బ్రహ్మకే మాయ చూపించిన చిన్ని కృష్ణుడు

3.235.105.97
*HARE RAMA HARE RAMA 
RAMA RAMA HARE HARE
HARE KRISHNA HARE KRISHNA 
KRISHNA KRISHNA HARE HARE*
 
కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి! 
విమల శృంగంబును వేత్రదండంబును జాఱి రానీక డాచంక నిఱికి! 
మీగడపెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత మొనయ నునిచి 
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి. 
 
సంగడీల నడుమ జక్కగ గూర్చుండి, నర్మభాషణముల నగవు నెఱపి 
యాగభోక్త కృష్ణు డమరులు వెఱగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె!
 
అందరి మధ్య నిలబడి కృష్ణపరమాత్మ తనమీద ఉన్న ఉత్తరీయం తీసి, నడుముకి కట్టి అందులోకి వేణువును దోపి, ఆవులను తోలే కర్ర, ఊదే కొమ్ముబూరను ఎడమ చంకలో పెట్టుకుని, ఎడమచేతిలో చద్ది అన్నపు ముద్ద పెట్టుకుని గోపబాలురు ఎంగిలి చేసి ఇచ్చిన ఊరగాయ ముక్కలను తన వేళ్ళ సందులో పెట్టుకుని దానిని నంజుకుంటూ అన్నమును తింటున్నాడు. కృష్ణుడు తన చేతిలో పెట్టికున్నది గతరాత్రి వండిన పదార్ధం. నిలవున్న పదార్థం ఈశ్వర నివేదనమునకు పనికిరాదు. ఒక్క బెల్లం ముక్కకు మాత్రమే ఆ అర్హత ఉన్నది. దానికి నిలవ దోషం లేదు. ఆయన యాగభోక్త మామూలుగా పెడితే తినడు. యాగం చేసి ‘ఓం నమోనారాయణాయ స్వాహా’ అని మంత్రం చెప్పి స్రుక్కు, సృవములతో నేతిని పోస్తే హవిస్సు వేస్తే, అగ్నిముఖంగా మాత్రమే స్వీకరించే పరమాత్మ ఈవేళ గోపబాలురందరితో కలిసి ఎంగిలి ముక్కలు నంజుకుని తింటున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తింటుంటే అమరులు అన్ని లోకములనుండి వచ్చేశారు. ‘ఏమి ఆశ్చర్యం! యజ్ఞయాగాది క్రతువులు చేస్తే తప్ప హవిస్సులు స్వీకరించని పరమాత్మ  గోపబాలురతో కలిసి స్నానం చెయ్యకుండా ఇంతమంది మధ్య కూర్చుని తాము ఎంగిలిచేసి పెట్టినది తింటున్నాడు. ఏమి ఆశ్చర్యము’ అని వారందరూ తెల్లబోయి చూస్తున్నారు. రంభాది అప్సరసలు పొంగిపోయి నాట్యములు చేస్తున్నారు. దేవతలు అందరూ ఆనందముతో ‘గోవిందా గోవిందా’ అని అరుస్తున్నారు. ఈ మాటలు సత్యలోకంలో ఉన్న బ్రహ్మగారి చెవిన పడ్డాయి. ఈ అల్లరి ఏమిటో చూసి రావాలని ఒకసారి సత్యలోకంనుండి బయటకు వచ్చి భూమండలం వైపు చూశాడు.  బృందావనంలో శ్రీకృష్ణుడు గోపబాలురందరితో కలిసి తింటున్నాడు. ‘ఈ ఎంగిలి ముద్దలు ఎడమచేతిలో పెట్టుకుని తింటున్నవాడు పరబ్రహ్మా? అఘాసురుని కడుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఇతడు బ్రతికించాడా? యాగములందు తప్ప హవిస్సులు స్వీకరించని పరబ్రహ్మ ఇంత సులభుడయినాడా? ఇది నేను నమ్మను. ఆ పిల్లవాడు పరబ్రహ్మము కాదు’ అని అనుకున్నాడు. 
 
‘నేను చతుర్ముఖ బ్రహ్మను ఇంటి పెద్దను. నాలుగు ముఖములు కలవాడిని. వేదములు చదివినవాడిని. నామాయ తప్పించుకోలేడు’ అని వెంటనే ఒక మాయ చేసాడు. అక్కడే నీరు త్రాగి పచ్చిక తింటున్న ఆవులని, దూడలని, ఎద్దులను కొంచెం దూరముగా తీసుకువెళ్ళి మాయం చేసేసి, వాటినన్నిటిని ఒక కొండగుహలో పెట్టేసాడు. అన్నం తింటున్న పిల్లలు కృష్ణా మన ఆవులను దూడలు కనపడటము లేదని చెపితే నేను వెళ్ళి వెతికి తీసుకువస్తాను. మీరు అన్నం తింటూ ఉండండి’ అని చెప్పి ఆవులను వెతకడానికి కృష్ణుడు బయలుదేరి వెళ్ళాడు. వాటి పాదముల జాడలు కనపడ్డాయి. చాలా దూరం వెళ్ళాడు. ఒకచోట మంద అంతా విడిపోయి వెళ్ళినట్లు కనపడింది. ఆవులు కనపడక పోయేసరికి తిరిగి వెనక్కి వచ్చేశాడు. ఈలోగా బ్రహ్మగారు కృష్ణుడు ఏమి చేస్తాడో చూద్దామని అక్కడ ఉన్న గోపాల బాలురను మాయం చేసేశాడు. ఇక్కడ చూస్తే గోపాలబాలురు లేరు. అక్కడ ఆవులు, దూడలు, ఎద్దులు లేవు. సాయంకాలం అవుతున్నది. ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. వెళ్ళగానే మా పిల్లలేరి, మా ఆవులేవని అడుగుతారు. అవి ఏమైపోయాయి అని ఒకసారి దివ్యదృష్టితో చూసాడు. తన నాభికమలంలో నుండి పుట్టిన బ్రహ్మగారికి ఈవేళ మోహబుద్ది పుట్టింది. ఆయన తనమీద మాయ చేసాడని తెలుసుకున్నాడు. ఒక చిరునవ్వు నవ్వుకున్నాడు. తాను ఒక్కసారి సంకల్పం చేశాడు. ఎన్ని ఆవులు వచ్చాయొ అన్ని ఆవులు, ఎద్దులు, దూడలు, గోపాలబాలురు అయిపోయాడు. తానే అన్నీ అయిపోయాడు. తానే తనని తోలుకుని అన్నింటితో కలిసి ఇంటికి వెళ్ళాడు. 
 
ఒక్కొక్క తల్లిదగ్గర ఒక్కొక్క పిల్లవాడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. ఒక్క కృష్ణుడే ఇంతకు ముందు ఏ తల్లుల దగ్గర ఏ పిల్లలు ఏ దూడలు, ఆవులు, ఎద్దులు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాయో అలా ప్రవర్తించాడు. ఆ తల్లిదండ్రులు, గోపకాంతలు, గోపాలబాలురని చూసి మా పిల్లవాడే అని మురిసిపోయారు. కృష్ణుడు రోజూ ఇలా గే చేస్తున్నాడు. ఈలోగా త్రుటికాలం కనురెప్ప మూసి తెరచినంతకాల అయింది. బ్రహ్మగారికి త్రుటి అంటే మనకి సంవత్సరకాలం. సంవత్సరం తరువాత కృష్ణుడు ఏమిచేస్తున్నాడో చూద్దామని చతుర్ముఖ బ్రహ్మగారు తలను ఇటు తిప్పాడు. అవే ఆవులు, అవే దూడలు, గోపాలబాలురు ఇక్కడ ఉన్నారు. తాను దాచాడు కదా అని తాను దాచిన గుహను చూశాడు. వారందరూ గుహలో ఉన్నారు. మాయ చేద్దామనుకున్నవాడు మాయలో పడ్డాడు. బ్రహ్మనయిన నేను ప్రాణులన్నింటినీ సృష్టిస్తాను.నేను సృష్టించిన ఆవులు, దూడలు, గోపబాలురు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ ఇవే అక్కడ ఉన్నారు. అయితే నేను కాకుండా మరొక బ్రహ్మ ఎవడయినా ఉన్నాడా’ అని అనుమానం వచ్చి వెనక్కి తిరిగి తన సింహాసనం చూసుకున్నాడు. అది ఖాళీగానే ఉన్నది. తానే సృష్టికర్తగా ఉన్నాడు. మరి అక్కడ కనపడుతున్న వారెవరా అని ఆలోచించాడు. బ్రహ్మగారికి గుర్తు వచ్చింది. ‘నన్ను కూడా సృష్టించిన వాడెవడో అతడు పరబ్రహ్మ. ఎవని నాభికమలము నుండి నేను పుట్టానో ఆతడు చిన్నికృష్ణునిగా ఉన్నాడు. వాని మాయముండు నా మాయ తుత్తునియలయిపోయింది. నేను దీనిని తెలుసుకోలేక పోయాను’ అని అనుకోగానే ఒక్కసారి మోహబుద్ది విడిపోయింది. చిన్నికృష్ణుని పరబ్రహ్మమును చూద్దామని అటు చూసాడు. చూసేసరికి ఆవులలో, దూడలలో, ఎద్దులలో, పిల్లలలో, కృష్ణుడిలో నాలుగు భుజములతో, శంఖచక్రగదాపద్మములను పట్టుకొని పట్టు పీతాంబరములతో శ్రీవత్సముతో కౌస్తుభమణితో, వనమాలతో, కిరీటముతో, పెద్ద పెద్ద కుంతలములతో, వెలిగిపోతున్న పరబ్రహ్మము అనేకముగా దర్శనం ఇచ్చాడు. ఇన్ని కాంతి పుంజములను చూసి బ్రహ్మగారు అయోమయంలోకి వెళ్ళిపోయారు. ఎందుకిలా అయిందని కళ్ళు మూసుకుని ఆలోచించాడు. నా మాయ దేనిమీద పనిచేయ్యదో దానిమీద మాయకమ్మే ప్రయత్నం చేశాను’ అనుకుని ‘స్వామీ! దయచేసి నేను చూడగలిగినట్లు కనపడు’ అని ప్రార్థించాడు. ఆవులను దూడలను వెతకడానికి వెళ్ళిన కృష్ణుడు ఎలా ఉంటాడో అలా కనపడ్డాడు. ఈ లీలను బలరాముడు ఒక్కడు మాత్రమే కనిపెట్టాడు. ఈ లీలను చేసినది తానేనని ఒకరోజున కృష్ణుడు బలరాముడికి చెప్పాడు. 
 
ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు కృష్ణ పరమాత్మ వద్దకు వచ్చి 
శంపాలతికతోడి జలదంబు కైవడి మెఱుగు టొల్లియతోడి మేనివాని 
కమనీయ మృదులాన్న కబళ వేత్ర విషాణ వేణుచిహ్నంబుల వెలయువాని 
గుంజా వినిర్మిత కుండలంబులవాని శిఖిపింఛవేష్టిత శిరమువాని 
వనపుష్పమాలికా వ్రాత కంఠమువాని నలినకోమల చరణములవాని 
గరుణ గడలుకొనిన కడకంటివాని గో, పాలబాలుభంగి బరగువాని 
నగుమొగంబువాని ననుఁగన్నతండ్రిని, నిను భజింతు మ్రొక్కి నీరజాక్ష! 
 
శంపాలతిక అంటే మెరుపుతీగ. కృష్ణుడు మెరుపుతీగతో కూడిన వర్షాకాలములోని నల్లనిమబ్బు ఎలా ఉంటుందో అటువంటి శరీరంతో ఉన్నాడు. పైన చిన్న ఉత్తరీయం ఉన్నది. ఎడమచేతిలో పెరుగు అన్నపు ముద్ద ఉన్నది. ఎడమచంకలో కొమ్ము బూర ఉంది. చేతిలో కర్ర ఉన్నది. పీతాంబరమును కట్టుకున్నాడు. ఏనుగు దంతంతో చేయబడిన కుండలములు పెట్టుకున్నాడు. చక్కటి నెమలి ఈక నొకదానిని పెట్టుకున్నాడు. అరణ్యములలో దొరికిన పద్మములతో కూడిన తీగనొకదానిని దండగా మెడలో వేసుకున్నాడు. అలా కనపడుతున్న కృష్ణుని పాదములమీద పడి బ్రహ్మగారు స్తోత్రం చేశారు. 
 
ఏలా బ్రహ్మపదంబు? వేదములకున్ వీక్షింపఁగారాని ని 
న్నీలోకంబున నీ వనాంతరమునం దీమందలో గృష్ణ యం 
చాలాపాది సమస్త భావములు నీ యందే సమర్పించు నీ 
వ్రేలం దొక్కని పాదరేణువులు పై వేష్ఠించినం జాలదే? 
 
నాకీ దిక్కుమాలిన బ్రహ్మపదవి ఎందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీ కృతమయిన నీవు, ఈ వేళ ఇక్కడ ఈ అరణ్యంలో తిరుగుతున్నావు. నీతోకలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపబాలుర పాదములకు అంటుకొనిన ధూళికణమును తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టమును నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మపదవి వద్దు’ అన్నాడు. 
 
ఎవరు ఈ బ్రహ్మగారు చేసిన స్తుతిని చదువుతారో వారిని మాయ విడిచిపెడుతుంది. అంతటా కృష్ణుడు కనపడుతుండగా ఏ భయం లేకుండా, సంతోషముతో చూస్తూ, తేలికగా ప్రాణములు ఉగ్గడింపబడి చక్కగా పరబ్రహ్మములో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. ఈవిధంగా కౌమారం నందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాదిపాటు కృష్ణుడే అన్నీ అయి ఉన్నాడు.
 
- L. రాజేశ్వర్ 
 
 

Quote of the day

Democracy and socialism are means to an end, not the end itself.…

__________Jawaharlal Nehru