గుడిలేని దేవత

18.215.185.97
సృష్టి ఆది నుండీ మానవుడు భగవంతుణ్ణి అనేక రకాలుగా ఆరాధిస్తున్నారు. పూజలు, వ్రతాలూ చేస్తున్నారు. గుళ్ళకూ, గోపురాలకూ వెళుతున్నారు. కానీ ఇన్ని చేస్తున్నా ఆది నుండి అతనికి ఒక శంక. 

భగవంతుడు ఉన్నాడా లేడా ? ఉంటే - కనిపించడేం?  ఎంత వెర్రివాడు? ఎంత గ్రుడ్డివాడు? ఎదురుగా తిరుగుతున్న దైవాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నాడు? “ దైవం మానుష రూపేణా “ అన్న శాస్త్రవాక్యాన్ని ఎందుకు నమ్మటం లేదు? 

అది ఎవరంటావా? 

అది నువ్వే తల్లీ! ఎందుకో తెలుసా !

త్రిమూర్తులు సృష్టి,స్థితి, లయాలు చేస్తారు. కానీ నువ్వు వారికంటే గొప్పదానివి. దానికి కారణం నువ్వు నీ బిడ్డలను సృష్టి, స్థితులు మాత్రమే చేస్తావుకానీ “లయం” మాత్రం చేయవు. అవసరమైతే వారికోసం నువ్వే “లయం” అవుతావు.

ఈ త్యాగం సృష్టిలో ఎవరు చేయగలరు? 

అమ్మా! మేము భూమిమీదకు వచ్చిన తర్వాత తొలుత చూసింది నీ మొహమే కదా? మొదట తాగింది నీ పాలు. తిన్నది నీ చేతి గోరు ముద్దలు. మొదట పలికిన పలుకులు “అమ్మ” అని. మేము మొదట దిద్దిన పదం కూడా “అమ్మ” అనే కదా! ఇంతెందుకు అసలు మా జీవితాలు ప్రారంభమైంది “నీ” నుంచే కదా!  తల్లీ! 

మేము ఈ ప్రపంచం లోకి వచ్చేముందు ప్రవేశించి మొదట నివసించినది నీ “గర్భవాసం” లోనే ! ఆ స్వర్గం లో, ఆ అద్భుత సీమలో  మనుషుల్ని పీడించే కామ,క్రోధాలు లేవు. మోహ, మద, మాత్సర్యాలు లేవు. వేదనలు,దుఃఖాలు లేవు. బరువు బాధ్యతలు లేవు. ఏ కోరికలు లేవు. ఉన్నదంతా ఒక్కటే ! ఆనందం, అపూర్వమైన ఆనందం. మాలో మేమే రమించుకునే అనిర్వచనీయమైన అనందం. ఆ మణి ద్వీపంలో మాత్రమే లభించే - అద్భుత అనందం. బ్లిస్!ఎటర్నల్ బ్లిస్! 

ఆ అపూర్వ ప్రపంచంనుండి 9  నెలల తర్వాత బయటకొచ్చి చుట్టూ పరికిస్తే ఏముంది? అరణ్యం- జనారణ్యం. కృత్రిమమైన మనుషులు,ముసుగులు ధరించిన మనుషులు,మొహాన అబద్ధపు నవ్వులు అతికించుకొని తిరిగే మనుషులు. ప్రతి మనిషి ఒక్కరుగా కాకా, ఇద్దరుగా ‘ద్విపాత్రాభినయం’చేస్తూ మహా నటనను ప్రదర్శిస్తున్న మనుషులు. అవసరమనుకుంటే అమితమైన ఆప్యాయతలు కురిపిస్తూ ఆకాశానికి ఎత్తే మనుషులు. అవసరం లేకపోతే నిర్దాక్షిణ్యంగా మొహం తిప్పుకుని వేళ్ళేవారు. అంతులేని కోరికలు తరుముతుంటే ముందుకు పరిగెత్తుతున్నవారు. డబ్బు అయస్కాంతంలా లాగుతుంటే అలుపెరగక వెనక పరిగెత్తుతున్నవారు.అనురాగాలు లేవు, ఆప్యాయతలు లేవు. రక్త సంబంధాలు లేవు. స్నేహ బంధాలు లేవు. ఉన్నది ఒక్కటే! స్వార్ధం. కరుడుగట్టిన స్వార్ధం. 

అయితే నువ్వు అనవచ్చు. ఎందుకు ప్రపంచాన్ని “నల్ల కళ్ళద్దాలతో” చూస్తావు. లోకంలో మంచివారే లేరా? ఎందుకు లేరమ్మా? చాలమందే ఉన్నారు. దేశం కోసం జీవితాలను త్యాగం చేసే త్యాగధనులు , నిస్వార్ధంగా సమాజం కోసం అహర్నిశలు సేవలు చేస్తున్న పుణ్య పురుషులు, అపర దానకర్ణులు, అహింసామూర్తులు లోకంలో ఎందరో ఉన్నారు. కానీ అతివిశాలమైన ఈ మృత్తికా జనక్షేత్రం లో “ఈ మేలిమి వజ్రాల” సంఖ్య తక్కువెకదమ్మా!

అమ్మా! 

మానవుడు ఎంతో చిత్రమైన వాడు. ఆటవిక దశ నుండీ నేటి దాకా ఎంతో ప్రగతి సాధించాడు. నిప్పు, చక్రం, వ్యవసాయంలాంటివి కనిపెట్టాడు. నేడు యంత్రాలు, కంప్యూటర్లు, రాకెట్లులాంటివి కనిపెట్టాడు. కానీ వీటితో పాటుగా సమాంతరంగా అపారమైన  జన క్షయం చేసే యుద్ధాలూ కనిపెట్టాడు. తుపాకులు,ఫిరంగులు, ఆఖరికి ఒక్క క్షణంలో ఈ ప్రపంచం మొత్తాన్ని భస్మీపటలం చేసే ఆటం బాంబులులాంటివి కూడా కనిపెట్టాడు. 

ఏమిటీ ద్వంద్వ ప్రవృత్రి? ఎందుకీ ప్రకృతి- వికృతి? 

అందుకే ఇటువంటి పరిస్థితిని వర్ణిస్తూ ఏనాడో “చార్లెస్ డికెన్స్” రాసిన మాటలను మన  మద్దిపట్ల సూరి గారు 65 ఏళ్ళ క్రితమే ఎంత శక్తివంతంగా చెప్పాడో చూడండి. 

“అదొక వైభవోజ్వల మహా యుగం .

వల్లకాటి అధ్వాన్న శకం.
వెల్లి విరిసిన విజ్ఞానం. 

బ్రహ్మజెముడుల అజ్ఞానం!!” ( ఏ టేల్ అఫ్ టూ సిటీస్” )

సరిగ్గా ఈ మాటలు నేటికీ కూడా వర్తించటం లేదా? ఈ మధ్య మా సుపుత్రులు ఇంకొక “అద్భుతాన్ని” కనిపెట్టారమ్మా. అదేంటంటావా?

“వృద్ధాశ్రమాలు”.

మా తల్లులు క్షేమంగా, హాయిగా,శేష జీవితాన్ని గడపాలని, ఈ కొత్త ఆవిష్కరణ చేసారు.  ఛ ఛ,మాకు నువ్వు మాకు బరువని, మా విందులూ, వినోదాలకు, విహారయాత్రలకు నువ్వు అడ్డమొస్తావని కాదు. ఇది కేవలం నీ సంతోషం కోసమే.అయితే మాకు తెలియని ఒక సత్యమేమిటో తెలుసా? నిన్ను వదిలి వెళ్ళే ఆ వృద్ధఆశ్రమాలకే త్వరలో మా కొడుకులు కూడా మమ్మల్ని పంపబోతున్నారని. (సజావైన కారణాలు కలిగిన సుపుత్రులకి క్షమాపణలతో). అయితే కావడిలో తల్లితండ్రులను మోస్తూ, సేవ చేసే మా R .P , జయకృష్ణ లాంటి పుత్రులు కూడా ఎందరో ఉన్నా ఇందాక చెప్పినట్లు ఈ ఆణిముత్యాల సంఖ్య తక్కువే కదా! 

ఈనాడు డబ్బు,అధికారం,బలం,యవ్వనం లాంటి వాటితో “నేను” అని విర్రవీగే ఈ “నేను” ఎక్కడనుంచి వచ్చిందమ్మా? ఈ “నేను” “నీ” నుంచే కదా వచ్చింది. తెలుగు నిఘంటువులో “అమ్మ” అనే పదానికి “తల్లి” అని మాత్రమే అర్ధమిచ్చారు కానీ అదొక విశాలమైన పదమనీ,దానికి ప్రేమ, కరుణ, త్యాగం,ఓర్పు,క్షమ, సహనం లాంటి అనేక అర్ధలున్నాయని ఎందుకివ్వలేదు? అది భాషకు అందనిది,అర్ధం పూర్తిగా ఇవ్వలేని నిఘంటువులోని ఒకేఒక పదమని కూడా ఎందుకివ్వలేదు?  

అందుకే ఆఖరుగా ఒక్కమాట రాస్తున్నాను. ఒకవేళ భగవంతుడు ప్రత్యక్షమై , ఏదన్న వరం కోరుకోమంటే జన్మ రాహిత్యాన్ని కోరుకుంటాను.కాదూ ఇంకొక జన్మ తప్పదంటే  ఇంకొకసారి నీ గర్భవాసంలో 9 నెలలు నివసించి ఆపై నేరుగా “మోక్షాన్ని” ప్రసాదించమని కోరుకుంటాను.

ఇలా నేను ఎంత రాసినా,వాస్తవంగా చూస్తే లక్ష కలాలైన నిన్ను పూర్తిగా వర్ణించలేవు కదా! 

ఇంటిలోని పూజామందిరంలో దేవతల విగ్రహాలు పెట్టి పూజించమని శాస్త్రాలు చెబుతున్నాయిగాని, వాటి మధ్య అసలు ఉంచి పూజించవలసిన విగ్రహం “నీదీ” అని ఎందుకు చెప్పలేదు? అందుకే నేను నా గుండెనే గుడి చేసి అందులో నిన్ను పెట్టి,పూజ చేస్తున్నాను.ఆ గుడి నేనున్నంతవరకు నాతోనే ఉంటుంది,చివరకు నాతోనే శిధిలమవుతుంది.

తల్లీ! నీకు వందనాలు.

(నా తల్లి “సీతమ్మ” గారి వర్ధంతి సందర్భంగా చేయబడ్డ రచన ఇది. దీనిని దేశంలోని “మాతృ దేవతలందరికీ” అంకితమిస్తున్నాను.)

శివకుమార్ కొంపల్లి, హైదరాబాద్.

Quote of the day

You cannot believe in God until you believe in yourself.…

__________Swamy Vivekananda