పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారిని స్మరించుకుందాం

3.236.15.142
వైశఖ బహుళ పాడ్యమి, కంచి కామకోటి పీఠాన్ని అధిరోహంచిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జయంతి
 
అయోధ్యామధురా మాయా కాశీ కాంచీ అవంతికా!
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయికాః!!
 
అన్న శ్లోకంలో భారతదేశంలో ఏడు మోక్షదాయకములైన నగరాలలో ఒకటిగా కంచి మోక్షదాయిని అయిన నగరంగా, పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం క్రీస్తుపూర్వం నుండి అనేక వేల దేవాలయాలకు, శిల్ప సంపాదకు ప్రసిద్ధి చెందింది.
 
ప్రకృతి రామణీయకతతో, అనునిత్యం వేదఘోషతో, శాస్త్ర చర్చలతో, నృత్య సంగీతాది కళలకు పుట్టినిల్లుగా అనాదిగా కాంచీపురం ప్రసిద్ధికెక్కింది. ఈ కాంచీ క్షేత్రంలోని కామాక్షీదేవి, ఏకామ్రనాథుల దివ్య సమక్షంలో శంకర భాగవత్పాడులచే కంచి కామకోటి పీఠం స్థాపించబడి అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తోంది.
 
వైదిక ధర్మానికి, తాత్త్విక చింతనకు దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ కేంద్రంగా ఈ కాంచీపురం నేటికీ వెలుగొందుతోంది. బ్రహ్మాండ పురాణంలో కాశీ, కాంచీ రెండు క్షేత్రాలు పరమ శివుని రెండు నేత్రాలుగా అభివర్ణింపబడ్డాయి. అనేక పురాణాలు, భాగవతం మనకు కంచి యొక్క విశేష ప్రాధాన్యాన్ని తెలుపుతూ వస్తున్నాయి. కాంచీ క్షేత్రానికి, కామకోటి పీఠానికి క్రీస్తుపూర్వం నుంచి అవినాభావ సంబంధం ఉంది. అందువల్ల కామకోటి పీఠచరిత్రే కంచి చరిత్రగా కంచి చరితే కామకోటి పీఠచరిత్రగా ప్రసిద్ధికెక్కింది.
 
1931వ సంవత్సరం జనవరి నెలలో కామకోటి పీఠాధిపతులైన పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని సందర్శించిన పాల్ బ్రంటన్ ( Paul Brunton) “Search in Secret India”అన్న తన గ్రంథంలో ఈవిధంగా ప్రస్తుతించారు.
 
I know well that Shri Sankara is no pope, for there is no such thing in Hinduism but hi is a teacher and inspirer of a religious block of vast dimensions. The whole of South India bows to his tutelage.
 
అపర శంకరులుగా, నడిచే దేవుడిగా భక్తులచే మాత్రమే గాక, మదనమోహనమాలవ్యా వంటి విజ్ఞులచే కూడా కొనియాడబడిన వారు శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వామి వారు.
 
1942లో భారత రాజ్యాంగ రచన సందర్భంలో హిందూ మతానికి రాజ్యాంగంలో రక్షణ కల్పించే సంకల్పంతో స్వామీజీ చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమైనది. పూర్వం యావత్ప్రపంచంలో వేదమతమే వ్యాపించి ఉండేదని 1931లో స్వామివారు చేసిన మహోపన్యాసం ఆయన పరిశోధనా పటిమకు నికషోపలం.
 
మహాత్మాగాంధీ, జమ్నాలాల్ బజాజ్, మదనమోహన్ మాలవ్యా, వినోబాభావే వంటి మహనీయులేందరో స్వామిని సందర్శించి వారి మార్గ నిర్దేశకత్వం పొందారు.
 
ఈవిధంగా భారతదేశం మొత్తం మీద కామకోటి శంకర మఠాలను నెలకొల్పుతూ, వైదిక మతోద్ధరణ కొరకు అవిరళ కృషి జరుపుతూ, నడిచే దేవుడిగా కీర్తింపబడుతూ నూరవ వసంతంలోకి ప్రవేశించిన కామకోటి పీఠ 68వ అధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతుల జీవిత చరిత్ర అందరూ తెలుసుకోదగినది. సహస్ర మాస జీవి భగవంతునితో సమానమని శ్రుతి. ‘నడిచేదేవుడి’గా ప్రసిద్ధి చెందినా పరమాచార్యునికి ఈ దైవాంశం అదనపు విశేషంగా తోడైనది.
 
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి కర్ణాటకలోని హోయసల బ్రాహ్మణ వంశానికి చెందినవారు. క్రీ.శ.13వ శతాబ్దిలో చోళ దేశపు రాజులకు సహాయార్థం హోయసల రాజులు తమిళ దేశానికి వలస వచ్చారు. వీరితో బాటు వచ్చిన హోయసల బ్రాహ్మణ కుటుంబాలు అనంతర కాలంలో తమిళ దేశంలోనే స్థిరపడ్డాయి.
 
విజయనగర రాజులచే సామంతునిగా ప్రతిష్ఠింపబడిన చెవ్వప్ప నాయకుని కాలంలో (క్రీ.శ.1535ప్రాంతంలో) హోయసల కర్ణాటక కుటుంబాలు తమిళ దేశానికి రెండవసారి వలస వచ్చాయి.
 
ఈవిధంగా వలస వచ్చిన హోయసల కన్నడ బ్రాహ్మణ వంశీకుడైన గణపతి శాస్త్రి కంచి కామకోటి పీఠానికి చెందిన 64వ పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి – V కాలంలో ముఖ్య పరిపాలనాధికారిగా ఉండేవారు. గణపతి శాస్త్రి పెద్ద కుమారుడైన సుబ్రహ్మణ్య శాస్త్రి కుంభకోణం ప్రాంతంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండే వారు. చెవ్వప్ప నాయకుని వద్ద మంత్రిగా ఉన్న గోవింద దీక్షితుల వంశీకుడైన నాగేశ్వర శాస్త్రి కుమార్తె మహాలక్ష్మితో సుబ్రహ్మణ్య శాస్త్రికి వివాహం జరిగింది. ఈ పుణ్యదంపతుల రెండవ కుమారుడే పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి.
 
సుబ్రహ్మణ్య శాస్త్రి విల్లుపురంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తుండగా 1894సంవత్సరం మే 20వ తేదీన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి జన్మించారు. ఈయన పూర్వాశ్రమ నామధేయం స్వామినాథన్. చిన్నతనం నుండే స్వామినాథన్ అనన్య ప్రతిభా సామర్థ్యాలను చూపుతుండేవారు. తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారునికి అయిదు సంవత్సరాల వరకు తనవద్దనే చదువు చెప్పారు కానీ స్కూలుకి పంపలేదు. తన ఎనిమిదవ ఏట స్వామినాథన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. సుబ్రహ్మణ్య శాస్త్రి దిండివనంలో పనిచేస్తుండగా అక్కడ ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూలులో 7వ తరగతిలో చేర్పించారు. 1905వ సంవత్సరంలో స్వామినాథన్ కు తండ్రి ఉపనయన సంస్కారం చేశారు. స్వామినాథన్ పాఠశాలలో ప్రథముడిగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతుండేవాడు.
 
ఈ సమయంలోనే కామకోటి పీఠ 66వ ఆచార్యులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి – VI తమిళనాడులో దక్షిణ ఆర్కాటు జిల్లాలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య శాస్త్రి కుమారుని వెంటబెట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్ళారు. చిన్నవాడైన స్వామినాథన్ యొక్క అపార ప్రజ్ఞాపాటవాలను చూసిన ఆచార్యుల వారు ఈ బాలుడు అనంతర కాలంలో కామకోటి పీఠాన్ని అధిష్ఠించి అభివృద్ధి చేయగలడని భావించి ఆయనను ఎంపిక చేయాలని మనస్సులో సంకల్పించుకున్నారు.
 
అనంతరం స్వామినాథన్ కంచికి తీసుకొని వచ్చి తల్లిదండ్రుల అనుమతితో సన్యాసాశ్రమ దీక్షనిచ్చి చంద్రశేఖరేంద్ర సరస్వతిగా తీర్చిదిద్దారు. అనంతరం తన 13వ ఏట స్వామినాథన్ చంద్రశేఖరేంద్ర సరస్వతిగా కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు.
 
మఠాధిపతులు బాల శంకరులకు వేదశాస్త్రాధ్యయనానికి దక్షిణ దేశంలో తగిన ప్రదేశం కొరకు అన్వేషణ ప్రారంభించి చివరకు కుంభకోణం అనువైన ప్రదేశంగా ఎంపిక చేశారు. 1907వ సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో బయలుదేరిన స్వామి మార్గమధ్యంలోని గ్రామాలను సందర్శిస్తూ మే 9వ తేదీ నాటికి కుంభకోణం చేరుకున్నారు.
 
ఈ సందర్భంగా స్వామి రాకను గూర్చి తెలుసుకున్న వేద, శాస్త్ర పండితులు, గాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తంజావూరు ఆఖరి మరాఠీ పాలకుని మహారాజుల ప్రతినిధులు, సామాన్య పౌరులు తంజావూరు జిల్లా యావత్ ప్రజా పెద్ద ఎత్తున స్వాగతం పలికి నూతన జగద్గురువులకు మిక్కిలి భక్తిశ్రద్ధలతో పెద్ద ఉత్సవాన్ని జరిపారు.
 
 
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore