శ్రీసుబ్రహ్మణ్యస్వామి చరితం.....2 వ భాగం

18.234.255.5
హాలాహలదరుడి  వీర్యం మ్రింగిన సురలకు ఆ ఘోరాగ్నిని కడుపున భరించలేక, జీర్ణముగాక మంటలు ఎగియ,  భరించలేక, హాహాకారాలు చేయనారంభించారు. ఆర్తనాదాలు మిన్నంటాయి. హరా! శంకరా! భక్తవశంకరా! ఆశతో తమ వీర్యాన్ని మేమందరం కొంచెముగానే మ్రింగాము. ఆ వీర్యం కాలాగ్ని బోలు మాఉదరమును దహించువేయుచున్నది. తమరు కరుణించి ఈ విపత్తునుండి మమ్ము కాపాడవలె.. అని ముక్త కంఠముతో ఎలుగెత్తి ప్రార్థించారు. అంత దయాళువు అయిన శంకరుండు, ఓ హరి!బ్రహ్మదేవా!ఓ మహేంద్ర! ఓ ఆసురులారా మీరు వెంటనే వాంతులు చేసుకొనుడు. లేకున్న మీఉదర భాగం మండిపోవును అని చెప్పగా వారును అట్లే వాంతి చేసుకున్నారు. లావా వాంతి చేయగా, శివ వీర్యమంతా బంగారంగా మారి ఆకాశానికి ఎగిరిపోయినది. దేవతలంతా హరుని ప్రార్థించి వెళ్ళి పోయారు.
 
అగ్నిహోత్రుడికి శివుడు ఏమి చెప్పనందున, వాంతి చేయక , తాను మ్రింగిన శివవీర్యం కడుపున భరించలేక శివుడిని ప్రార్థించాడు. అపుడు పరమశివుడు, ఓ అగ్నిదేవా! ముందు వెనుక చూడక మంచి చెడు ఆలోచింపక నా వీర్యాన్ని మ్రింగావు. నా రేతస్సు నీకు జీర్ణముకాదు.  ఒక మహోజ్జ్వల దాహకశక్తి గలదీ వీర్యము. ఒక పవిత్ర స్త్రీ మూర్తి కడుపున పడిన కానీ నీ గర్భము చల్ల బడదు." అని అనెను.      మంటలు చల్లార్చు కొను విషయము తెలుసుకొన్న అగ్నిదేవుడు కొంత మనంబున శాంతించి, ఈ బడబాగ్ని వీర్యాన్ని భరించగల పావన స్త్రీ మూర్తి ఎవరు? అని ఆలోచిస్తూ అన్వేషణ ప్రారంభించాడు.    ఒకనాడు దైవ యోగముతో సప్త మహర్షులు  తమతమ భార్యలతో ఆకాశగంగా తరంగాలలో జలక్రీడా వినోదలీలలలో తెలియాడుచున్నారు. అనంతరం వారు హవ్యము నీయనెంచి అగ్నిహోత్రుని ప్ర్రార్తింపగా, అగ్నిదేవుడా హవ్యాన్ని గ్రహించి దేవతలందరకు పంచి పెట్టాడు.

కానీ అగ్నిహోత్రుడు, మహర్షుల భార్యల రూపవిలాస లావణ్య శోభలను గాంచి, మన్మధ ప్రేరితుడాయెను. వారిని పొందని తన జీవితం వ్యర్థమని, ఆ పాపమునకు ఒడిగట్టి మహర్షుల కోపాగ్నికి బలికాలేక, పాపకార్యము చేయలేక, ఒక గొప్ప సరోవరం చేరి ఆత్మహత్య చేసుకొన ప్రయత్నిoచెను.      ఈ విషయాన్ని గ్రహించిన అగ్నిదేవుని అర్ధాంగి, మహర్షుల భార్యల రూపాన్ని ధరించి, అగ్నిహోత్రుని కోరిక తీర్చినది. కానీ ఆమె మహాపతివ్రత ఆరుoధతి రూపాన్ని ధరించలేక పోయినది. అప్పుడు సంతుష్టుడయిన అగ్ని దేవుడు, తనలోని శివవీర్యాన్ని ఆ ఆరుగురు మహర్షుల పత్నుల రూపమున నున్న స్వాహాదేవి ఆరు గర్భాలల్లో వేసాడు. ఆమె కూడా ఆవీర్యాన్ని భరించలేక ఆ వీర్యాన్ని  కైలాస శిఖరంపై పడవేసి తన బాధను బాపుకుంది. ఆ శ్వేతాద్రి కూడా ఆ భారాన్ని ఆ జ్వాలను భరింపలేక వాయుదేవుని సహాయంతో  ఆకాశగంగలోనికి జారవిడిచినది.  ఆకాశగంగ కూడా  ఆ శంకరుని మహోగ్రానల వీర్య తేజాన్ని భరింపలేక తరంగాల మూలాన రెల్లు పొదల లోనికి నెట్టింది.

అపుడు ఆరుగురు కృత్తికాకన్యలు శాప వశాన పద్మరూపమున ఆ మడుగునున్న నున్నారు. రెల్లు గడ్డి నుండి వాలు జారిని ఆ వీర్యం, ఆరు భాగలై పుష్పములలో పడగా ఆరుగురు బాలురు, మార్గశీర్ష శుక్ల షష్టి తిధినాడు జన్మనెత్తారు. ఆ ఆరుగురు పార్వతి దేవి వల్ల ఒక్కశరీరముతో ఆరు ముఖములు, పండ్రెండు కరములతో ఒక బాలుడు కాగా, దేవతలు పుష్ప వర్షం కురిపించారు. దేవతలoదరు పరమానందభరితులయ్యారు. గంధర్వులు పరవశంతో నాట్యం గావించారు. 

కానీ పొరపాటు పడ్డ ఆరుగురు మునులు, తమ పత్నులు అగ్నిదేవుడు వల్ల కళంకితులయ్యారని వారిని త్యజించారు. 

అగ్నిదేవుని సతి స్వాహాదేవి, ఆ ఆరుగురు మహర్షుల వద్దకు వచ్చి, హస్తాలు జోడించి, మునిశ్రేష్టులారా! మీ భార్యలు మహాపతివృతలు. అటువంటి వారిని మీరు వీడుట మీకు ధర్మమా? వారిని అనుగ్రహించoడి.." అని ఎంత గానో చెప్పి బ్రతిమలాడినది. వారు ఏ మాత్రము కనికరించలేదు.
 
బాలుడు సుబ్రహ్మణ్యుడు ఆరు ముఖాలతో, ఆ ఆరుగురు కృత్తికా స్థనాలయందు పాలు త్రావుచున్నాడు. అంత ఆ ఆరుగురు ఋషిపత్నులు స్వామి చెంతకు  చేరి, " కుమారా! జగన్మోహనాకారా! మేము కులటలమై మిము కన్నామని, లోకోపనిందకు గురి అయి, మా పతులచే త్యజించబడినాము. మాకింకెవరు దిక్కులేరు,, నీవు తప్ప,    నీకు మేము తల్లులమైనాము. మాకు రక్షకుడవు నీవే' - అని దుఃఖిస్తూ ప్రార్థించారు. ఆ ఆరుగురు తల్లులను గాంచి, స్వామి దయతో, "తల్లులారా! పతివ్రతా శిరోమణులారా! నేను మీకూ కుమారుడనే, మీ దుఃఖము మరచి నావద్దనే ఉండండి"--అని తన వద్దనే ఉంచుకొని, వారికి మాతృప్రేమను పంచిఇచ్చాడు. ఇలా కొంతకాలము జరిగినది.  

(ఇంకా ఉంది) 

L. Rajeshwar

Quote of the day

Among the many misdeeds of the British rule in India, history will look upon the act depriving a whole nation of arms as the blackest.…

__________Mahatma Gandhi