Online Puja Services

ఆరోగ్యంగా ఉండాలంటే సనాతన సూత్రాలు

3.17.154.171
ఆరోగ్యంగా ఉండాలంటే అనాదిగా వస్తున్న సనాతన పంచ ఆరోగ్య సూత్రాలు పాటించాల్సిందే..!
 
 
అల్లం
 
జీర్ణవ్యవస్థకు అల్లం చేసే మేలు
1. భోజనాగ్రే సదా పధ్యం, లవణార్ద్రకభక్షణమ్,
రోచనం దీపనం వహ్ని, జిహ్వాకంఠ విశోధనమ్.
 
తా: భోజనానికి ముందు అల్లము, సైంధవ లవణము కలిపి నమిలి తినిన జీర్ణశక్తి వృద్ధిచెందుతుంది. గొంతు నాలుక పరిశుద్ధమై, రుచి కలుగుతుంది.
 
భావం :- మనం రాత్రి తిన్న అన్నం, తీసుకున్న కొన్ని ఆహార పదార్ధాల వలన సంపూర్ణంగా అరగక పోవచ్చును, దాని వలన ఒంట్లో 'పసరు' జమ అవుతుంది. పసరు శరీరంలో ఎక్కువ జమ అయితే వికారం, తలనొప్పి, బద్ధకం ఏర్పడుతుంది. ఏ పని చురకుగా చేయాలనిపించక పోవడం జరుగుతుంది. అందుకే పరిగడుపున అల్లం తింటే జీర్ణ వ్యవస్థ సాఫీగా సాగి శరీరంలో ఏర్పడ్డ పసరును మలం ద్వార బయటకు పంపేందుకు దోహద పడుతుంది. శరీరం తేలిక అవుతుంది. మనిషి ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది.
 
వాకింగ్ 
 
రాత్రి భోజనం తర్వాత వాకింగ్ తప్పనిసరి
2. భుక్త్వా శతపదం గచ్ఛేత్,శయనై స్తేన తు జాయతే,
అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.
భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,
ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః
 
తా: భోజనానంతరము నూరడుగులు నడచిన అన్నము యుక్త స్థానమున చేరి, మెడ, నడుము, మోకాళ్లు వీటియందు సుఖము కలుగును. భుజించిన తోడనే కదలక కూర్చున్నచో పొట్ట పెరుగును, పడుకొన్న వారికి కొవ్వు పెరుగును, మెల్లగా అటునిటు తిరిగిన ఆయుర్వృద్ధి కలుగును, పరుగెత్తినచో ఆయుఃక్షీణము.
 
*భావం :- ప్రస్తుత కాలంలో నైట్ డిన్నర్ లేటుగా చేసి తిన్న తర్వాత ఓపిక లేక అల కుర్చీలో కూర్చుని కాసేపు టివి చూసి డైరెక్ట్ పడుకుంటున్నారు. దీని వలన తిన్న ఆహరం పేగులలో కదలిక కలగక ఒకే చోట ఉండి పొట్ట భాగం పెరగడం జరుగుతుంది. అందుకే తిన్న తరవాత కనీసం ఓ వంద అడుగులు నడవమని సూత్రీకరించారు. రాత్రి భోజనం చేసాక కనీసం ఓ పది నిమిషాలు వాకింగ్ చేస్తే జీర్ణ వ్యవస్థ మెరుగు పడి శరీర ఆకృతి అందగా ఉంచుతుంది.
 
తమలపాకు
 
రాత్రి భోజనం తర్వాత  తాంబూలం వేసుకోవాలి.
3. భుక్త్వా శతపదం గచ్చేత్, తాంబూలం తదనంతరమ్,
వామపార్శ్వే తు శయనం, ఔషధై: కిం ప్రయోజనమ్.
 
తా: భోజనానంతరము నూరడుగులు నడచి, తదనంతరము తాంబూలసేవనము చేసి, ఎడమవైపున శయనించుచో యిక ఔషధము లెందుకు? ( ఆరోగ్యవంతుడై యుండునని భావము.)
 
భావం :- రాత్రి డిన్నర్ చేసాక కొంత సమయం వాకింగ్ చేసాక, తాంబూలం తమలపాకు  తినడం వలన జీర్ణ వ్యవస్థ మెరుగు పడి కఫం, పైత్యం కలగకుండా నివారించి, మలబద్ధకం కలుగకుండా కాపాడుతుంది.
 
 పడుకునేప్పుడు ఎడమ చేతు వైపు తిరిగి పడుకునే సూత్రం ఎందుకంటే శరీరంలో గుండె ఎడమవైపు ఉంటుంది. ఎడమవైపు తిరిగి పడుకుంటే గుండెకు రక్త ప్రసరణ సమృద్ధిగా జరికి గుండె జబ్బులు, ఇతర అనారోగ్యాలు కలుగకుండా కాపాడుతుంది. ఈ పద్దతులను అలవాటు చేసుకున్న వ్యక్తీ అనారోగ్య సమస్యలతో బాధపడడు అని భావం.
 
ఆహారం
 
మితహారం ఆరోగ్యం.. అతి ఆహారం అనారోగ్యం
 
4. అనాత్మవంతః పశువత్ భుంజతే యోఽప్రమాణతః,
రోగానీకస్య తే మూలమ్, అజీర్ణం ప్రాప్నువంతి హి.
 
తా: ఎవరైతే మిత మనేది లేకుండా ఎల్లప్పుడూ ఎదో ఒకటి నములుతూ ఉంటారో వారు అజీర్ణవ్యాధికి గుఱి అవుతారు. అజీర్ణమే సర్వరోగములకును మూలము. ( మానవులు ఆయా వేళలయందే మితముగా భుజించవలెను.)
 
భావం :- ఎప్పుడు పడితే అప్పుడు ఎదో ఒకటి నోట్లో వేసుకుని నోరు ఆడించే అలవాటు ఉన్న వారికి వారు తీసుకున్న ఆహారం ఓవర్ లోడ్ అయ్యి శరీరంలో జటరాగ్ని సరిగ్గా పనిచేయక ఉభకాయం ఏర్పడి ఆనారోగ్యంపాలు పడుతారు. మనిషి శరీరానికి కావలసిన ఆహారం తీసుకునే 'సమయ' పద్దతులలో తేడా రాకుండా జాగ్రత్త పడాలి. మధ్య మధ్యలో చిరుతిండ్లు తినకూడదు. తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. మితహారం ఆరోగ్యం, అతి ఆహారం అనారోగ్యం.
 
భోజన సమయం
 
భోజన సమయంలో మాట్లాడకుండా తినాలి.
 
5. భుంజానో న బహు బ్రూయాత్, న నిందేదపి కంచన,
జుగుప్సికధాం నైవ, శృణుయాదపి ఆ వతెత్.
 
తా: భోజన సమయమున అధికముగా మాట్లాడరాదు. పరనిందా ప్రసంగము అసలే కూడదు. కధా ప్రసంగములు చేయరాదు, విననూ రాదు...
 
*భావం :- అన్నం తినే సమయంలో ముచ్చట్లు పెట్టకుండా మౌనంగా తినాలి. అల మౌనంగా, ప్రశాంతంగా తీసుకున్న ఆహారం అమృతతుల్యం అవుతుంది. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తినేప్పుడు అధిక ప్రసంగాలు చేస్తూ మధ్యలో భావోద్వేగాలకు గురౌతు. లేదా టివి చూస్తూ, లేదా పరాయి వాళ్ళ విషయ ప్రస్తావన చేస్తూ వారిని నిందిస్తూ భోజనం చేయడం వలన ఆనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. అన్నం తినేప్పుడు మనస్సు ప్రశాంతంగా పెట్టుకుని మాట్లాడ కుండా మౌనంగా తింటే, మనం తిన్న ఆహరం పూర్తిగా అరిగే వరకు హర్మోన్సు బ్యాలెన్స్ గా ఉంచబడుతాయి. 
ఆరోగ్యంగా వుంటారు
 
- కృష్ణవేణి శఠగోపన్ 
 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore