Online Puja Services

భగవంతుణ్ణి దూరం చేసే కోరికలు

13.58.77.98

మనకు భగవంతుడు ఇచ్చిది మాత్రమే సంతోషానికి కారణం అవుతుంది మనం కావాలి అని కోరుకున్నది దుఃఖనికి కారణం అవుతుంది. మనం బంధం లేదా మారేదైన కావాలి అనుకుంటామొ అది కచ్చితంగా కావాలి అని పరుగులు పెట్టవద్దు. మనం కోరుకున్నది మంచిది మన అదృష్టం బాగుంటే మన రాతలో ఉఁటే అది కచ్చితంగా మనకు దొరుకుతుంది లేదు అంటే ఎంత పరుగులు పెట్టిన దొరకదు పైపెచ్చు ఉన్న మనశ్శాంతి సంతోషానికి దూరం అవుతాం. అసలు ఇంకో మాట పరమాత్మకి కూడా దూరం అవుతాం. ఎలా అంటే దొరకని దాని గురించే ఆలోచిస్తం  దాని గురించే పరుగులు పెడతాం. ఆ పరమాత్మ ఎదురుగా ఉన్న కూడా చూడం తెలుసుకోవటానికి కూడా ప్రయత్నించం. మన కోరికలు వెంట పడుతూనే ఉంటాం అవి తీర్చుకోవడానికి పరుగులు పెడుతూనే ఉంటాం. 

భగవంతుడు అయ్యో నా బిడ్డ కోరుకున్నది మంచిది కాదు అని ఎన్నోసార్లు తప్పిస్తూ ఉంటాడు.  మనకి మంచి జరిగేది ఎదురుగా పెడతాడు పెట్టిన మనం లెక్కచేయం కన్నెత్తి చూడడం మనం కోరుకున్న దానికోసమే పరుగులు పెడుతూ చివరికి అలసిపోతాం.  

పాపం అప్పుడు భగవంతుడిని కూడ దూషిస్తం నేను అనుకున్నది కోరుకున్నది ఇచ్చావా నాకు అని. అలా అనుకుంటూ దుఃఖం కీ స్వాగతం పలుకుతాం మనశ్శాంతి పోగొట్టుకుంటాం మనం సంతోషంగా ఉండం మన వాళ్ళని సంతోష పెట్టలేము. ఎంత చోద్యం కోరుకునేది మనం కానీ బాధపడేది అందరు.వామ్మో కోరిక మనిషిని ఎంత మాయలో పడేస్తుంది.  

అమ్మ గా చెబుతున్న ఒకటి గుర్తుంచుకోండి  మన ప్రణాళిక కంటే ఆ తండ్రి ప్రణాళిక మంచిది గొప్పది ఎప్పుడు కూడా. మీ జీవితంలో మీరు కోరుకున్నది ఉన్నా పోయినా బాధపడకండి ఆ భగవంతుడు మీకు మేలు చేశాడు అని  సంతోషపడండి. 

పూర్వం నుంచి ఒక మాట ఉంది  ఏం జరిగినా మన మంచికే అని  అది 100% నిజం  ఎలా ఉంటుంది అంటే మన ప్రవర్తన  చిన్న కథ చెప్తాను వినండి 

ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడు న్యాయం అంటే చాలాప్రీతి కలవాడు. ప్రజలంటే చాలావాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు! అతడు నిత్యం భగవంతుడిని ఎంతో ప్రార్థించేవాడు. రోజూ చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం చేసుకునే వాడు.  

ఒక రోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు- “రాజా, నేను చాలా సంతోషపడ్డాను. నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు.” అప్పుడు ప్రజలంటే ఎంతోప్రేమగల ఆ రాజు ఇట్లా అన్నాడు- “భగవన్, నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి. నీ కృపవల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి. అయినప్పటికీ నాకు ఒకటే కోరిక! ఏంటంటే- మీరు నాకు కనిపించినట్టే, నన్ను ధన్యుణ్ణి చేసినట్టే, నా ప్రజలందరినీ కూడా కృపతో ధన్యులను చేయండి. వారికీ... దర్శనాన్ని ఇవ్వండి.”అన్నాడు 

భగవంతుడు రాజును చూసి “ఇది సంభవం కాదు కదా.....” అని ఏదో చెప్పబోయాడు. కాని రాజుమాత్రం చాలా పట్టు బట్టి “ఈ కోరికను తీర్చవలసిందే” అన్నాడు. భగవంతుడు చివరకు భక్తుడికి .... లొంగక తప్పలేదు. ఆయన అన్నాడు- “సరే, రేపు నీ ప్రజలందరిని తీసుకుని ఆ కొండ దగ్గరకు రా! నేను కొండమీద అందరికీ దర్శనమిస్తాను.” 

అప్పుడు రాజు అది విని చాలా.... ప్రసన్నుడై, భగవంతుడికి ఎంతో ధన్య వాదాలు చెప్పుకుని, మరుసటిరోజు ... నగరంలో దండోరా వేయించాడు-“రేపు  అందరూ కొండ దగ్గరకు నాతో పాటు... వచ్చి చేరవలసింది, అక్కడ మీకందరికీ భగవంతుడు దర్శనం ఇస్తాడు!” 

రెండవరోజు రాజు తన ప్రజలందరిని, స్వజనులతో పాటు తీసుకుని కొండవైపు నడవడం ప్రారంభించాడు, నడుస్తూ నడుస్తూ దారిలో ఒకచోట రాగి నాణేల కొండ కనిపించింది. ప్రజలలో నుండి కొంతమంది అటువైపు పరిగెత్తటం.... మొదలుపెట్టారు. 

అప్పుడు జ్ఞాని అయిన ఆ రాజు వారి అందరిని సమాధానపరచి,"అటువైపు ఎవరు దృష్టి పెట్టవద్దు, ఎందుకంటే... మీరు అందరూ భగవంతుడిని కలవ టానికి వెళ్తున్నారు. ఈ రాగి నాణాల వెనకాలపడి, మీ అదృష్టాన్ని కాలతన్ను కోకండి.” అన్నాడు. 

కానీ లోభం ఆశవల్ల వశీభూతులైన ప్రజలు కొంతమంది రాగి నాణేల దగ్గరే ఆగిపోయి ఆనాణేలను మూటకట్టుకుని తిరిగి తమ ఇంటివైపు వెళ్ళిపోయారు.  వాళ్ళు మనసులోఇలా అనుకున్నారు 'మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేర్చుకుందాము. భగవంతుడిని మనం తర్వాతైనా చూసుకోవచ్చు కదా' అని! 

రాజు మాత్రం ముందుకు సాగాడు! కొంతదూరం పోయాక.... వెండినాణాల కొండ కనిపించింది. మిగిలిన ప్రజలలో కొందరు అటువైపు పరిగెత్తారు.  వెండి నాణేలను మూట కట్టుకుని ఇంటివేపు వెళ్ళిపోయారు. వాళ్ళకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదు అని అనిపించింది. ‘వెండి నాణేలు మళ్ళీ దొరుకుతాయో తెలియదు,భగవంతుడు అయితే మళ్ళి అయినా దొరుకుతాడు.’ అనిపించింది.

ఈ విధంగా కొంత దూరం వెళ్లిన తర్వాత బంగారపు నాణేల పర్వతం కనిపించింది.  ప్రజలలో మిగిలినవారంతా, రాజు బంధువులతో సహా అటువైపే... పరు గెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళూ ఇతరుల లాగే ఈ నాణేలను మూటలు కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. 

ఇంక కేవలం రాజు రాణి మిగిలారు. రాజు రాణి తో అన్నాడు- “చూడు, ఈ ప్రజలు ఎంత ఆశపోతులో...! భగ వంతుడు లభించటం అంటే... ఎంత గొప్ప విషయమో వీరికి తెలియటంలేదు! భగవంతుని ఎదుట మొత్తం ప్రపంచం లోని ధనమంతా కూడా ఒకలెక్కకాదే!” నిజమేనని రాణి రాజు మాటలను సమర్థించింది. వారిద్దరూ ముందుకు సాగారు. 

కొంతదూరం వెళ్లాక రాణికి, రాజుకు ఏడురంగులలో మెరుస్తూ .... వజ్రాల పర్వతం కనిపించింది. ఇక రాణి కూడా ఆగలేకపోయింది.ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి, వజ్రాలన్నిటినీ మూట కట్టుకోవటం ప్రారంభించింది. అది చూసి రాజు ఎంతోబాధపడ్డాడు. మనసు విరక్తి చెంది, చాలా బరువైన... మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు.నిజంగా అక్కడ భగవంతుడు నిలబడి ఉన్నాడు. రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు- “ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు, నీ యొక్క బంధువులు? నేను ఎప్పటి నుంచో... ఇక్కడే నిలబడి మీఅందరికోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.” 

రాజు చాలా సిగ్గుతో,ఆత్మగ్లానితో తన తల దించుకున్నాడు. అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు “ఓరాజా, ఎవరు తమ జీవితంలో.... భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని వారు భావిస్తారో వారికి ఎప్పటికీ నేను... లభించను!వారు నా స్నేహాన్ని కానీ నా ప్రేమను కానీ ఎన్నటికీ పొందలేరు!” 

మన కోరికల వెనక పరుగులు ఆపి  ఆ భగవంతుడు ఇచ్చిన దానితో  తృప్తి గా సంతోషం గా ఉందాం.  మనకు కోరికలు శాశ్వతం కాదు ఆ పరమాత్మ ఒక్కడే శాశ్వతం ఆయన ప్రేమే శాశ్వతం  మన మనస్సు, బుద్ధి, అంతరాత్మతో భగవంతుని..... శరణు వేడుదం   మనం లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి   ఇష్టతతో పరమేశ్వరుని మన సొంతం  అనుకుంధాం  మన అన్ని కర్మల నుండి విముక్తులమై మోక్షాన్ని పొందుధాం ఆ తండ్రి పాదాల చెంత కాసింత చోటు సంపాదిందం  శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 

బి. సునీత 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya