Online Puja Services

ప్రత్యక్ష నారాయణా ఏలుకో

18.117.165.66
దినకరుడు దిగంతాలను వెలిగించాడు. శుభకరుడు పల్లెపల్లెకూ శోభ తెచ్చాడు. సస్యలక్ష్మి కదలివస్తుంటే ఊరూవాడా ఆనందరాగాలు ఆలపించాయి. పౌష్యలక్ష్మికి ప్రణమిల్లాయి. పచ్చని పొదరిళ్లు, ఆనందాల హరివిల్లు, వికసించిన గుమ్మడిపూలు, కనువిందు చేస్తున్న గ్రామ సీమలు.. అవిగో ఆ కాంతులు... సంక్రాంతులే. ఇంత ఆనందానికీ కారణమైన సూర్యభగవానుడికి జ్యోతలు. నిండు మనసుతో ప్రణతులు.

నిప్పురవ్వలు కురిపించినా.. నిదానంగా ప్రభవించినా.. జగత్తుకు మేలు చేయడమే సూర్యభగవానుడి విధి. అలసట రాదు.. ఆగిపోవడాలు ఉండవు.. అలిగి వెనుదిరగడాలు అస్సలు కనిపించవు.. యుగయుగాలుగా పయనిస్తూనే ఉన్నాడు. నిజరూపంతో రుజుమార్గంలో అలుపెరగకుండా సంచరిస్తూనే ఉన్నాడు. వేసవిలో భగభగమండే భానుడు.. శీతాకాలంలో అందరివాడు. ఆయన రాకతో మంచు తెరలు తొలగిపోతాయి. చలి చల్లగా జారుకుంటుంది. నులువెచ్చని కిరణాల స్పర్శతో తుషార శీతల సరోవరం పరవశిస్తుంది. అందులోని కమలాలు వికసిస్తాయి. చలికి వణుకుతున్న ప్రాణులకు కొత్త శక్తి వస్తుంది. దైనందిన జీవితం సరికొత్తగా మొదలవుతుంది.
 
తూర్పు వేదికపై దిద్దిన సిందూరం.. సూర్యుడు. వేకువలో బాలాదిత్యుడిగా.. మధ్యాహ్నానికి మార్తాండునిగా.. మలి సంధ్యలో మణిదీపంలా మెరిసిపోతాడు. చీకటిలో ఉన్న జగతిని జాగృతం చేస్తాడు. అందుకే వేదాలు ఆదిత్యుడిని ‘మహాద్యుతికరాయ’ అని కీర్తించాయి. పురాణాలు ఆయన గొప్పదనాన్ని కథలు కథలుగా వర్ణించాయి. దినకరుడు, దివాకరుడు, ప్రభాకరుడు, ప్రచండుడు, అర్కుడు, రవి.. ఇలా ఆయనకు ఎన్నో పేర్లు.
 
ఆయనే ఆరోగ్యం:
 
వేదవాఙ్మయం నుంచి పౌరాణిక గాథల వరకూ చైతన్య ప్రదాతను ఆరాధించడం ఆనవాయితీగా మారింది. ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన షణ్మతాలలో (శైవం, వైష్ణవం, శాక్తేయం, గణాపత్యం, స్కాందం, సౌరం) సూర్యోపాసన కూడా ఉంది. సూర్యోపాసన విధి విస్తారమైనది. విశేషమైనది. సూర్యుడి ఆరాధనతో ఆత్మశక్తి ద్విగుణీకృతం అవుతుంది. శారీరక బలం పెరుగుతంది. మనోవ్యాకులత దూరం అవుతుంది. అన్నిటికీ మించి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌’ అని ఆర్షవాక్కు. భానుడిని పూజిస్తే రుగ్మతలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. సూర్యోదయం ప్రాణికోటిని నిద్దుర లేపితే.. సూర్యాస్తయమం అలసిన ప్రాణులను విశ్రాంతి తీసుకోమని చెబుతుంది. ఇలా మన జీవనశైలిపై అంతులేని ప్రభావాన్ని చూపిస్తున్నాడు ప్రభాకరుడు.
 
మార్తాండుడు అంటే?
 
సూర్యుడి జనన కథలు పురాణేతిహాసాల్లో పలు రకాలుగా కనిపిస్తాయి. బ్రహ్మపురాణం ప్రకారం కశ్యప ప్రజాపతి, అదితి దంపతులకు సూర్యుడు జన్మించాడు. తల్లి కడుపులో ఉండగా సూర్యుడి వేడికి గర్భవిచ్ఛిత్తి జరిగింది. దైవానుగ్రహంతో మృతి చెందిన గర్భం నుంచి సూర్యుడు ప్రభవించాడంటారు. అందుకే సూర్యుడికి మృతాండుడు, మార్తాండుడు అనే పేర్లతో పిలుస్తారు. మహాభారతం ప్రకారం.. కశ్యప, అదితి దంపతులకు 12 మంది ఆదిత్యులు జన్మించారు. వీరి పేర్లు ధాత, అర్యమ, మిత్ర, ఇంద్ర, వరుణ, అంశ, భగ, వివస్వత, పూష, సవిత, త్వష్ట, విష్ణు. ఇవన్నీ సూర్యభగవానుడి అంశలుగా చెబుతారు. ఆదిత్యుడు తన శక్తిని పన్నెండు నెలల్లో పన్నెండు రకాలుగా లోకానికి అందిస్తాడని విశ్వసిస్తారు.  
 
జగతికి జాగృతి :
 
సూర్యుడు మనకు కనిపించేది ఒకే రూపంలో. కానీ, ఆయన నిర్వర్తించే కర్మలు ఎన్నో. తూర్పున ఆయన ఉదయించగానే.. వనం, జనం, జలం, పశువులు, పక్షులు అన్నీ పరవశిస్తాయి. ఎందుకంటే భాస్కరుడు వేడిని పుట్టిస్తాడు. శక్తినిస్తాడు. వానలు కురిపిస్తాడు. పంటలు పండిస్తాడు. దినకరుని అనంతశక్తిని ఆదిత్య హృదయ స్తోత్రం.. ‘‘ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః’’ అని ప్రస్తుతించింది. నిద్రాణస్థితిలో ఉన్న ప్రాణికోటిలో అంతర్యామిగా మేలుకొని ఉన్న శక్తి సూర్యుడని దీని భావం. సకల ప్రాణులకూ ఆయన కావాలి. ఆయన రావాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆదిత్యుడు ఎంతో మేలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎన్నడో గుర్తించారు మనవాళ్లు. భాస్కరుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి పూజిస్తున్నారు.
 
నూతనోత్తేజంతో..
 
సర్వదా లోకహితం కోరే భానుడు.. మన జీవన గమనానికి దిశానిర్దేశం చేస్తాడు. తూర్పున ఉదయించింది మొదలు.. అస్తమించే వరకూ ఆయన విరామం కోరడు. సాధకుడు లక్ష్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించకూడదనే సత్యాన్ని ఇది బోధిస్తుంది. సాయంత్రానికి పడమర కొండల్లో వాలిన సూరీడు.. నూతన తేజస్సుతో మళ్లీ ఉదయించి తిమిరాన్ని తరిమికొడతాడు. ఇదే స్ఫూర్తితో ప్రతి రోజునూ సరికొత్త ఉత్సాహంతో మొదలుపెట్టాలి. ప్రభాత సూర్యుడిలా దేదీప్యమానంగా వెలుగొందాలి. జీవితంలోని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకుసాగాలి.
 
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha