Online Puja Services

ఊర్థ్వ పుండ్రం అంటే ఏమిటి?

18.119.111.9
నిలువుగా ధరించే నామాలను ఊర్థ్వ పుండ్రాలు అంటారు. పరమాత్మ మన శరీరంలో ఆరు చక్రాలు ఏర్పరచారు అవి మూలాధారం, మణిపూరం, స్వాధిష్ఠానం, అనాహతం, ఆజ్ఞాచక్రం, సహస్రారం. కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రమును కప్పుటకే తిలకధారణ. ఈ చక్రం గుండ్రంగా, నిలువుగా, అడ్డంగా మూడు రూపాలలో సంచరించును. అందుకే తిలకాన్ని నిలువు మూడు రేఖలు లేదా అడ్డంగా మూడు రేఖలు లేదా గుండ్రంగా పెద్ద బిందువుగా ధరించవలెను. ఆజ్ఞ అంటే లక్ష్మీదేవి. కనుబొమ్మల మధ్య నివసించే లక్ష్మీదేవిని కుంకుమతో పూజించాలి కావున కుంకుమ బొట్టు ధరించాలి. బొట్టు సమీపాన గంధం నారాయణుడి సూచిక. ” ఊర్థ్వ పుండ్ర విహీనస్య స్మశాన సదృశం ముఖం ” అని శాస్త్రం. అనగా బొట్టులేని ముఖం స్మశానం వంటిది అలాగే ” పుండ్రహీన ముఖం దృష్ట్వా సచేలం స్నానమాచరేత్‌ ” అనగా బొట్టులేని ముఖాన్ని చూస్తే అదే బట్టలతో స్నానం చేయాలి. బొట్టులేని ముఖం స్థిరత్వం లేని మనస్సుకు సూచిక కావున స్త్రీ పురుషులకి తిలకధారణ తప్పనిసరి.
 
ఊర్ధ్వ పుండ్ర ధారణ విధానం..
 
సాధారణంగా వైష్ణవులు నిలువు బొట్టు పెట్టుకొంటారు. ఐతే, స్మార్తులు సైతం నిలువుబొట్టు పెట్టుకోవచ్చు, పెట్టుకొంటారు. ‘‘శ్రుతి స్మృత్యుక్త మార్గేణ మృదోధారణ ముచ్యతే/ శృణు వత్స! విధానేన మృత్స్నాధారణముత్తమమ్‌’’ అని ‘‘స్మృతి రత్నమహోదధి’’ తెలియజేస్తున్నది. ఇలా శ్రుతి స్మృతులు తెలియజేస్తున్నాయంటూ స్మార్తులు ధరించే ఊర్ధ్వపుండ్రధారణ విధానాన్ని ఈ గ్రంథం వివరించింది. స్మార్తులు మృత్తిక చేత ఊర్ధ్వ పుండ్రాన్నీ, భస్మం చేత త్రిపుండ్రాన్నీ ధరించవలసి ఉంటుంది. ఊర్ధ్వ పుండ్రాన్ని ఎర్రమన్నుతో గాని, తెల్ల మన్నుతో గాని, నల్లమన్నుతో గాని, గోపీచందనం (పచ్చ మన్ను)తో గాని దిద్దుకోవచ్చు. వైష్ణవులు పెట్టుకొనే నిలువుబొట్టు ఏయే పదార్థాలతో తయారు చేయాలో ఎలా పెట్టుకోవాలో నిర్దేశించే సూత్రాలు ఉన్నాయి. వాసుదేవోప నిషత్తు అలాంటి కొన్ని నియమాలను తెలియజేస్తుంది. (ఉదా: పరమహంస లలాటే ప్రణవేనైక మూర్థ్వపుండ్రం ధారయేత్‌). సాధారణంగా నుదుటి విూద నిలువుబొట్టు ధరించడమే ఆచారంగా కనిపిస్తుంది. కాని, శాస్త్ర ప్రకారం లలాటం, హృదయ స్థానం, ఉదరం, కంఠం, బాహువులు మొదలైన పన్నెండు స్థానాలలో పుండ్రం ధరించడం పద్ధతి. వైష్ణవ సంప్రదాయంలో కేశవ నామాలతో గానీ, విష్ణు గాయత్రీ మంత్రంతో గానీ పుండ్రధారణ జరుగుతుంది. నల్లమన్ను శాంతికరమనీ, ఎర్రమన్ను వశ్యకరమనీ, పచ్చమన్ను లక్ష్మీకరమనీ, తెల్లమన్ను మోక్షకరమనీ ‘‘స్మృతిరత్న మహోదధి’’ తెలియజేస్తున్నది. వైష్ణవులు ధరించే నామాల పదార్థాలలో శ్రీచందనమూ, కుంకుమపువ్వు కూడా ఉంటాయి. నామాలకు వాడే రంగుమన్ను కొండల విూద నుంచి, నదుల నుంచీ సేకరిస్తారు. ఇళ్ళల్లో ఉండే తులసి కోట మట్టి కూడా తిలకానికి ఉపయోగ పడుతుంది. స్మార్తులు ధరించే విభూతి అడ్డబొట్టు మూడు పట్టెలలోనూ పైన పట్టెను, కింది పట్టెను (రేఖలను) కుడిచేతి అనామిక, మధ్య వేళ్ళతో ఎడమ వైపు నుంచి కుడి వైపునకు దిద్దాలి. మధ్య పట్టె (రేఖను) అంగుష్ఠముతో (బొటన వ్రేలు) మధ్య పట్టెను (రేఖ) కుడివైపు నుంచి ఎడమ వైపునకు దిద్దాలి. ఇలా త్రిపుండ్ర ధారణ చేసేటప్పుడు స్మార్తులు ‘‘శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణమ్‌/ లోకే వశీకరం పుంసాం భస్మ త్రైలోక్య పావకమ్‌’’ అనే శ్లోకాన్ని చదవడం మంచిది. కొందరు ‘ఓమ్‌నమః శివాయ’ అనే పంచాక్షరీ మంత్రం చదువుతారు.
 
సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో, ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది. తెల్ల నామాలు సత్వగునాన్ని, దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి. అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీతం ఉంటుంది. సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకు వెడుతుందని సూచించేదే నిలువు బొట్టు. సత్వగుణానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు కనుక రెండు తెల్లని ఊర్ద్వ పుండ్రాలు ఆయన పాదాలుగా శిరసావహిస్తారు. ఇక విశ్వమంతటా వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేత ఎరుపు రంగు . అనురాగానికి, ప్రేమకు మూలం లక్ష్మీ దేవి. శుభకరమైన ఆ లక్ష్మీ స్వరూపానికి చిహ్నంగా నిలువు పుండ్రాల మధ్య మంగళకరమైన శ్రీ చూర్ణం ధరిస్తారు.
 
సేకరణ
నాగమణి 

Quote of the day

There is a magnet in your heart that will attract true friends. That magnet is unselfishness, thinking of others first; when you learn to live for others, they will live for you.…

__________Paramahansa Yogananda