గ్రామదేవతకి వింతమొక్కులు

18.215.185.97
వళంగైమాన్ " పాడికట్టు అమ్మ "

కుంభకోణం వెళ్లి నపుడు , అక్కడకి 9 కిలో మీటర్ల దూరంలో వున్న వళంగి మాన్ అనే గ్రామం.
“గ్రామదేవతకి వింతమొక్కులు”

" పాడికట్టు అమ్మ " పేరు విచిత్రం గా వుంది కదూ, ఆ పేరు అర్ధం యేమిటో, ఎందుకా పేరు వచ్చిందో తెలుసు కుందామా?, ఆవింత మొక్కులేమిటో తెలుసుకుందామా?, ఎందుకు ఆలస్యం చదివెయ్యండి మరి .

కుంభకోణం చుట్టుపక్కల వున్న ముఖ్యమైన దేవాలయాలను దర్శించు కుందామని రెండు రోజులకు కారు మాట్లాడుకొని బయలుదేరాం.

కుంభకోణం పట్నం దాటి మా ప్రయాణం రాష్ట్ర ప్రభుత్వపు బాట మీద సాగింది. చిన్న చిన్న పల్లెలు పంటపొలాలు, ఊరికి వోకటో రెండో మిద్దిళ్లు, మిగతావి మట్టి ఇళ్ళే, చుట్టూ పెద్దజాగాలో కూరగాయలు పండ్ల చెట్ల , ప్రతి యింటికి మందార, నందివర్ధనం, మల్లి, అరటి, కొబ్బరి, ములగ, మామిడి, పనస, జామ చెట్లు, పెరట్లో కావేరి కాలువ నిండుగా నీటితో. అక్కడి ప్రతీ యింటికి కనిపించే దృశ్యం యిదే. ఇంతకు ముందు కూడా వెళ్లేం కాబట్టి రాబోయే ఊరు వళంగైమాన్ అనే వూరని తెలుసు. అక్కడ ఓ అమ్మవారి కోవెల వుందని కోవేలకి పక్కగా పెద్ద పెద్ద తామర పూలతో నిండిన చెరువు ఉంటుందని తెలుసు. ఆ ఊరంటే నాకేదో ఆకర్షణ. కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు యీ వళంగైమాన్ వూరినుంచి కొనసీమకు అక్కడ నుంచి తూర్పు దేశాలకు వలస వచ్చేయట. అలా వలస వచ్చిన కుటుంబాలలో మాదీ వొకటి. అందుకే నాకు ఆ ఊరిని చుస్తే మా తాతముత్తాతలని చూసిన ఆనందం కలుగుతుంది.

కనుచూపు మేర వరకు వరి, చెరకు, అరటి పంటలు, కొబ్బరి తోటలు యెంత చూసినా తనివి తీరటం లేదు అలా వో యెనిమిది కిలొమీటర్లు ప్రయాణించి వుంటాం. డప్పుల శబ్దాలు వినిపించేయి , అది చావు మేళం . పాపం ఎవరో పోయేరు , వారి ఆత్మకు శాంతి కలుగు గాక అని మనసులో ప్రార్ధించుకొని కళ్ళు తెరిచేను , ఎదురుగా ఎన్నో పాడెలు ( శవాన్ని తీసుకువెళ్ళే) మోసుకుంటూ వెళ్తూ చాలామంది కనిపించేరు . అన్ని ఖాళీవే అంటే పాడె మీద శవం లేదు , యిన్ని యెందుకు తీసుకు వెళ్తున్నారు . అంటే అంత మంది చనిపోయేరా ? అంత మంది ఒక్కసారే యెలాపొయేరు ? కొన్నిటి మీద మనుషులు పడుకొని వున్నారు , శవాలుకాదు . కొన్నింటి మీద కూ ర్చొని మోస్తున్న వాళ్ళతో ముచ్చట్లు ఆడుతున్నారు . అంతా అయోమయం .

మా డ్రైవర్ని అడిగితే అసలు విషయం తెలిసింది . ఏది మొక్కుబడని , కారు కావేరి నది కాలువ వొడ్డున ఆపించుకొని ఆ విచిత్రమైన మొక్కుబడులను కళ్లారా చూడడానికి నిర్ణయించుకున్నాం . కాలువ వొడ్డున ఇలాంటి పాడెలు చాలా పడేసి వున్నాయి . ఖాళీ గా అక్కడవరకు తెచ్చిన పాడేల మీద కొందరు పడుకుంటే అక్కడ వొక అతను శవాలలా పడుకున్నవాళ్లమీద తనవద్ద నున్న పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన కుండ నీళ్లల్లో వేపాకులు ముంచి వాటిని పాడేల మీద పడుకున్న వాళ్లమీద జల్లేడు , ఒక్కసారిగా డప్పుల మోత అందరు డప్పుల కి అనుగుణం గా అడుగులు వేసుకుంటూ అమ్మవారి కోవేలకి బయలు దేరేరు , అమ్మవారి దర్శనం అయిన తరువాత వారి వారి యిళ్ళ కి వెళ్లిడం తో వారి మొక్కు పుర్తయినట్లుట .

యీ మొక్కులు ఏమిటి అంటే ఎవరి కైనా ప్రాణం పోయేంత జబ్బు చేస్తే వాళ్ళు ఆ రోగి పేరున పాడే కడతాం అని మొక్కుకుంటారు . అమ్మవారి కృప వల్ల అతనికి జబ్బు తగ్గిన తరవాత అతను పాడే మీద పడుక్కొని , భార్య , చుట్టాలు వెనుక ఏడుస్తూ , కొడుకు అగ్ని పట్టుకొని ముందు నడుస్తూ వళంగైమాన్ దగ్గర వున్న కావేరి కాలువ వొడ్డున పాడే దించుతారు అక్కడ వున్న పూజారి అమ్మవారి కోవెల నుంచి తెచ్చిన పసుపు నీళ్లు వేపాకులతో అతని మీద జల్లుతారు , అంతవరకు మరణిచినత్లు పడివున్న అతను లేచి కూచుంటాడు . అంతా సంతోషం తో డప్పులు వాయిస్తూ డాన్స్ చేస్తూ వెళ్లి అమ్మవారిని దర్శించుకొని తమ ధన్య వాదాలు చెప్పుకొని యిళ్లకు వెళ్ళిపోతారు . యీ అమ్మవారిని " పాడి కట్టు అమ్మ " అని పిలుస్తారు .

ప్రతి సంవత్సరం శ్రావణ మరియు ఫాల్గుణ మాసాలలో వచ్చే ఆదివారాలలో యీ " పాడి కట్టు " పండగ జరు పుకుంటారు . కావేరి కాలువ దాటగానే రోడ్డు మీదనే వుంటుంది అమ్మవారి కోవెల . నల్లరాతి విగ్రహం , కళ కళ లాడుతున్న మోముతో సర్వాలంకారాలతో పాటు నిలువెత్తు నిమ్మకాయల దండలని కుడా అలంకరిస్తారు . అమ్మ వారి కి నిమ్మకాయలు సమర్పించడం అనేది తమిళుల అలవాటు . నిమ్మకాయల దండ అమ్మవారికి సమర్పిస్తే ఆమె వారి మంగళ సూత్రాన్ని కాపాడుతుందని తమిళతంబిల నమ్మకం .

ముందుగా యీ కోవేలకి ఎలా వెళ్లాలి , యీ అమ్మవారు ఎవరు అనేవి తెలుసుకుందాం . తమిళనాడు లోని తిరువారూర్ జిల్లాలో కుంభకోణం నుంచి మన్నార్ గుడి వెళ్ళే దారిలో కుంభకోణానికి పది కిలొమీటర్ల దూరంలో వుంది యీ వళంగైమాన్ అనే వూరు . వూరు మొదట్లోనే వుంది మారియమ్మ కోవెల . మూడు వందల సంవత్సరాలకి పూర్వం అమ్మవారు స్వయంభూగా వెలిసి నట్లు చెప్తారు .

మారియమ్మ ఎవరు అంటే రకరకాలైన కధలు ప్రచారంలో వున్నాయి . ఆది పరాశక్తి ఎండల ప్రతాపం నుంచి మానవులను రక్షించి వానలు కురిపించి దేశాన్ని సుభిక్షం గా వుంచడానికి పరాశక్తి శీతలామాతాగా వెలిసింది అంటారు . అందుకే యిక్కడ అమ్మవారికి శ్రావణ మాసం లో ఎండలు తగ్గి వర్షాలు మొదలయి నప్పుడు , ఫాల్గుణ మాసం లో చలి గాలులు తగ్గి ఎండా కాలం రాబోయే ముందు వాతావరణ మార్పులవల్ల ఉష్ణోగ్రతల సమతుల్యం కాపాడమని వేడుకుంటూ పండుగలు చేస్తారు .

పరాశక్తి యెవరు అన్నదానికి కుడా రకరకాల కధలు చెప్తారు . సతీ దేవి దేహభాగాల నుంచి స్వయంభూగా వుద్భవించి పరాశాక్తి గా పూజలందుకుంటోందనేది వొక వాదన . పరాశక్తి అంటే పరశురాముని తల్లి రేణుకా దేవే అని కొందరి వాదన . పార్వతీ దేవే మహిషాసురుని సంహరించిన తరువాత పరాశాక్తిగా అవతరించిందనేది యింకో వాదన . తమిళనాడులో అమ్మవారిని మారియమ్మ అని అంటారు .

300 సం .. పూర్వం వళంగైమాన్ గ్రామం లో నివసిస్తున్న కథగౌండర్ అనే రైతు అతని భార్య గోవిందమ్మ నివసిస్తూ వుంటారు . గోవిందమ్మ తిను బండారాలు తయారు చేసి చుట్టుపక్కల గ్రామాలలో అమ్ముతూ వుండేది . ఓ శుక్రవారం నాడు పుంగంచెరి అనే వూరిలో తినుబండారాలు అమ్ముకొనడానికై గోవిందమ్మ వెళుతుంది . తాను తెచ్చిన వస్తువలు అన్నీ అమ్ముడుపోయి . చాలా ధనం , ధాన్యం రావడం తో గోవిందమ్మ ఎంతో సంతోషించి అక్కడ వున్న కోవెల తటాకం లో స్నానం చేస్తూ బ్రాహ్మణ దంపతులు వో చిన్న పాపతో యెదురుగా వున్న కథా అయ్యనార్ కోవేలలోకి వెళ్ళడం చూస్తుంది .కొంత సేపటికి కోవేలలోంచి పాప ఏడుపు విని లోపలి వెళ్లి చూస్తే పిల్ల మాత్రమే అక్కడ వుంటుంది , బ్రాహ్మణ దంపతులు కనిపించరు . గోవిందమ్మ మాటలతో వూరి ప్రజలు చుట్టుపక్కల అంతా వెతికి చూస్తారు .కాని ఆ బ్రాహ్మణ దంపతులు కనిపించరు . పాప ముద్దు మోము అందరినీ మోహం లో పడేస్తుంది . పాపని మేముపెంచుకుంటాం అంటే మేము అంటూ అంతా గొడవ పడతారు . ఆఖరుకి పుంగంచెరి వూరి పెద్ద పెంచుకోవాలి అని తీర్మానిస్తారు . ఆ తీర్పుకు దిగులు పడ్డ గోవిందమ్మ వళంగైమాన్ చేరుకుంటుంది .

పుంగంచెరి లో ప్రజలు రకరకాల బాధలు పడసాగేరు . ఊరి ప్రజలకు ' అమ్మవారు ' (smallpox ) సోకింది . వూరి ప్రజలు శీతలామాత కి పూజలు నిర్వహిస్తారు , అప్పుడు అశరీరవాణి కోవెలలో దొరికిన పాప గోవిందమ్మకు చెందాలని , పాపని ఆమెకు వొప్పజెప్ప మని ఆజ్ఞాపిస్తుంది . దాంతో ప్రజలంతా పాపని తీసుకొని వళంగైమాన్ వెళ్లి గోవిందమ్మకు వొప్పజెప్పుతారు . ఆ పాప వళంగైమాన్ ప్రజలను ఎలాంటి బాధలు కలుగకుండా చూసుకుంటూ ఎన్నో మహత్తులు చుపించేదట . అలా ఆ పాప పదేళ్లు పెరిగి అమ్మవారు పోసి మరణిస్తుంది . పాప మరణం జీర్ణించుకోలేక పోయిన గోవిందమ్మ పాప సమాధి దగ్గరే గడప సాగింది . పాప సమాధి నుంచి స్వయంభూగా దేవి ప్రకటిత మైయింది . ఆమే వళంగైమాన్ మారియమ్మన్ అని పాడికట్టు అమ్మయని భక్తుల పూజలందు కుంటోంది .

అప్పటినుంచి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆమె ఆరోగ్య ప్రదాతగా , శక్తి స్వరూపిణిగా పూజలందుకుంటోంది .

విచిత్రమైన మొక్కులదేవిని దర్శించుకొని నవగ్రహ దర్శనానికి ఆలంగుడి వైపు గా ప్రయాణం సాగించేము .

నాగలక్ష్మి కర్రా

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda