Online Puja Services

జీవన యోగం

3.144.189.177
ప్రపంచానికి భారతదేశం అందించిన అపూర్వమైన కానుక యోగా. దైనందిన జీవితంలో మనం ఉపయోగించే ‘యోగా’ అనే మాటకు ప్రాచీనమైన ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. చిత్తవృత్తుల్ని నిరోధించడం యోగమని పతంజలి యోగసూత్రం చెబుతోంది. మనోనాశనానికి, వాసనాక్షయానికి చేసే పురుష ప్రయత్నం యోగమని, జీవాత్మ పరమాత్మల ఐక్యం యోగమని భగవద్గీత పేర్కొంటున్నది. మనిషి బంధానికి గాని, మోక్షానికి గాని కారణం మనసే. ఆ మనసును అదుపులో పెట్టుకోవడానికి మన రుషులు నిర్దేశించిన అనేక మార్గాల్లో ప్రధానమైనది యోగదర్శనం.
 
శరీరం పరిశుభ్రంగా, రోగరహితంగా, దృఢంగా ఉండేటట్లు చూసుకోవాలి. మనసుకు పట్టిన మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మన దేహం, మనసు రెండూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య చక్కని సమన్వయం నెలకొని మనిషి సంపూర్ణ వ్యక్తిత్వం గలవాడిగా రూపొందుతాడు. యోగదర్శనంలోని అష్టాంగ యోగమార్గం అతి సామాన్యుడికి కూడా కైవల్య సాధనకు అనువైన మార్గంగా యోగశాస్త్ర పండితులు చెబుతున్నారు.
 
శరీరంలోని వివిధ అంగాలు ఎలా కలిసి పని చేస్తున్నాయో, అదే విధంగా అష్టాంగయోగం అంటే ఎనిమిది అంగాలు విడివిడిగా, సమైక్యంగా పనిచేస్తున్నాయి. ఆ అంగాలు యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. యమ నియమాలు సమాజ శ్రేయస్సుకు; ఆసనాలు దేహ దారుఢ్యానికి; ప్రాణాయామ ప్రత్యాహారాలు మానసిక వికాసానికి; ధారణ, ధ్యాన, సమాధులు ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తాయి. అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం అనే విధులు ఆచరిస్తే మనోవాక్కర్మల్లో పరిశుద్ధత కలుగుతుంది. ఇతరుల పట్ల ద్వేషభావం నశించి, నిర్మలదృష్టితో చూడగలుగుతాం. ఇంద్రియ నిగ్రహం అలవడుతుంది.
 
శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనే అయిదింటినీ నియమాలంటారు. ఇవి కూడా వ్యక్తుల నిత్య కృత్యాలకు సంబంధించినవే. సద్గుణాలు మనసులో చోటు చేసుకుని అంతఃశౌచం, శరీరాన్ని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంవల్ల బాహ్యశౌచం నెలకొంటాయి. దుఃఖానికి తావివ్వకుండా సంతృప్తితో జీవించడమే సంతోషం. శరీరం యథేచ్ఛగా సంచరించకుండా నిరోధిస్తూ నిశ్చలమైన మనసును దైవం మీద కేంద్రీకరించి చేసేది తపస్సు.
 
వేదాధ్యయనం, సద్గ్రంథ పఠనాలను స్వాధ్యాయం అంటారు. సర్వ కర్మల్నీ ఈశ్వరార్పణ గావించడం, స్వస్థ చిత్తంతో ఉండగలగడం ఈశ్వర ప్రణిధానం.
 
యోగం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి ఆసనాలు. స్థిరంగా, సుఖంగా ఉండేది ఆసనం. రోగ నివారణకు, నిరోధానికి, ఆరోగ్యప్రాప్తికి ఆసనాలు ఉపకరిస్తాయి. యోగంలో ప్రాణాయామం కీలకమైన అంగం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మన అధీనంలో ఉంచుకోవడం ప్రాణాయామం. ప్రాణమంటే జీవం, శక్తి. ఆయామమంటే వాయువులో విరామం కలగజేయడం ద్వారా ప్రాణ విస్తరణ. శరీరంలోని నాడుల్ని శుద్ధి చేయడానికి, శరీర భాగాలు ఉత్తేజితం కావడానికి, మానసిక ఒత్తిడి దూరం కావడానికి ప్రాణాయామం అవసరం.
 
శరీరం, ప్రాణం, మనసుల ఏకీకరణ- తద్వారా భగవంతుణ్ని ప్రార్థించడం నిజమైన ధ్యానం. జీవాత్మ పరమాత్మల ఐక్య సంబంధం వల్ల ఇతర సమస్త సంకల్పాలు నశించి ఏర్పడే నిర్వికార స్థితి సమాధి. యోగానికి సంబంధించిన శారీరక, మానసిక ప్రక్రియలు రెండూ వ్యక్తి సమగ్ర వికాసానికి తోడ్పడతాయి. మితమైన, హితమైన ఆహార సేవనంతో పాటు యోగ సాధన చేస్తే మనిషి ఆలోచనల్లో మార్పు వస్తుంది. సమాజోపయోగకర గుణాలు పెంపొందుతాయి. నిత్య జీవితంలో యోగాభ్యాసాన్ని ఒక వ్యాసంగంగా అలవాటు చేసుకోవడం మేలైన జీవన విధానం.
 
- డి.భారతీదేవి
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha