Online Puja Services

భక్తుల కోసం కూలిపనికైనా సిద్ధం

18.116.62.239

శివలీలలు- భక్తుల కోసం కూలిపనికైనా సిద్ధం
 

కార్తీక మాసం వచ్చిందంటే శివ భక్తులకు పండుగే! నిత్యం శివనామాన్ని స్మరించుకుంటూ, శివుని లీలలు తల్చుకుంటూ సత్కాలక్షేపం చేస్తారు. అలా గుర్తుకు చేసుకోదగ్గ శివలీలలలో ఇది ఒకటి… వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశం పాండ్యుల ఏలుబడిలో ఉన్న రోజులవి. ఆ కాలంలో మీనాక్షిదేవితో కూడిన సుందరేశ్వరుడు కొలువైన మధురైలో, `వంది` అనే ముసలామె ఉండేది. వందికి పాపం నా అన్న వారెవ్వరూ లేకపోయారు. మంచం మీద నుంచి లేవకపోతే పలకరించేవారు కూడా లేరయ్యే! అయినా వంది ధైర్యాన్ని కోల్పోలేదు. తను నిత్యం పూజించే ఆ సుందరేశ్వరుని మీద భారం వేసి జీవితాన్ని ధైర్యంగా గడిపేది. పుట్టు అనే ఓ ఆహార పదార్థాన్ని చేసి, దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో కాలక్షేపం చేసేది. అంతేకానీ చేయిచాచి ఎవ్వరినీ యాచించి ఎరుగదు. వంది వృద్ధాప్యం ఇలా గడుస్తూ ఉండగా మధురై చెంతనే ఉన్న వైగై నదికి విపరీతమైన వరదలు వచ్చాయి. వైగై వరదపోటుతో మధురై మొత్తం మునిగిపోయింది. ఏది ఊరో, ఏది నదో తెలియనంతగా మధురై దెబ్బతిన్నది.

మధురైని ఏలుతున్న పాండ్యరాజు చెంతకు చేరి ప్రజలంతా వరద గురించి మొరపెట్టుకున్నారు. రాజుగారికి కూడా ఏం చేయాలో పాలుపోలేదు. నదికి అడ్డుకట్ట కడదామంటే కాస్తా కూస్తా తీరం కాదు. ఏళ్ల తరబడి శ్రమిస్తే కానీ ఆ పని పూర్తి కాదు. కానీ ఈలోపల మరో వరద వస్తే రాజ్యం సర్వనాశనం అయిపోయేట్లు ఉంది. దాంతో ఓ ఉపాయాన్ని ఆలోచించారు రాజుగారు. `పట్టణంలో ఉన్న కుటుంబాలన్నీ కలిసి వరద ముప్పుని తప్పించేందుకు ఓ అడ్డుకట్టను నిర్మించాలి. ప్రతి ఒక్కరూ పలుగూ పారా పట్టుకుని ఈ పనిలో పాల్గోవాలి. ఒకవేళ పనిచేసే ఓపిక లేకపోతే తన బదులు కూలీతో పనిచేయించాలి` అని అదేశించారు రాజుగారు. రాజుగారి ఆజ్ఞ గురించి విన్న ప్రతి ఒక్కరూ తీరంలో తమకు కేటాయించిన స్థలంలో అడ్డుకట్టను నిర్మించేందుకు సిద్ధపడిపోయారు. ఒక్క `వంది` తప్ప! వయసు మీద పడిన వందికి పార పట్టుకునేంత ఓపికా లేదు, కూలీని పెట్టుకునేంత స్తోమతా లేదు! దాంతో తాను రోజూ తొలి నైవేద్యాన్ని అందించే సుందరేశ్వరుని చెంత నిలిచి ఈ గండం నుంచి గట్టెక్కించమని వేడుకుంది.
ఆ ముసలమ్మ ప్రార్థనకు సుందరేశ్వరుని మనసు కరిగిపోయింది. ఆ రోజు వంది తనకు కేటాయించిన స్థలంలో కూర్చుని శివనామస్మరణలో మునిగిపోయింది. ఇంతలో… `ఎవరికైనా సాయం కావాలా?` అన్న కేక వినిపించింది. కళ్లు తెరిచి చూస్తే ఎదురుగా సుందరుడైన ఓ యువకుడు భుజాన పార పట్టుకుని వెళ్తున్నాడు. `బాబ్బాబూ నీకు పుణ్యం ఉంటుంది. నాకు కాస్త సాయం చేసిపెట్టు!` అని వేడుకుంది వంది. `సాయం చేయడానికి నేను సిద్ధమే! కానీ నాకు బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి కదా!` అని బేరానికి దిగాడు ఆ యువకుడు. `నా దగ్గర దమ్మిడీ లేదు. కావాలంటే ఇవాళ అమ్మకం కోసం ఉంచిన ఈ ఆహారం ఉంది` అంటూ తన దగ్గర సిద్ధంగా ఉన్న ఆహారపదార్థాన్ని చూపింది వంది. `ఓ! ఇది సరిపోతుంది. ఈ పుట్టుని సుష్టుగా తిని నీ కోసం పని చేసిపెడతాను` అంటూ వంది దగ్గర ఉన్న పుట్టుని శుభ్రంగా తిన్నాడు ఆ యువకుడు. ఆపై వంది తరపున పని చేయబోతున్నట్లుగా అధికారుల వద్ద తన పేరు రాయించుకుని పని మొదలుపెట్టాడు. ఇంతకీ ఆ యువకుడు ఎవరో కాదు- వందిని ఆదుకునేందుకు వచ్చిన శివుడే!
శివుడు తల్చుకుంటే నదికి అడ్డుకట్టని నిర్మించడం లేదా కూల్చడం ఓ లెక్కా! కానీ తన భక్తురాలితో కాసేపు గడపాలనుకున్నాడేమో… ఆడుతూ పాడుతూ పనిచేయసాగాడు. ఓ గంట పనిచేస్తే ఓ గంట గుర్రుపెట్టి నిద్రపోయేవాడు. అలా ఆ యువకుడు పనిమానేసి చెట్టుకింద నిద్రపోవడం అధికారుల కంట పడనే పడింది. అతగాడిని సమీపంలో ఉన్న రాజుగారి చెంతకి తీసుకుపోయారు. తన కోసం పని చేస్తున్న ఆ యువకుడికి ఏమవుతుందో అని భయపడుతూ వంది కూడా అక్కడికి చేరుకుంది. `నీ అశ్రద్ధ క్షమార్హం కాదు. కొరడా తగిలితే కానీ నీ మత్తు వీడేట్లు లేదు!` అంటూ అతణ్ని కొరడాతో దండించమని ఆజ్ఞాపించాడు రాజు. వెంటనే ఓ సైనికుడు, శివుని ఒంటి మీద కొరడాని ఝుళిపించాడు. అంతే! ఆ దెబ్బకి రాజుగారి కళ్లు బైర్లు కమ్మాయి. ఎవరో తనని కొరడాతో కొట్టినట్లు ఒంటి మీద వాత తేలింది. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగుండా ఆ యువకుడు లేడు. వంది భక్తికి వశుడైన ఆ శివుడే యువకుని రూపం దాల్చాడని అర్థమైన రాజు ఆమె ముందు మోకరిల్లాడు.

 

- Sekarana

వెంకట కృష్ణప్రసాద్ ఏలేశ్వరపు

Quote of the day

God can be realized through all paths. All religions are true. The important thing is to reach the roof. You can reach it by stone stairs or by wooden stairs or by bamboo steps or by a rope. You can also climb up by a bamboo pole.…

__________Ramakrishna