Online Puja Services

కర్పూరం విశిష్టత

18.224.33.107
కర్పూరం విశిష్టత
 
కర్పూరం చెట్టు గురించి మరియు కర్పూరంతో ఆరోగ్యం గురించి కర్పూరం యొక్క సువాసన గురించి తెలుసుకుందాం. 
 
కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.
 
ఇది రసాయనాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు. చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అన్నది అక్షర సత్యం. అండి కర్పూరం కాంఫర్ లారెల్ లేదా సిన్నమొముం క్యాంఫొర (కుటుంబం: లారేసీ ) అనే చెట్టునుండి లభ్యమవుతుంది.
 
కర్పూరాన్ని ఆ చెట్ల ఆకులు, కొమ్మలనుండి తయారు చేస్తారు. అలాగే కొన్ని రకాలైన తులసి 
(కర్పూర తులసి)జాతులనుడి కూడా కర్పూరాన్ని తయారుచేస్తారు. కర్పూర చెట్ల కాండంమీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన కలిగిన పట్ట కలిగి ఉంటుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి . పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకుపచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.
 
కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగ పడుతుంది.
 
పచ్చకర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
 
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం (C10H16O) అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
 
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
 
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాలకోసం విరివిగా వాడుతూ ఉంటారు.
 
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘంలాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
 
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
 
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది. 
 
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.
 
ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలున్నాయి.
 
కర్పూరంవలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొన్ని ముఖ్యమయిన ఆరోగ్య లాభాలు:
 
1. స్వల్ప గుండె సమస్యలు, అలసట సమస్యలకు కొద్ది మొత్తం కర్పూరం వాడితే ఫలితముంటుంది.
 
2. అన్ని రకాల ఆర్థరైటిస్, రుమాటిక్ నొప్పుల నివారిణిగా, నరాల సంబంధమైన సమస్యలు, వీపు నొప్పికి కూడా ఇది బాగా పనిచేస్తుంది.
 
3. పుండ్లు మానడానికి, పిల్లలకు గజ్జి, బొబ్బలు తగ్గడానికి, బ్రాంకయిటిస్, పలు రకాల ఇన్ఫెక్షన్లకు కర్పూరం ఉపయోగిస్తారు.
 
4. నాసికా సమస్యలకు యాంటిసెప్టిక్ గా కూడా దీనిని ఉపయోగిస్తారు. అందుకే విక్సు వెపోరబ్ (vicks veporub), ఆయింట్మెంట్లన్నిటిలోనూ, చర్మం పై పుతగాపూసే లేపనములలోను, శ్వాసనాళాల లో ఊపిరి సలపడానికి వాడే మందులలోను వాడుతారు.
 
5. కర్పూరం నూనెలో దూదిని తడిపి లెప్రసీ వ్యాధివల్ల ఏర్పడిన గాయంమీద ప్రయోగిస్తే త్వరితగతిన మానుతుంది.
 
6. కర్పూరాన్ని పొడిచేసి, నోటిలో ఉంచుకొని లాలాజలాన్ని మింగుతుంటే అతి దప్పిక తగ్గుతుంది.
 
7. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్ఛంగా మారుస్తుంది.
 
8. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.
 
9. కళ్ళకు మేలు చేస్తుంది కనుకనే కాటుకలో దీనిని వాడతారు. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది.
 
10 మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది.
 
11.రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది.
 
12.అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది.
 
13. దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీ, పురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం మేలు చేస్తుంది.
 
14. పురుగుల మందులు, చెడువాసనల నిర్ములానికి, బట్టలను కొరికి తినే చెదపురుగులు, నిర్ములనకు ఉపయోగిస్తుంటారు.

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha