Online Puja Services

ఆదికవి వాల్మీకి జీవిత విశేషాలు

3.141.31.209
ఆదికవి వాల్మీకి జీవిత విశేషాలు
 
భారత దేశము వేద భూమి, ఎందరో మహర్షులు ద్వారా మనకు అందినవే పురాణాలు ఇతిహాసాలు, అలాంటి సత్ గ్రంధాలలో ముందువరసలో ఉన్నది వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యము వాల్మీకి రామాయణము. రామాయణము గురించి వేరే చెప్పవలసిన పనిలేదు కానీ దానిని వ్రాసిన మహర్షి గురించి తెలుసుకొనుట చాలా అవసరము, ఇక బోయవాడు మహర్షిగా మారి ఆదికవి గా ప్రసిద్దిచెంది రామాయణ మహా గ్రందమును వ్రాసి భావితరాల వారికి అందించి భారతదేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటిన గొప్ప కవి వాల్మీకి 
 
రత్నాకరుడి పేరు వాల్మీకిగా మారుటకు కారణం తెలుసుకొందాం :
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం రత్నాకరుదు అనునతడు ఒక బందిపోటు దొంగ, అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. 
 
ఒక రోజు, నారదాది సప్త మహ ఋషులు అటు వైపుగా వస్తూ రత్నాకరుడి కంట పడ్డారు, వీరిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆడిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. వారిని అక్కడే వుండమని నేను నా భార్యను అడిగి వస్తాను అప్పటివరకు కదలకూడదు అని చెప్పి ఇంటికి వెళ్ళి భార్య, పిల్లలను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తారు. 
 
తిరిగి వచ్చి స్వాములు నా పాపం నాదే అని చెప్పారు , వారిని పోషించుటకు నేను ఈ విధంగా చేయవలసి వచ్చినది , నాతప్పు నాకు తెలిసి వఛినది , నన్ను క్షమించి తరుణోపాయము చెప్పండి, నాపాపాలు తొలగుటకు మీరు చెప్పినది చేస్తాను అన్నాడు, రత్నాకరుడికి ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. 
 
నారదుడు రత్నాకరుడికి భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. రామ అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు మరా అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన రత్నాకరుడు, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూ చీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ, నారదాది సప్త ఋషులు రత్నాకరుడి  తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరు తో నామకరణం చేసి నూతన జీవితాన్ని ఏవిధంగా గడపాలో ఉపదేశిస్తారు.
 
వ్యుత్పత్తి:
 
వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.
 
రామాయణకర్త వాల్మీకి:
 
వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. ఇది మహాభారత కావ్యంలో దాదాపుగా పావు వంతు భాగం. ప్రసిద్ధ ఆంగ్ల రచన ఇలియాడ్ కు ఇది నాలుగు రెట్లు పెద్దది. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. రామాయణంలో తెలుపబడిన విషయాలననుసరించి కనీసం లక్ష సంవత్సరాల ప్రాచీనమవవచ్చని భారత దార్శనికుల నమ్మకం. ఇతర ఇతిహాసాల్లాగానే రామాయణం కూడా ఎన్నో మార్పులకు, చేర్పులకు , తీసివేతలకు గురి అయింది.
 
వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది.
 
తొలి శ్లోకం
క్రౌంచ పక్షి జంటలో ఒకటి చనిపోవుట :
 
వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు చెదిరి, శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
 
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
 
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి
 
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం సాంతం రాసేవరకూ సాగింది.
 
వాల్మీకి వలస
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం (నల్లమల అడవులు) గుండా  దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముగించాడని  విశ్లేషకుల భావన .
 
- ప్రవీణ్ 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha