Online Puja Services

అయ్యన్ కోవెల

18.218.234.83
హరి హర పుత్రుడు శ్రీ ధర్మశాస్తా కథలు నo.18
  
 
ఈ నాటి శాస్త కథలలో మనం కుండలిని శక్తికి సంభందించిన ఆరు కోవెలలో మూడవది, పంచ శాస్తా ఆలయాలలో రెండవది ఆర్యoగావు కోవిల్  (అయ్యన్ కోవెల) గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
 
      ఈ కోవెల అచ్చన్ కోవిల్ నుండి 40 కి.మీ  ల దూరంలో నున్నది. ఈ కోవెలలో కూడా ఆడ వారికి ఒక నియమము కలదు. 10 సం.లు పై బడి 50 సం.లు లోబడి యున్న ఆడవారికి ఆలయo లోనికి ప్రవేశం లేదు. అటువంటి వారిని మూల విగ్రహం నుండి 10 మీటర్ల దూరంలో కల నమస్కారం మంటపం వరకు అనుమతిస్తారు.  
 
      ఈ ఆలయం భూమి ఉపరితలం నుండి 35 అడుగుల లోతులో ఉండును. మెట్ల ద్వారా కానీ ఎటవాలు సుగమ మార్గము (రాంప్) ద్వారా కానీ కోవెల చేరవచ్చును.
 
   తమిళనాడు, కేరళదేశమునకు సరిహద్దు గా నుండు దక్షిణ గిరికి సమీపమున ఈ కోవెల వెలసి యున్నది. ఇచట స్వామి వామ భాగం వైపు పుష్కలా దేవి అమరి ఉండి "యువానం సుందరం సౌమ్యo"- అను విధముగా యవ్వన సుందరమూర్తిగా,  గజ పీఠం నందు స్వామి అమర వుంటారు. ఇచట ప్రతి సంవత్సరము పుష్కలాదేవితో కళ్యాణోత్సవం జరుపుతారు.
 
    పూర్వము సౌరాష్ట్ర దేశమునుండి ఒక వ్యాపారి,  వ్యాపార నిమిత్తం ఇచటకు వచ్చి నపుడు స్వామి వారు వారిని అనుగ్రహించి వారిని అచ్చటనే వుండులాగా చేశారు. అపుడు ఆ యువతి స్వామి పై మోహము పెంచుకున్నది. స్వామిని వదిలి పెట్టి ఉండలేక, తాను అచ్చటనే వుందునని, తండ్రిని వెళ్లి వ్యాపారం ముగించుకొని రమ్మని పంపి వైచెను. 
 
    ఆ వ్యాపారి వెళ్లిన దినము రాత్రే, ఆయువతి స్వామి లో లీనమై పోయినది. 
 
       వ్యాపారి, వ్యాపారము ముగించుకొని తిరిగి ఆ అరణ్య మార్గమున వచ్చు చుండగా ఒక మదపుటేనుగు అతనిని తరుమ సాగినది. అకస్మాత్తుగా ఒక వేటగాడు  అచట ప్రత్యక్షమై, కొరడాతో ఆ ఏనుగును తరిమి వైచెను. సంతసించిన  వ్యాపారి ఒక సిల్కు ఉత్తరీయమును ఆ వేటగాడికి బహూక రించెను. అంత, స్వామి ఆ వ్యాపారిని, నీకూతురిని నాకు  ఇచ్చెదరా అని అడుగగా ఆ వ్యాపారి వల్లే అని అనెను. అపుడు స్వామి ఆ వ్యాపారిని, మరుసటి దినం ఆర్యన్ కావు కోవెల వద్దకు రమ్మని చెప్పెను.
 
      మరుసటి దినం ఆ వ్యాపారి తన కూతురు కానక వెతుకుతూ కోవెల చేరెను. వ్యాపారికి ఆశ్చర్యకరంగా శాస్తా వారి విగ్రహం ప్రక్కన వ్యాపారి కూతురు విగ్రహముగా కనపడినది. శాస్తా వారిని చూడ, ముందురోజు తాను వేటగాడికి బహుకరించిన వస్త్రం, శాస్తా వారి విగ్రహానికి అలంకరింప బడి యుండెను.  అంత వ్యాపారికి ఆ కిరాతుడు ఎవరో కాదు శాస్థా నే అని నిర్ణయించుకొనెను. 
 
    ఆలయములోని గర్భాలయము లో స్వామి వారు మాత్రమే చిరునవ్వు నవ్వుతూ కనిపిస్తారు. ప్రక్కన ఆ యువతి విగ్రహం కానరాదు. చిత్రాలలో మాత్రమే కనిపించును. 
 
    కానీ ప్రతి సంవత్సరము అక్కడి స్వామి వారికి, ఆ యువతికి వివాహము జరిపించుతారు.  ఆలయము ముందు పెద్ద కళ్యాణ మంటపం కలదు. అందు వధువు తరపు వారిగా భక్తులు ఎందరో ఆలయ మండపంలో విడిది చేస్తారు. కల్యాణం జరిపించుతారు. స్వామి విగ్రహం మాత్రం బ్రహ్మచారి రూపమే.
 
      ఇక్కడ ఒక ఆధ్యాత్మిక విషయం (రహస్యం) తెలుసు కోవలసి ఉంటుంది. స్వామి పై భక్తి తో వచ్చు వారలు మదిలో ఈ కళ్యాణం గురించి సంశయము పడరాదు.  ఈ కళ్యాణమునందు వధువు శారీరకంగా వివాహమునకు ఒప్పుకొనదు. మానసిక వివాహం అనగా సకలం పరిత్యజించి బ్రహ్మచర్యమున స్వామిలో లీనమగుట మాత్రమే.
 
     భక్తులు స్వామి వారిలో లీనమగుట. ఇచటకు వచ్చు నిజభక్తులకు వైరాగ్య  భావము మదిలో ఉదయించునట. స్వామి వారి శక్తి అటువంటిది. ఈ ప్రాపంచిక విషయ బంధాలు తెంచుకొనుటకే, శబరిమల వెళ్ళు భక్తులు ఇచటకు వచ్చి, వైరాగ్య  భావమును అలవరించు కొని  తమ శబరీ యాత్రను కొనసాగదీయ వలెనన్నది అంతరార్థం. 
 
       ప్రవృత్తి మార్గమున మణిపూరక చక్రము నుండి ముందుకు కొనసాగటమే  ఈ ఆలయ దర్శనం లోని విశేష పవిత్ర అంతరార్థం.
 
 స్వామియే శరణం అయ్యనే శరణం. శ్రీ ధర్మశాస్తావే, హరిహర పుత్రనే శరణం శరణం  నీ పాదచరణాలే శరణo మాకు. 
 
ఇట్లు
భవదీయుడు
 
L. రాజేశ్వర్ 

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi