Online Puja Services

ప్రారబ్దం

18.220.178.207
మనం నిత్య,నైమిత్తిక కర్మలు ఆచరించేముందు చేసే సంకల్పంలో " ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం" అంటాము.
 
"అనేక జన్మలనుండి పేరుకుపోయిన పాపములునశించి  భగవంతుని అనుగ్రహం లభించేందుకు" అని ఆ మాటలకు అర్ధం.
 
 
శ్రీ శంకర భగవత్పాదుల వారి ప్రధాన శిష్యుడు పద్మపాదుల వారు పూర్వాశ్రమములో ఉండగా నరసింహస్వామి ఉపాసన చేసేవారు. వారి పేరు సనందుడు.
 
ఒక అడవిలో చిన్న కొండపైన కూర్చుని నర సింహస్వామిని గురించి తపస్సు చేస్తున్నారు.ఒక బోయవాడు ఈయన పడుతున్న కష్టం చూచి జాలిపడి " స్వామి, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు" అని అడిగాడు. 
 
"ఒకాయన సింహం తలతోను మనిషి శరీరము తోనూ ఉంటాడు, ఆయనను చూడటానికి తపస్సు చేస్తున్నాను అన్నారు సనందులవారు."
 
 " ఓస్, ఇంతేనా, ఈ అడవిలో నాకు తెలియని జంతువే లేదు, ఉండండి వెతికి తీసుకు వస్తాను" అని వాడు అడవిలోకి వెళ్ళాడు. 
 
ఎంత వెతికినా ఆ జంతువు కనిపించలేదు.
 
పొద్దుటినుండి అన్నము నీళ్లు లేకుండా ఏకాగ్ర దృష్టి తో అలా వెతుకుతూనే వున్నాడు.
 
సాయంకాలానికి నరసింహస్వామి ఒక చెట్టు క్రింద కూర్చుని వీడికి కనబడ్డాడు. 
 
 "ఓరీ! నీవు ఇక్కడ ఉన్నావా!ఆ బ్రాహ్మడు నీకోసం అంత కష్టపడుతుంటే!"  అని నరసింహస్వామిని తాడుతో కట్టి ఈడ్చుకొచ్చి సనందనుడి దగ్గర పడ వేసాడు. 
 
"ఇదుగోనయ్యా బ్రాహ్మడా, నువ్వు చెప్పిన జంతువు, చూడు" అన్నాడు. 
సనందనుడికి ఎవరూ కనపడలేదు. 
 
ఆమాటే బోయవాడితో చెప్పాడు. 
వాడికి నరసింహుడి మీద కోపం వచ్చింది. "ఏమిటి వేషాలు వేస్తున్నావు" అని ఒక కర్రతో నరసింహుడిని గట్టిగా కొట్టాడు. 
 
నరసింహుడు బాధతో పెద్దగా గర్జించాడు.
 
" సనందా ఈ జన్మలో నీకు నా దర్శనప్రాప్తి లేదు. వచ్చే జన్మలో కలుగుతుంది " అన్న మాటలు సనందుడికి వినిపించాయి. 
 
ఆయన ఆమాటలు విని ఆశ్చర్య పోయారు. నరసింహస్వామి దర్శనం కలగనందుకు బాధపడ్డారు. 
 
"ఇంత కాలంనుండి తపస్సు చేస్తున్న నాకు కనపడకుండా, ఒక్క పూటలోనే బోయవాడికి ఎలా దర్శనం ఇచ్చావు?" అని ఆయన నరసింహస్వామిని అడిగారు. 
 
"ఆ బోయవాడిలాగా వెతికితే నీకు ఇప్పుడే కనపడతాను "అన్నారు నరసింహస్వామి. 
 
 "నిరుత్సాహపడకు.సాధన కొనసాగించు. నీవు ఎప్పుడు తలచు కుంటే అప్పుడు వచ్చి నీ కార్యాన్ని సఫలం చేస్తాను " అని స్వామివారు అదృశ్యమైనారు.
 
.
భగవంతుడు భక్త సులభుడు.
 
శ్రద్ధ ఉంటే గురువు, భగవంతుడు, మోక్షము, నిజానికి చాలా సులభమైనవి.
 
 "సులభ స్సువ్రత స్సిద్ధ:" అని విష్ణు సహస్రనామం.
 
 అయితే పైన వివరించినట్లు భగవద్దర్శనానికి ప్రారబ్ధం అడ్డుగా ఉంటుంది. 
 
ఆ అడ్డు తొలగించుకోవడానికి శ్రద్ధతో బాటు సహనం కూడా ఉండాలి.
ఆ ప్రారబ్ధమనే అడ్డు తొలగించుకొనే ప్రయత్నములే జప, తపములు, దాన ధర్మములు, తీర్థయాత్రలు, ఉపవాసములు, ఉపాసనలూ మొదలైనవి.
 
వెంటనే ఫలితం రాలేదని నిరాశ పడకుండా,పట్టుదలతో, విశ్వాసంతో ఫలితం వచ్చేదాకా సాధన చేయాలి.
 
యోగ సూత్రములలో, పతంజలిమహర్షి
" వరణ భేదః తతః క్షేత్రికవత్ " అని చెప్పారు.
 
 అంటే వ్యవసాయదారుడు, తన పొలం లోకి పక్క పొలం నుండి నీళ్ళు రావాలంటే అడ్డుగా ఉన్న గట్టునుభేదించినట్లు ఈ ప్రారబ్ధ క్షయం కోసమే నియమాలతో కూడిన జప తపాదులు,  అని అర్థం.
 
అందుకే మనం అన్ని సంకల్పాలలోనూ " ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం " అంటాం.
అనేక జన్మల నుండి పేరుకుపోయిన పాప పరిహారార్ధం విశ్వాసంతోను, ఓర్పుతోనూ పెద్దలు చెప్పిన ప్రకారం ఆచరిస్తుంటే ధర్మార్ధకామమోక్షము లనే  చతుర్విధ పురుషార్ధాలు తప్పకుండా సిద్ధిస్తాయి.
 
------తూములూరి మధుసూదనరావు.
 
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha