Online Puja Services

దీర్ఘాయుష్మాన్ భవ అంటే?

18.216.34.146
చాలా సంవత్సరాల క్రితం మహాస్వామి వారి దర్శనానికి నలుగురైదుగురు పండితులు వచ్చారు. స్వామి వారికి సాష్టాంగం చేసి వారి ముందు కూర్చున్నారు. మహాస్వామి వారు భక్తులతో మట్లాడుతూ, ఆ కూర్చున్న పండితులనుద్దేశించి ఇలా అడిగారు.
 
“భక్తులు నాకు నమస్కరిస్తే, నేను వారిని “నారాయణ నారాయణ” అని ఆశీర్వదిస్తాను. మరి మీరు గృహస్తులు ఏమని అశీర్వదిస్తారు?”
 
మేము ‘దీర్ఘాయుష్మాన్ భవ సౌమ్య’ అని అశీర్వదిస్తాము అదే సంప్రదాయము” అని అన్నారు.
 
”అంటే ఏమిటి?” అని మహాస్వామి వారు ప్రశ్నించారు.
 
”చాలాకాలం సౌఖ్యంగా ఉండు” అని దీని అర్థం.
 
మహాస్వామి వారు అక్కడ ఉన్న అందరు పండితులను అదే ప్రశ్న వేసారు. అందరూ అదే సమాధానం చెప్పారు. మహాస్వామి వారు కొద్ది సేపు మౌనంగా ఉండి, “మీరందరూ చెప్పిన అర్థం తప్పు” అన్నారు.
 
పండితులు ప్రశ్నార్థకంగా చూసారు. వాళ్ళందరూ పెద్ద విధ్వాంసులు. సంస్కృత వ్యాకరణాలలో శిరోమణులు. మంచి విద్వత్ కలిగిన వారు.
 
సంస్కృత వాక్యం “దీర్ఘాయుష్మాన్ భవ” అనునది చాలా సామాన్యము. సంస్కృత పరిజ్ఞానము ఏమి లేకపోయిననూ అర్థమగును. కానీ మహాస్వామి వారు ఆ అర్థము తప్పు అంటున్నారు అని పండితులు ఒకరి మొహాలు ఒకరు చూసుకునుచున్నారు.
 
వారి పరిస్థితి చూసి మహాస్వామి వారు ”నేను చెప్పనా దాని అర్థం” అని అన్నారు. పండితులంతా చెవులు రిక్కించారు.
 
”పంచాంగములోని (తిథి వార నక్షత్ర యోగ కరణ) పంచ అంగములలో ఉన్న 27 యోగములలో ఒకటి ఆయుష్మాన్ యోగము, 11 కరణములలో ఒకటి భవకరణము, వారములలో సౌమ్య వాసరము అంటే బుధవారము అని అర్థం. ఎప్పుడైతే ఇవి మూడు అంటే ‘ఆయుష్మాన్-యోగము’, ‘భవ-కరణము’, ‘సౌమ్యవాసరము-బుధవారము’ కలిసి వస్తాయో అది శ్లాగ్యము - అంటే చాలా శుభప్రదము మరియు యోగ కారకము. కావున ఇవి మూడు కలిసిన రోజున ఏమేమి మంచి ఫలములు సంభవమగునో అవి నీకు ప్రాప్తించుగాక” అని అర్థం.
 
ఈ మాటలు విన్న వెంటనే ఆ పండితులు ఆశ్చర్యపోయి, అందరూ మహాస్వామి వారికి సాష్టాంగం చేసి నమస్కరించారు.
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
 

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi