Online Puja Services

సోమశిర నాయనారు

18.224.0.25
సోమశిర నాయనారు తిరువాంబూరులో నివసించే బ్రాహ్మణుడు. శివభక్తిపరుడు. శివభక్తులను సేవించేవాడు. శివభక్తులు ఏ కులాల వారైనా సరే - వారిని ఆదరించేవాడు. యాగాలు చేసాడు. ఫలితమును ఆశింపకనే శివుని కొలిచేవాడు. శివుడికి సంపూర్ణ శరణాగతుడు. ఈ కారణముచే అతనికి శివానుగ్రహము లభించినది.

ఇది ఒక పవిత్రుని జీవితము. ఇందులో పైకి ప్రత్యేకత ఏమీయు కనిపించదు. ఆ రోజుల్లో దక్షిణాదిన వున్న పరిస్థితులను మనము గమనించాలి. ఆ రోజుల్లో బ్రాహ్మణుడెవడు ఇతర కులస్థులతో కలిసి తిరుగలేని పరిస్థితి. బ్రాహ్మణుడు వానికి సేవ చేయుటయు, ఆలోచనలో కూడా ఊహించలేము. ఎంత మహాశివ భక్తులైనా సరే బ్రాహ్మణుడెవడు ఇతర కులస్థులకు సేవ చేయుట కుదరదు. దేవుని భక్తులకు సేవ చేయుటకు చాలా మనోనిబ్బరముండాలి. పట్టుదల వుండాలి.

ఇంక యాగములు ఫలితమాసించక ఎవరునూ తలపెట్టరు. ఒక కోరికతో స్వార్థ మునకై యజ్ఞమును చేయ సంకల్పిస్తారు. నాయనారు యాగాలను నిస్వార్థముగా చేశాడు. తనకై ఏమీ ఆశించలేదు. ఆధ్యాత్మికతతో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయినట్లుగా గమనిస్తాము. జ్ఞానపరిధిలో, ఆధ్యాత్మిక దృష్టితో నిజమైన జ్ఞాని అతడు. కర్మయోగి అతడు.

ఇవన్నియుగాక అతనికి గురువు యెడ అప్రతిమాన భక్తి యుంది. సుందరమూర్తి నాయనారు ఈతనికి గురువు. గురుభక్తి మూలాన సాధించలేని దేముంది? అయినా మూర్ఖులు, గర్విష్టులు గురుభక్తి గూర్చి చులకనగా మాట్లాడుతారు. గురు భక్తిని హేళన చేస్తారు.

ఎవరు ఎంత హేళన చేసినా నాయనారు తనదైన పద్ధతిని వీడలేదు. పరమ శివుడు సంతసించి నాయానారుకు అంత్యమున సాయుజ్యమును గ్రహించాడు.

2)సక్కియ నాయనారు
సక్కియ నాయనారు తిరుచంగమంగయిలోని వెల్లాల కులజుడు. ఆయనకు ఇహలోక వ్యాపకాలపై పూర్తి అయిష్టత ఏర్పడింది. మోక్షమును పొంద దలచాడు. మోక్ష సాధనకు ఉత్తమమైన మార్గమునకై అన్వేషణ ఆరంభించాడు. సమీపములోనున్న కొందరు బౌద్ధ సన్యాసుల సాంగత్యములో జీవించసాగాడు. కొంతకాలము వారివద్ద ఉండి, బౌద్ధ మత గ్రంధాలను, వారి సిద్ధాంతాలను అధ్యయనము చేసాడు. కానీ అవేవీ అతని అధ్యాత్మిక తృష్ణను పరిపూర్ణముగా తీర్చలేకపోయాయి.
అది తనకు తగిన మార్గము కాదని గ్రహించిన సక్కియ నాయనారు మనసు శైవ సిద్ధాంతములవైపు, పరమశివుని వైపునకు ఆకర్షింపబడినది. బాహ్య చిహ్నములేవైన బాహ్య ప్రవర్తనమేదైనా దేవునియందు అచంచల భక్తి ప్రపత్తులున్నచో మోక్షమునందగలడు అని నాయనారు మనస్సునకు గాఢంగా తట్టింది. బాహ్యంగా బౌద్ధమత చిహ్నలు వీడకపోయినా ఆయన మనస్సులో శివునియందు అచంచలమైన భక్తి ప్రపత్తులు నెలకొన్నవి. శివుని గాఢంగా ప్రేమించాడు.

ఒక రోజున శివాలయములో కూర్చొని శివుని గూర్చిన తలంపులతో మైమరిచిపోయాడు. ఆ స్థితిలో శివలింగముపై తాను రాయిని వేయడం తటస్థించింది. మరునాడు దేవాలయమునకు వెళ్లి వెనుకటి దినమున తానేమి చేసాడో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. భక్తుడు భక్తితో ఏమి సమర్పించినా దేవుడు స్వీకరిస్తాడు. ఈ రోజు గూడ శివునిపై రాయిని వేశాడు. రోజూ ఇలా రాళ్ళను శివలింగమునకు సమర్పించుటయే అతని నిత్య పూజా విధానముగా అయినది! ఈ పని చేయనిదే అతనికి ఆహారము గూడ తీసికొన బుద్ధయ్యేదికాదు. ఒకరోజున భోజనానికి కూర్చోగానే, తాను రోజూ చేసే పూజ చేయలేదని జ్ఞాపకానికి వచ్చింది. ఆకలిని గూడ మరచి దేవాలయమును దర్శించి భక్తితో శివునిపై రాయి నుంచాడు. తక్షణమే పరమశివుడు ప్రత్యక్షమై ఆశీర్వదించి కైలాసానికి తీసికొని వెళ్లాడు.

***

ఓం నమశివాయ - ఓం నమశివాయ - ఓం నమశివాయ

- వెంకట కృష్ణప్రసాద్ ఏలేశ్వరపు 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore