Online Puja Services

వాతాపికి, గణపతికి సంబంధం ఏమిటి?

3.135.185.194
ఏ కొత్త విషయాన్నీ ప్రారంభించినా, అది సంగీతం కావచ్చు, నాట్యం కావచ్చు, లేదా నాటకం కావచ్చు. అసలు మనం ఏ పని ప్రారంభించాలన్నా , శుభకార్యాలతో సహా ఏదైనా సరే, మనం గణేశ ప్రార్ధన తో ప్రారంభిస్తాం. కాబట్టి మనం హితోక్తి వారి ఈ జిజ్ఞాస కార్యక్రమాన్ని కూడా గణేశ సంబంధమైన ప్రశ్న తో, ఆ సందేహ నివృత్తితో ప్రారంభిద్దాం. 
 
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. సహజంగా మనం ఏ సంగీత కచేరీ కి వెళ్లినా, వాళ్ళు గణేశ ప్రార్ధనతో కచేరి ప్రారంభిస్తారు. ముఖ్యంగా, వాతాపి గణపతిమ్ భజేహం అనే కృతితో ప్రారంభం చేస్తారు. హంసధ్వని రాగం తో కూడిన శ్రీ ముత్తుస్వామి దీక్షితులు (దీక్షితార్) గారి రచన ఈ వాతాపి గణపతిమ్ భజేహం.  అసలు ఈ వాతాపి గణపతి అంటే ఎవరు? వాతాపికి, గణపతికి ఏమిటి సంబంధం? 
 
వాతాపి అంటే అది ఒక నగరం. అది ఈ కాలం లో మనం పిలుచుకునే బాదామి. ఈ వాతాపి అనేది పూర్వం చాళుక్యులకు రాజధానిగా ఉండేది. సంగీత త్రయం లో ఒకరైన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ గారు శ్రీవిద్యోపాసకులు. వారి కీర్తనలలో అనేకమైన  శ్రీవిద్యోపాసన రహస్యాలను, కుండలిని రహస్యాలను పొందుపరచి చక్కని కృతులు చేశారు. ఇందులోనే వారు మూలాధార స్థితం అంటారు. వినాయకుడు మూలాధార చక్రంలో స్థితుడై ఉంటాడు అనే ఒక చక్కని విషయాన్నీ పొందుపరచారు. 
 
ఇక ఈ వాతాపి గణపతి ఏమిటి అంటే , మనకు లోకంలో వాడుకగా శ్రీశైల మల్లిఖార్జునుడు, తిరుపతి వేంకటేశ్వర స్వామి, కాశి విశ్వేశ్వరుడు ఇలా చెప్పుకుంటూ పోతాం. అలాగే వాతాపి లో కొలువైన వినాయకుడే వాతాపి గణపతి. 
 
ఈ చాళుక్యుల రాజధాని వాతాపిలో ముఖ్యంగా, ముందుగా ఈ గణపతి ఉండేవాడు. తరువాత పల్లవుల సేనాని అక్కడనుండి ఈ విగ్రహాన్ని తీసుకువచ్చి, తిరుచ్చిన్ కట్టంకుడి అనే వూరిలో దీనిని స్థాపించాడు. 
 
ముత్తుస్వామి దీక్షితార్ గారు తిరువారూర్ అని అతని సొంత వూరికి చుట్టుపక్కల వున్న అన్ని  షోడశ (16) గణపతుల మీద 16 కృతులు చేశారు. షోడశ గణపతుల మీద చేసిన కృతులలోకెల్లా అత్యంత  సుప్రసిద్ధమైనది ఈ వాతాపి గణపతిమ్ భజేహం. 
 
ఇంతకూ ఈ వాతాపి అనే పేరు ఎలా వచ్చింది అంటే, మనకు ఈ కథ వ్యాస భారతం లోను, విష్ణు పురాణం లోను, భాగవత పురాణం లో కూడా వుంది. హిరణ్యకశిపుడు సోదరి సింహిక కి, విప్రచిత్తి  అనే రాక్షసుడికి ఈ రాక్షస దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలే వాతాపి, ఇల్వలుడు. ఇది ఒక గాధ.   ఇంకొక పురాణం ప్రకారం ఏంటంటే హిరణ్య కశిపుని కుమారుడైన ప్రహ్లాదుడి సోదరుడు హ్లాదుడికి, దమని కి వీరిద్దరికి పుట్టిన వారు ఇల్వలుడు, వాతాపి అని అంటారు. ఏది ఏమైనా వీరిద్దరూ రాక్షసులు. దానికి తిరుగు లేదు. 
 
వీరిద్దరి దినచర్య ఏమిటి అంటే, వీరు ఎందుకో ఒక విప్రుడి మీద పగ బట్టారు. వీరికి కావలసిన వరాలేవో ఆ విప్రుడు వీరికి ఇవ్వలేదు. వీళ్ళు కోరుకొన్న విద్య నేర్పలేదు. దీనితో అతని మీద పగ బూని, మొత్తం విప్రులని చంపి తినాలని నిర్ణయించుకొన్నారు. విప్రులు నడిచే దారిలో కాపు కాసి, పన్నాగం పన్ని, ఆ దారిలో వెళ్తున్న విప్రులను హతమార్చి భుజించేవారు. ఆ పన్నాగం ఏమిటంటే, ఈ వాతాపి ఒక మేకగా మారి వుండే వాడు. ఇల్వలుడు ఒక విప్రుని వేషం ధరించి ఆ దారిలో వెళుతున్న విప్రులను అడ్డగించి, ఈ రోజు మా ఇంట్లో పితృ కార్యం వుంది కాబట్టి మీరు భోజనానికి రావాలి అని వాళ్ళను తీసుకు వెళ్ళేవాడు. ఆ కాలం లో పితృ కార్యం లో మాంసాహారం కూడా పెట్టేవారు.  అది ఆ యుగ ధర్మం.  తరువాత కలి  ధర్మం లో కలి  ప్రభావం వల్ల కొన్ని విసర్జించాల్సినవి వున్నాయి. 5 రకాల విధులను నిషేధించాల్సిన ధర్మం కలియుగంలో వుంది. అందులో ఒకటి మాంసాహార నిషేధం. ముఖ్యంగా పితృకార్యాలలో మాంసాహార నిషేధం. 
 
అయితే ఆ బ్రాహ్మణుడు రాగానే, ఇల్వలుడు ఆ మేకను వండి ఆ మాంసాన్ని ఆ బ్రాహ్మణుడికి పెట్టడం, ఆ బ్రాహ్మణుడు భుజించాక, వాతాపి బయటకు రా అని ఇల్వలుడు పిలవటం, వాతాపి ఆ బ్రాహ్మణుని పొట్ట చీల్చుకొని రావటం, తరువాత వీళ్లిద్దరు కలిసి ఆ బ్రాహ్మణుని వధించి భుజించడం జరిగేవి. ఇది వాళ్ళ దినచర్య. 
 
ఇలా జరుగుతున్న సమయంలో ఒకానొక రోజున, అగస్త్య మహర్షి తన భార్య ఐన లోపాముద్ర కోసం కొన్ని నగలు,వస్త్రాలు మరి కొన్ని ఇతర అవసరాల కోసం ఆ దారిలో వెళుతుంటే ఈ ఇల్వలుడు, వాతాపిల ఆతిధ్యానికి వెళ్లవలిసి వచ్చింది. అయితే అగస్త్యుడు చాల గట్టివాడు కావటం చేత, మహా మేధావి కావడం చేత వీళ్ళ పన్నాగాన్ని ముందే పసిగట్టి, వాతాపి ఎప్పుడైతే మేక మాంసం రూపం లో పొట్ట లోపలికి వెళ్ళాడో, ఆ వెంటనే ఒక ఉపాయం కోసం , ఉన్నపాటున అక్కడే, ఆ స్థలం లో కూర్చుని, విఘ్నేశ్వరుణ్ణి, "శ్రీ శంకర సుత, గజానన, గణాధ్యక్షక, ఉమానందన, పార్వతి నందన" అని ఒక శ్లోకం చదివి ప్రార్ధించాడు. ఆ వెంటనే ఉపాయం తట్టి జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం అన్నాడు. వెంటనే కడుపులోకి వెళ్లిన వాతాపి జీర్ణం అయిపోయాడు. ఇది గ్రహించిన ఇల్వలుడు వెంటనే పారిపోయాడు.  కానీ అగస్త్యుడు అతడిని వెంబడించి అతడిని సంహరించడం జరిగింది. 
 
ఈ కథ వల్ల, వాతాపి అక్కడ సంహరింపబడటం వల్ల, వాతాపి ఆ ప్రాంతాన్ని ఏలి యుండటం చేత ఆ ప్రదేశానికి వాతాపి అని పేరు వచ్చింది.  తరువాతి కాలం లో ఈ ప్రాంతాన్ని చోళులు, చాళుక్యులు, పల్లవులు మొదలైన వారంతా పరిపాలించారు. వీరందరూ కూడా గొప్ప కళా పోషకులే. కాలక్రమేణా అది ఇప్పుడు బాదామి గా మారింది.  
 
మహిషాసురుడు ఏలిన ప్రాంతం గాబట్టి ఏ విధంగా మహిషపురం ఇప్పుడు మైసూర్ అయిందో అలాగే ఈ వాతాపి కూడా. 
 
అదండీ.. ఈ వాతాపి గణపతిమ్ భజేహం కీర్తన విశేషం.. 
 
- సాయి ప్రసన్న రవిశంకర్
 
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha