Online Puja Services

అద్భుత నగరి అయోధ్యా పురి!

3.137.220.120
అయోధ్య,... ఇతర నగరాల మాదిరిగా అదో భౌగోళిక ప్రాంతంగా మిగిలిపోలేదు.  దైవం నడయాడిన నేలగా ప్రణతులందుకుంది. ఒక్కసారైనా ఆ మట్టిని ముట్టుకోవాలని లక్షలాదిమందిని ఆరాటపడేలా చేసింది.ఎందుకంటే... అది తరగని ఆధ్యాత్మిక చింతనకు ఆయువుపట్టు. ధర్మవర్తనకు, ప్రజారంజకమైన పాలనకు దిక్సూచి. సనాతన భారతీయ సాంస్కృతిక హర్మ్యానికి హృదయపీఠి.

ఆదికవి వాల్మీకి రామాయణానికి పునాది అయోధ్య.  రామాయణం బాలకాండలో ఐదు, ఆరు సర్గల్ని పూర్తిగా అయోధ్యానగర వర్ణనకే కేటాయించారాయన. అందులో ఎన్నెన్నో విశేషాలు. మరెన్నో సందేశాలు...

అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోక విశ్రుతా
మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితాస్వయమ్‌ (బాలకాండ, 5:6)
కోసలదేశంలో ఉన్న అయోధ్యను మనువు స్వయంగా నిర్మించాడు. అందువల్ల ఆ నగరం మరింతగా లోక ప్రసిద్ధి పొందింది... అంటూ
బాలకాండలో అయోధ్య వర్ణన ప్రారంభమవుతుంది
* అయోధ్య పొడవు 12 యోజనాలు. వెడల్పు మూడు యోజనాలు. ఇప్పటి లెక్కలో ఇది సుమారు 168 కి.మీ పొడవు, 42 కి.మీ వెడల్పునకు సమానం. దీని ప్రకారం అయోధ్య నగరం వైశాల్యం అప్పట్లో 7,056 చ.కిమీ.
* అయోధ్యను ఎంతో ప్రతిభ కలిగిన శిల్పులు, వాస్తు నిపుణులు శాస్త్రప్రమాణాలతో తీర్చిదిద్దారని వాల్మీకి వర్ణించారు.
 
చిత్రామ్‌ అష్టాపదాకారాం వరనారీగణైర్యుతామ్‌
సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్‌

చదరంగంలో ఉండే పలకల వంటి నిర్మాణాలు కలిగిన భవనాలు ఇక్కడ ఉండేవని వాల్మీకి స్పష్టంగా చెప్పారు. అందంతో పాటు ప్రజల్ని కాపాడేందుకు శత్రువుల ఊహకు అందనివిధంగా నిర్మాణాల కోసం అప్పటి శిల్పులు తీసుకున్న శ్రద్ధ ఇందులో కనిపిస్తుంది.  ఎత్తైన కోట బురుజులు, ధ్వజాలు, వందలకొద్దీ శతఘ్నులు ఉండేవి. కోటకు రక్షణగా వందల కొద్దీ మేలుజాతి గుర్రాలు, వేగంగా నడిచే ఏనుగులు, వృషభాలు, ఒంటెలు ఉండేవి. మొత్తంగా శత్రుదుర్భేద్యంగా అయోధ్యను తీర్చిదిద్దారు నిపుణులు. ఈ కోటను కాపాడటానికి వేలాదిమంది సుశిక్షితులైన యోధులు బురుజుల మీద, కోటలోపల నిరంతరం కాపలాగా ఉండేవారు. వీరందరూ శస్త్రాస్త్ర విద్యల్లో నిపుణులు.. ప్రత్యేకించి శబ్దభేది విద్య (కంటితో చూడకుండా కేవలం శబ్దం విని లక్ష్యాన్ని ఛేదిస్తూ బాణాలు వేసే విద్య)లో ఆరితేరినవారు.
* ఇటువంటి అయోధ్యను దశరథుడు పరిపాలించిన కాలంలో సంపన్నుడు కాని వ్యక్తి ఆ నగరంలో లేడు. గో, ధన, ధాన్య, వాహన సమృద్ధి లేని గృహం ఉండేది కాదు. ఈ సంపదనంతా యజమానులు కేవలం ధర్మబద్ధంగా సంపాదించి, అలాగే ఖర్చు చేసేవారు. ఈ నగర ప్రజలంతా మహర్షులతో సమానమైన ఇంద్రియ నిగ్రహం, తేజస్సు కలిగి ఉండేవారు. అయోధ్యలో ఆకలితో అలమటించే వ్యక్తి ఒక్కడూ లేడు. దానం కోసం అర్రులు చాచే వ్యక్తి లేడు. నుదుట తిలకం ధరించని మనిషి కనిపించడు. దీనుడు కానీ, రోగపీడితుడు కానీ, సౌందర్యవిహీనులుగానీ కనిపించేవారు కాదు.
* వాణిజ్యంలో అయోధ్యకు సాటిరాగల నగరం అప్పట్లో లేదు. నగరం మధ్యభాగంలో అంగడులు ఉండేవి. క్రయవిక్రయాల కోసం వచ్చే వ్యక్తులతో ప్రధానవీధులన్నీ కిక్కిరిసి ఉండేవి. కేవలం కప్పం చెల్లించటానికి వచ్చే సామంతరాజులు బారులు తీరేవారట. సంగీత, సాహిత్య, నృత్య, నాటక, గీతాది కళారంగాల్లో నిష్ణాతులంతా అయోధ్యలో ఉండేవారు.

* కవయిత్రి మొల్ల కూడా తన రామాయణంలో అయోధ్య వైభవాన్ని ఎంతో గొప్పగా వర్ణిస్తుంది.
 
‘భానుకులదీప రాజన్యపట్టభద్ర
భాసి నవరత్న ఖచిత సింహాసనమ్ము
నాగనుతికెక్కు మహిమ ననారతమ్ము
ధర్మ నిలయమ్ము, మహినయోధ్యాపురమ్ము’

అయోధ్య అంటే కేవలం రాజ్యం మాత్రమే కాదు... ధర్మానికి అది నిలయం అంటుంది మొల్లమాంబ.

‘యోద్ధుం అశక్యా ఇతి అయోధ్య’
జయించటానికి వీలుకానిది అయోధ్య అని వర్ణించారు వాల్మీకి. కేవలం పేరులోనే కాదు... వాస్తవంలోనూ ఆచరణాత్మకమైన శత్రురక్షణ వ్యవస్థ కలిగిన నగరంగా అయోధ్య చరిత్రలో నిలిచిపోయింది.
* కాంభోజ,, బాహ్లిక, వనాయు, సింధు దేశాలకు చెందిన ఉత్తమ జాతి గుర్రాలు ఇక్కడ ఉండేవని వాల్మీకి బాలకాండలో వివరించారు. వింధ్య పర్వతాల్లో సంచరించే ఏనుగుల్ని ప్రత్యేకంగా ఈ నగరానికి తెప్పించి వాటికి శిక్షణనిచ్చేవారు. ఉత్తమజాతి పశుగణం అయోధ్యలో ఉండేది. అంతేకాదు...రెండు, మూడేసి జాతుల సాంకర్యంతో పశుగణాల్ని ఉత్పత్తిచేసే విధానం ఇక్కడ ఉండేది. భద్రమంద్ర, భద్రమృగ, మృగమంద్ర జాతులకు చెందిన ఏనుగులు ఇలా పుట్టినవే. బలమైన రాజ్యవ్యవస్థ అయోధ్యలో ఉండేది. అందుకే అయోధ్య అంటే అక్కడి ప్రజలకు మాత్రమే కాదు విదేశీయులకూ ఎంతో ప్రీతిగా ఉండేది.
 
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా
పురీ ద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికా
స్కాందపురాణం దేశంలోని ఏడు మోక్షపురాల్లో ఒకటిగా అయోధ్యను పేర్కొంది. ఈ నగరం చేప ఆకారంలో ఉంటుందని కూడా ఈ పురాణం చెబుతుంది. అగ్ని, బ్రహ్మపురాణాలు అయోధ్యను పాపాలను నాశనం చేసే నగరంగా కీర్తించాయి. యోగినీతంత్రంలో కూడా అయోధ్య ప్రస్తావన ఉంది.  అధర్వణ వేదం అయోధ్యను దేవనిర్మిత నగరంగా ప్రకటించింది. తులసీదాసు కూడా తన రామచరితమానస్‌లో అయోధ్య వైభవాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భాగవతంలో కూడా శుకమహర్షి రఘువంశాన్ని ప్రస్తావించి ప్రత్యేకంగా అయోధ్య గురించి వివరిస్తాడు.
* అందరూ అనుకుంటున్నట్లు అయోధ్య కేవలం నగరం మాత్రమే కాదని, మానవ జీవ చైతన్యానికి ఇదో ప్రతీక అని అధర్వణవేదం చెబుతోంది.
 
‘అష్టాచక్రా నవద్వారా దేవానాం పూరయోధ్యా
తస్యాగ్‌ం హిరణ్మయః స్వర్గలోకో జ్యోతిషావృత్తః...’ - ఎనిమిది చక్రాలు, తొమ్మిది ద్వారాలు ఉండే మానవ శరీరం అయోధ్యకు ప్రతీక. జనన, మరణ చక్రంలో శరీరం తిరుగుతూ ఉంటుంది. వీటితో మోక్షం కోసం యుద్ధం చేయడం సాధ్యం కాదు. ఫలితం ఉండదు. శరీరం అనే పట్టణంలోని జ్యోతిర్మయకోశానికి స్వర్గం అనే పేరుంది. అది జీవ చైతన్య స్వరూపమైన తేజస్సుతో నిండి ఉంటుంది. ఈ పట్టణాన్ని బ్రహ్మ సంబంధమైనదిగా  తెలుసుకున్న వారికి బ్రహ్మదేవుడు ఆయువు, కీర్తి అనుగ్రహిస్తాడని అధర్వణ వేదమంత్రాలు చెబుతున్నాయి.
 
-కప్పగంతు రామకృష్ణ
 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya