అహల్యకు దేవరాజుమీద మనస్సు ఎందుకు కలిగింది?

3.221.159.255
భార్య పొరపాటు చేసిందని ఆమెను విడిచి పెట్టిసినవాడు ఆర్షసంప్రదాయమందు భర్త కాదు. భార్యగా అహల్యచేసిన పొరపాటు కంటె పెద్ద పొరపాటు మరొకటి చరిత్రలో ఉండదు.

అహల్యకు దేవరాజుమీద మనస్సు ఎందుకు కలిగింది? ఆయన ఐశ్వర్యవంతుడని. ఐశ్వర్యవంతుడన్న భావన ఎందుకు కలిగింది? మనస్సు ఉండబట్టి. మనస్సు ఎందుకు వచ్చింది?

ఆహారాన్ని తినబట్టి. ఆహారంలో ఆరవవంత్ మనస్సు అయింది. మనస్సునుండి మోహము, మోహమునుండి లోభము వచ్చాయి. లోభానికి కామం కలిసింది. కామం కలిసి అహల్య మనస్సును దేవరాజు వైపు వెళ్ళేలా చేశాయి.

అందుకని ముందుగా అహల్య మనసు శుద్ధికావాలి. అందుకని గౌతముడు అహల్యని -----

వాయుభక్షా నిరాహారా తప్యంతీ భస్మశాయినీ!
అదృశ్యా సర్వభూతానా మాశ్రమేస్మినివత్స్యసి!!
 
"నువ్వు అన్నం తినకు. గాలిపీల్చు. నీపాపం పోవాలి. నువ్వు అగ్నిపునీతవు అవ్వాలి. అందుకని నువ్వు కొన్నివేల సంవత్సరాలు తపస్సు చెయ్యి. నీకు బాహ్యప్రపంచం తెలియకూడదు. నీ ఒళ్ళంతా బూదితో కప్పబడుతుంది. కప్పబడి నువ్వలా భూమిమీద పడిపోయి ఉండిపోతావు." రాబోయే అవతారాన్ని గౌతముడు ముందుగానే గుర్తించాడు.
👉"పతితపావనుడయిన రామచంద్రమూర్తి👈 ఇక్కడకు వస్తారు. అయన ఇక్కడకు ఆశ్రమంలోకి రాగానే ఆయన గాలి నీకు సోకుతుంది.
నువ్వు శాపవిముక్తురాలివి అవుతావు" అన్నాడు.
👉అహల్యను ’రాయి అయిపోవలసినది’ అని గౌతముడు శపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. దేవాలయానికి వెళ్ళడం ఎందుకు? స్వామి పతితపావనుడు. ఆయనమీద నుండి వచ్చేగాలి మనకు సోకితే చాలు మన పాపాలు నశిస్తాయి. అందుకని దేవాలయాలలోకి వెళ్ళి మనం స్వామిముందు నిలబడతాం.

మహానుభావుడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారంటారు వారి రామాయణ కల్పవృక్షంలో -

ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటిక స్పర్శ వచ్చె
ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగె
ప్రభు మేని నెత్తావి పరిమళించినతోన యశ్మంబు ఘ్రాణేంద్రియంబు చెందె
ప్రభు నీలరత్న తోరణమంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగె
ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీక
రించినంత హృదయనుపల వీధి
ఉపనిషద్వితానమొలికి శ్రీరామ భ
ద్రాభిరామమూర్తియగుచుతోచె!!
ఎప్పుడయినా సరే, మనం అహల్య వ్యభిచరించింది అనకూడదు. అలా అనడానికి మనకు హక్కులేదు.

**************************************

కొన్ని వందల సంవత్సరాలు ఆమె నిరాహారియై తపస్సు చేసింది. తదుపరి శ్రీరామదర్శనం చేసింది. శ్రీరామదర్శనానంతరం ఆమె పాపము పూర్తిగా నశించిపోయింది. ఆమెయందిప్పుడు పాపము లేదు. అటువంటి తల్లి కనుకనే శాపవిమోచనానంతరము రామచంద్రుడే ముందుగా ఆమెకు నమస్కరిస్తాడు.
రామచంద్రమూర్తిచేత నమస్కరింపబడిన మహాతల్లి అహల్య. అహల్య పేరు వినబడితే రెండుచేతులు ఎత్తి నమస్కరించాలి.

ఆమె గొప్పతనం గూర్చి చెప్పడానికే రాముడంతటివాడు ఆమెకు ముందు నమస్కారం చేశాడు.
తన భార్య తప్పుచేస్తే ఆ భార్య చేత తపస్సు చేయించి ఎందువల్ల ఆ భార్య ఆదోషాన్ని చేసిందో గమనించి, ఆ దోషాన్ని నివృత్తి చేసి రాముడు వస్తే ఎలా పతితపావనుడో చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకనే ఋషితుల్యుడు అయ్యాడు మహానుభావుడు.

అప్పటివరకు బాహ్యస్పర్శలేకుండా పడిపోయిన అహల్యకు రామచంద్రమూర్తి నుండి గాలివచ్చి తగిలిందిట. అంతే. ఆమెకు ఇప్పుడు స్పర్శ కలిగింది. ఇప్పటివరకు ఆవిడకు స్పర్శలేదు. ఇప్పటివరకు అసలు ముక్కుకు వాసన తెలియకుండా పడిపోయిన అమ్మకి రామచంద్రమూర్తి మీది నుంచి వచ్చిన పరిమళమయిన వాయువు తగలగానే ముక్కుకి సువాసన తెలియడం ప్రారంభమయినదట. ఆయన నుంచి గాలివచ్చి తగలగానే మరల స్పర్శేంద్రియము పనిచేయడం ప్రారంభించినదట. నీల మేఘ సంకాశమయిన రామచంద్రమూర్తి సౌందర్యమును చూడగానే ఆవిడ కనులు పనిచేయడం మొదలుపెట్టాయట.

ఆవిడిలోంచి శబ్దస్పర్శ రూప గంధములనే నాలుగు తన్మాత్రలు ప్రారంభమయ్యాయి. మరి రసేంద్రియమయిన నాలుక ఎప్పుడు పని చేస్తుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు తపస్సు చేసి లేచింది కాబట్టి లేచి తిన్నప్పుడు కాదట!


ఆ రాముడికి పళ్ళు, ఫలములు, పాలు అన్నీ ఇచ్చినప్పుడట! ఆయన తింటే ఈవిడ రసేంద్రియము పనిచేయడం మొదలు పెట్టిందట! ఇపుడు ఏమయింది? ఆహారదోషం, శరీరదోషం అన్నీ నివృత్తి అయిపోయాయి.

ఇప్పటివరకు రాముడు రాముడే. శ్రీరాముడు కాదు. సీతతో కలిసిన రాముడు కాదు. లక్ష్మి సీతమ్మగా అక్కడ మిథిలానగరంలో ఉంది. వారిద్దరూ తొందరలో కలియబోతున్నారు. సీతారాములుగా మాకు దర్శనం ఇవ్వబోతున్నారు. అని దర్శనము చేసిన గొప్ప చారిత్రము కలిగి, తన పాపములనన్నిటిని ప్రక్షాళనము చేసుకున్న మహాపతివ్రత అహల్య.

ఇటువంటి అహల్య కాళ్లమీద రాముడు పడ్డాడు.

భార్య తప్పు చేస్తే ఉద్ధరించుకున్నవాడు భర్త.
 
అంతేకాని పాిగ్రహణం చేసి అస్తమానూ చిన్నదానికి చితకదానికి కూరలో ఉప్పు దగ్గరనుండి ప్రతిదానికీ భార్యను పట్టుకుని నిందించేవాడు భర్త కాడు.
భార్య తప్పు చేస్తే దిద్దుకున్నవాడు భర్త.
 
పూజ్యగురువులు శ్రీచాగంటివారి ప్రవచనముల నుండి.....
 
జై శ్రీ రామ్, జై జై శ్రీ రామ్.
స్వస్తి........
*సనాతన ధర్మస్య రక్షిత-రక్షతః**

ప్రసాద్ సింగ్

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda