కణ్ణయ్యన్ కథ

34.200.222.93
1940లో శ్రీమఠం వ్యాసపూజ తిరువరంకురిచిలో జరుగుతున్నప్పుడు, పది సంవత్సరాల కణ్ణయ్యన్ వాళ్ళ నాన్నతో పాటు వచ్చాడు. కణ్ణయ్యన్ నాన్న కుంజు అప్పుడు పెద్ద భోగి (పరమాచార్య స్వామివారి పల్లకీ మోసే బోయీల పెద్ద). ఆనాటి నుండి ఈనాటి వరకు అంటే మేనా వాడడం ఆపేవరకు శ్రీమఠంతో సంబంధమున్న కణ్ణయ్యన్ అనుభవాలు ఎంతో మధురం. అతనికి మహాస్వామి వారిపై ఉన్న భక్తి, స్వామివారికి బోయీలపై ఉన్న కరుణ అపారం.
 
ఇప్పుడు కణ్ణయ్యన్ ఏమి అనుభవాలను చెబుతాడో విందాం.
 
మా తాతగారు పరమాచార్య స్వామివారు గురువుగారికి మరియు పరమగురువుగారికి భోగి. అప్పటినుండీ మేము మేనా బోయీల పెద్దగా వ్యవహరిస్తున్నాము. మాపై మహాస్వామివారికి ఎంతో ప్రేమ. నన్ను కుంజు మావన్ అని పెద్ద భోగి అని పిలిచేవారు స్వామివారు.
 
మఠంలో ఆరు మేనాలు ఉండేవి. కర్ణాటక పల్లకి కేవలం పట్టణంలో తిరగడానికి మాత్రమే ఉపయోగించేవారం. అది చూడడానికి ఊయలలా ఉండేది. రాత్రిపూట వాడడానికి, పగటిపూట వాడడానికి రెండు ప్రత్యేక పల్లకీలు ఉండేవి.
మేనా ఒక పెట్టెలా ఉండేది. బోయీలు చిదంబరం, మాయవరం, మన్నార్గుడి మరియు కట్టు మన్నార్గుడి నుండి వచ్చేవారు. మేము ఉడయార్ పాళ్యం జమీందారి నుండి వచ్చాము.
 
ఒక్కసారి మేనాను పైకెత్తామంటే ఆరు కిలోమీటర్లు వెళ్ళేవారం. నడక శ్రమ భారం తెలియకుండా ఉండడం కోసం కంచి కామాక్షి, మధుర మీనాక్షి అని గట్టిగా నిదానంగా చెబుతూ ఉండేవాళ్లం. సైకిలు వెళ్ళేంత వేగంగా వెళ్ళేవారం. ఆరు కిలోమీటర్ల దగ్గర భుజాలు మార్చుకోవడానికి మరొక జట్టు సిద్ధంగా ఉండేది. మేము బండిలో ముందుకు వెళ్ళిపోయి తరువాత మార్చుకోవడానికి సిద్ధంగా ఉండేవారం. మేనా మొయ్యడానికి ఎనిమిది మందిమి, వెనుక నలుగురు, ముందర నలుగురు ఉంటారు. సాధారణంగా ఏడు నుండి రాత్రి పది దాకా మేనా మోసేవారం.
 
మేము భోజనానికి వెళ్లినప్పుడు మహాస్వామివారు మాకోసం అక్కడే కూర్చుని నిరీక్షిస్తూ ఉండేవారు. మేము తిరిగిరాగానే, మంచిగా భోజనం చేశామా లేదా అని అడిగి తెలుసుకునేవారు.
 
