జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి

3.236.222.124
జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి వారు భక్తుల రక్షణార్ధం, వారి కోరిక మీద భగవంతుడు అర్చామూర్తిగా అనేక చోట్ల వెలిశాడని మనం ఇదివరకు చెప్పుకున్నాముకదా. అందులో ఒకటి శ్రీ వెంకటేశ్వరస్వామి వెలిసిన జమలాపురం క్షేత్రం.

ఈ ప్రాంతాన్ని ఇదివరకు సూచీగిరి అనేవారు. అంటే సూదిలాగా వున్న పర్వతం. నిటారుగా వుండే ఈ చిన్ని కొండని ఎక్కటానికి చాలా కష్టపడాల్సి వచ్చేదిట. పూర్వం జాబాలి మహర్షి ఇక్కడ తపస్సు చేసుకున్నారని, ఆయన కోరిక మీద శ్రీ వెంకటేశ్వరస్వామి ఇక్కడ వెలిశాడనీ అంటారు.

స్ధల పురాణం ప్రకారం: జాబాలి మహర్షి దశరధ మహారాజు కొలువులో గురు స్ధానంలో వున్నారు. ఆయనకి శ్రీరాముడంటే అత్యంత ప్రేమ. శ్రీరాముడు భార్య, తమ్ముడితో వనవాసానికి వెళ్ళినప్పుడు జాబాలి మహర్షి రాముడిమీద ప్రేమతో వారిని వెనక్కి తీసుకు రావటానికి చాలా ప్రయత్నించాడు.

తండ్రి ఆజ్ఞ పాలించాలనే శ్రీరాముడి దృఢ సంకల్పంతో, చేసేదిలేక వెనుతిరిగిన జాబాలి అయోధ్యకి తిరిగి వెళ్ళక తన శిష్యులతో తీర్ధయాత్రలు సేవిస్తూ, ఈ ప్రాంతానికి వచ్చి సూచీగిరి మీద తపస్సు చేసుకున్నాడని చెబుతారు.

సూచీగిరి మీద రెండు గుహలున్నాయి. జాబాలి మహర్షి తపస్సుకి మెచ్చి శ్రీహరి ఒక గుహలో స్వయంభూ వెంకటేశ్వరస్వామిగా వెలిశాడు. శ్రీహరి వెలిసిన గుహ కనుక అది వైకుంఠ గుహ అయింది. (దశరధ మహారాజు ఆస్ధానంలోని జాబాలి మహర్షి ఏమిటి, వెంకటేశ్వరస్వామి గురించి తపస్సు చెయ్యటం ఏమిటి వెంకటేశ్వరస్వామి కలియుగ దేవుడు కదా అని బోలెడు హాశ్చర్య పడిపోకండి. వెంకటేశ్వరస్వామి కృతయుగంలోనే వెలిశాడనీ, శ్రీరామచంద్రుడు నారాయణాచలములోని వెంకటేశ్వరస్వామి దర్శించుకున్నాడని వరాహ పురాణ కధనం.దీనిలో ఏమైనా తప్పుగా రాస్తే క్షమించండి..

దర్శన సమయాలు
ఉదయం 7 గం. లనుంచీ 1 గం. దాకా, తిరిగి సాయంత్రం 3 గం.లనుంచీ 7దాకా.
స్వామి వారి మహిమ:
ఇక్కడ వెలిసిన వేంకటేశ్వరుడికి ఉప్పల నారాయణ శర్మ పూజలు చేసేవాడు. అతి నిటారైన పర్వతశిఖరం పై భాగంలో ఉన్న వైకుంఠ గుహను రోజూ చేరుకొని అక్కడి దైవానికి ధూప, దీప నైవేద్యాలు సమర్పించేవాడు ఈయన వంశంలోని ఆరవ తరం వాడే అక్కుభట్టు. ఆయన కూడా స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. ఆయన కూడా వృద్యాప్యం వస్తుంది. వయస్సు మీద పడినా వేంకటేశ్వరుడి పూజకు మాత్రం ఎటువంటి లోటు రానించేవాడు కాదు.

ఈ క్రమంలో ఒకరోజు దైవానికి పూజ చేసిన తర్వాత తాను ముసలివాడినవుతున్నానని ఇక కొండపైకి రాలేనని బాధపడుతాడు. అప్పుడు వేంకటేశ్వరుడు నీ బాధను అర్థం చేసుకొన్నాను. అయితే నీ నైవేద్యం స్వీకరించనిదే నేను ఉండలేనని చెబుతాడు.

అందువల్లే తానే ఈ రోజు నీ వెంట మీ ఇంటివరకూ వచ్చి అక్కడే కొలువై ఉంటానని చెబుతాడు. అయితే తాను నీవెంట వచ్చే సమయంలో వెనక్కు తిరగకూడదని వేంకటేశ్వరుడు షరత్తు పెడుతాడు. ఇందుకు అక్కుభట్టు సంతోషంగా అంగీకరిస్తాడు.

అయితే కిందికి వచ్చే సమయంలో ఒక చోట పెద్ద శబ్దం వస్తుంది. దీంతో అక్కుభట్టు వెనక్కు తిరిగి చూస్తాడు. ఈ పరిమాణంతో వేంకటేశ్వరుడు ఇక్కడ సాలగ్రామ ప్రతిమగా మారిపోతాడు. ఈ విషయం ఆ గ్రామ ప్రజలందరికీ తెలిసి అక్కడ ఓ దేవాలయాన్ని నిర్మిస్తాడు.

మార్గము
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో వున్న జమలాపురం చేరుకోవటానికి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. విజయవాడనుంచి పాసెంజర్ రైలు, హైదరాబాద్ నుంచి వచ్చే కృష్ణా, గోల్కొండ ఎక్స్ ప్రెస్ లు ఎర్రుపాలెం స్టేషన్ లో ఆగుతాయి. అక్కడనుంచి జమలాపురం ఆటోల్లో చేరుకోవచ్చు. విజయవాడనుంచి దాదాపు 50 కి.మీ. ల దూరంలో ఉంది...

- శ్రీనివాస గుప్తా వనమా

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore