంబాళ్ దక్షిణ వైపు తిరుముగముతో భక్తులకు దర్శనము. అంబాళ్ విగ్రహము వెనుక మూడు బల్లుల ఉపశమన పరిమాణ విగ్రహములు కలవు. ఈ బల్లి విగ్రహములను పూజించిన అన్ని రకముల దోషముల నుండి ఉపశమనము కలుగునని భక్తుల నమ్మకము. ప్రాకారం చుట్టూ వచ్చేటప్పుడు అందమైన శిల్పాలు, విగ్రహాలు చూడవచ్చు. కళాత్మక సైనికుడు మరియు గుర్రం విగ్రహము చూడటానికి ఒక అద్భుతమైన దృశ్యం మరియు కన్నప్ప నయనార్ శివునికి తన నేత్రములను దాన మిచ్చు సన్నివేశ విగ్రహం ఒకే రాయి నుండి అద్భుతముగా చెక్కబడినది. శివుని వాహనము నంది ప్రత్యేక మంటపము నందు కలదు. ఇచట యున్న వినాయకుడిని వలర్ ఓలి వినాయకుడుగా ప్రసిద్ధి. స్థల వృక్షము ఎళంజిల్ వృక్షము. ఒకప్పుడు ఈ ప్రాంతములో ఈ వృక్షములు అనేకముండెడివి కాని ఇప్పుడు కానరావు. ఈ వృక్షము యొక్క పండ్లు రాలి మరల చేట్టుకే అతుక్కుపోవును. ఈ వృక్షము యొక్క రాతి శిల్పము ఆలయములో కలదు. ఈ క్షేత్రము మూర్తి స్థలముగా తీర్ధ స్థలముగా ప్రసిద్ది చెందినది.

ఈ ఆలయములో మండపములు ఉప సన్నిధులు కలవు. ముఖ్య సన్నిధిలో గర్భగుడి, అర్ధ మండపము, మహా మండపము కలవు. మహామండపము యొక్క స్థంభములపై అనేక ముఖ్యమైన శిల్పములు కలవు, బిక్షాటనార్, గంధర్వులు, మీనాక్షి-సుందరేశ్వరార్ వివాహ ఘట్టము, నెమలి వాహనము పై సుబ్రహమణ్య స్వామి, శంకర నారాయణ, నరసిమ్హ స్వామి హిరణ్య కసిపుడుని సమ్హరిస్తున్న విగ్రహము, రిషాబారూడ మూర్తి, నర్తన గణపతి మొదలగునవి కలవు. ముఖమండపము స్థంభములపై రతి మన్మధుల విగ్రహములు, కొదండ రామ సీతాదేవి లక్షమణలుల విగ్రహము, వేటగాడు మరియు అతని భార్య, భైరవ, అగోర భద్ర, వీర భద్ర, ఉర్ధవ తాండవ మూర్తి, నృత్య భంగిమలో కాళి దేవి మొదలగునవి కలవు.

ఉపసన్నిధిలు:

నటరాజ సన్నిధి, గణేశ, సూర్య చంద్రుల సన్నిధులు, మురుగన్ సన్నిధి, కాశి విశ్వనాధ-విశాలాక్షి సన్నిధి, కన్నిమూల గణపతి, సుభ్రఃమణ్య తన దేవేరులతో నెమలి వాహనముపై, నవగ్రహముకలు, ఆది వడివుడై అమ్మన్ మరియు సరస్వతి సన్నిధులు కలవు.

కోష్టము గోడలపై లింగోద్బవుడు, బ్రహ్మ మరియు దక్షిణా మూర్తి గలరు. అనేక మురల్ పైయింటిగ్స్ లోపలి గోడలపై కలవు.

నాగరధర్ నవ భైరవ ఆలయములు:

నాగరధర్ అనే ఒక ప్రసిద్ద వ్యాపార కులము చెట్టినాడులో. వారి ఆధ్యర్వములో కల నవ నాగరధర్ ఆలయములు: 1. ఇల్లయథంగుడి కోవిల్, 2. మథుర్ కోయిల్, 3. వైరవన్ కోయిల్, 4. ఇరనియూర్ కోయిల్, 5. పిల్లైయార్ పట్టి, 7. నేమమ్, 8. సూరైకుడి కోయిల్, 9. వెలంకుడి కోయిల్.
ఆలయ సమయములు: ఉదయము 06:00నుండీ మధ్యాఃన్నము 01:00 వరకు మరల సాయంత్రము 03:30 నుండి రాత్రి 08:30 వరకు.

ఉత్సవములు:
చంపకసుర శష్టి, కార్తిక దీపము, మహాశివరాతి కృష్ణ పక్షములో ప్రతి సంవత్సరము, వినాయక చతుర్ధి, పిల్లియార్ నోము ఈ ఆలయ ఉత్సవములు.
ప్రార్ధనలు:
భక్తులు శత్రు భయము పోవుటకు, గ్రహ దోషముల ఉపశమనము కొరకు ఇచట స్వామిని ప్రార్ధించుదురు. వడ మాల భైరవునుకి అమావాస్య పక్షమున ఎనిమదవ రోజున (అష్టమి) సమర్పించి పూజించుదురు.
ఫొన్: +91-4577-7-264 237
వైరవన్‌పట్టి తిరుపత్తుర్ కు 8 కి.మీ దూరములో కరైకుడి వెళ్ళే దారిలో కలదు. పిల్లియార్ పట్టి నుండి 2కి.మీ దూరములో కలదు. పిల్లియార్ పట్టిలో ప్రసిద్ది చెందిన కర్పగ వినాయకుడి ఆలయము కలదు. కరైకుడి అతి దగ్గరలో గల రైల్వే స్టేషను.
 
- రాఘవరావు

Quote of the day

Bondage is of the mind; freedom too is of the mind. If you say 'I am a free soul. I am a son of God who can bind me' free you shall be.…

__________Ramakrishna