అప్పట్లో రోజుకి ఒక భోగికి ఆరు అణాలు ఇచ్చేవారు. దాంతోపాటు కురవై, సాంబ వారి పంటల్లో వంద కాలాల(కొలత) ధాన్యం ఇచ్చేవారు. 1963 దాకా ఈ విధానం ఉండేది.
ఒకసారి (భక్తవత్సలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు) ఉదయం మూడు గంటలప్పుడు ప్రయాణం మొదలుపెట్టాము, తంజావూరుకు తూర్పున ఉన్న పులచ్చేరి నుండి. డెబ్బై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కలైయార్ కోయిల్ తరువాతి మకాం. మేము అక్కడకు చేరుకోగానే మహాస్వామివారు మా స్నానం కోసం వేడినీటిని సిద్ధం చేయించారు. “పాపం బోయీల భుజాలు నెప్పిగా ఉంటాయి” అని అన్నారు. మేము ఆగినచోటు నుండి స్వామివారి మకాం ఒక కిలోమీటరు. పాదాచారియై వెళ్తాను అని స్వామివారు బయలుదేరారు. మేము అక్కడినుండి మధ్యాహ్నం మూడుగంటలకు శివగంగకు బయలుదేరాము. మేము అక్కడకు చేరుకోగానే, రెండు రోజుల విశ్రాంతి ఇచ్చారు. “వీరికి చాలా శ్రమ. వడ, పాయసంతో భోజనం పెట్టండి” అని ఆదేశించారు స్వామివారు. ఈ మాటలు చెబుతున్నప్పుడు కణ్ణయ్యన్ కళ్ళు తడితో ఎర్రబడ్డాయి.
 
ఒకరోజు ఉదయం తొమ్మిది గంటల సమయం. వేదపురి శాస్త్రి స్వామివారిని సేవిస్తున్నాడు. అప్పుడు స్వామివారు ఆచమనం, సంకల్పం మరియు జపం చేస్తున్నారు. పట్టణం నుండి కొంతమంది దర్శనానికి వచ్చారు. “పరమాచార్య స్వామివారు జపంలో ఉన్నారు. ఇప్పుడు మీరు చూడలేరు” అన్నాడు వేదపురి. వారు వెళ్ళిపోయారు. స్వామివారు కళ్లుతెరవగానే, “బస్తీ నుండి వచ్చినవారేరి?” అని వేదపురిని అడిగారు. 
 
“వారు వెళ్ళిపోయారు” అన్నాడు వేదపురి.
 
“వారు చూడటానికి వచ్చింది నిన్నా? నన్నా?”
 
నేను అప్పుడు వారి పక్కనే ఉన్నాను. “వారు బస్టాండులో ఉంటారు. వెళ్ళి తీసుకురా” అని నాకు చెప్పారు స్వామివారు. నేను పరిగెత్తుకుని వెళ్ళి వారికి విషయం తెలిపాను. వారు చాలా సంతోషపడ్డారు. పరుగుపరుగున వచ్చి, దర్శనం చేసుకుని వెళ్ళిపోయారు. వారు మఠానికి ఏదైనా సహాయం చెయ్యాలి అనుకున్నప్పుడు, బోయీలకు ఏమైనా చెయ్యమని చెప్పారు స్వామివారు. మాపై స్వామివారికి అంతటి ఆప్యాయత.
 
దాదాపు నలభై సంవత్సరాల క్రితం అనుకుంటా. కొల్లిదమ్ నది ఒడ్డున మేనాలో కూర్చుని తపస్సు చేస్తున్నారు స్వామివారు. దాదాపుగా చీకటి పడింది. మేనేజరు వచ్చి మేనా తలుపును కొద్దిగా తీశాడు. లోపల స్వామివారు కనబడలేదు. రెండు నిముషాల తరువాత ఎక్కడినుండో స్వామివారు చీకట్లో నుండి బయటకు వస్తూ ఏమిటి సమాచారం అని అడిగారు.
 
“స్వామివారు మేనా నుండి బయటకు వెళ్ళడం మీరు చూడలేదా?”
 
“దేవుడా! అదే మాకు తెలియడం లేదు. తలుపులు వేసి ఉన్నాయి”
 
నాకు తెలిసి బహుశా 1985 లేదా 86 అనుకుంటా. లుంగీలు అమ్మే వ్యాపారం చేసే ఒక భాయ్ ఉండేవాడు. శంకు మార్కు లుంగీ సంస్థకి యజమాని అతను. పరమాచార్య స్వామివారి దర్శనం కోసం వరుసలో వచ్చాడు. అతని వంతు రాగానే, స్వామివారు అతనికి శాలువా కప్పమని నన్ను ఆదేశించారు. అతను ఎంతగానో ఆనందించాడు. అతని హృదయం ద్రవించిపోయింది.
 
--- శ్రీమఠం సేవకులు. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
 

Quote of the day

What is Art? It is the response of man's creative soul to the call of the Real.…

__________Rabindranath Tagore