Online Puja Services

పుర్రెకు స్త్రీ చే అవమానం-బ్రహ్మ తలరాత!

52.15.59.163

కాశిలో వున్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు. అతను నిత్యం స్నానం చేయడానికి గంగ దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు. అతనికి బ్రహ్మ రాసిన రాత చదివే విద్య తెలుసు. ఒకనాడు గంగా నది దగ్గర మర్రిచెట్టు ఉంది. ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది. దాన్ని చూచి ఛి యదవ పుర్రె ఇప్పుడే తగలాల! మళ్లి స్నానం చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు. పుర్రె తళుక్కుమని మెరిసింది. అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు. 

వీడు జీవితాంతం కష్టపడతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు. బడిలో పంతుళ్ళు కొడతారు. పెళ్ళయ్యాక పెళ్ళాం తిడుతుంది. పిల్లలు పెద్దయ్యాక ఇంట్లోనుండి తన్ని గెంటేస్తారు. ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే వుంటారు. డబ్బు నిలవదు. ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది. బ్రతికినంతకాలం కష్టాలు పడీ పడీ చస్తాడు. వీడు చచ్చిన 500 సంవత్సరాలకి వీడి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది. అని ఆ పుర్రె మీద బ్రహ్మ తలరాత రాసివుంది.  

అది చదివి ! బ్రతికి ఉండగా అవమానం అంటే పర్వాలేదు. చచ్చాక పుర్రెకి అవమానం ఏంటి? బ్రహ్మకి అసలు బుర్ర వుందా? అని ఆ పుర్రేని విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూడడం అనుకోని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఈ పుర్రె ని దాచాడు. నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొర్రలో ఉన్న పుర్రేని చూసి పలకరించి వెళ్ళేవాడు. ఇలా కొన్నాళ్ళు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక 10 రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు. ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్లి తొర్రలో ఉన్న పుర్రెకోసం చుస్తే కనపడలేదు. వెతికాడు దొరకలేదు. మర్రిచెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం , సంధ్యా వందనం చేస్తున్నాడు కాని మనసు మాత్రం పుర్రెమీదే వుంది. చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్య కృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా వున్నారో నాకు తెలుసులెండి అంది..

ఒసేయ్ పిచ్చి మొహమా! ఎం తెలుసే నీకు?

మీరు ఆలోచించేది మీ రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రితోర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించేకదా! ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా? మీరు రోజు ఆ మర్రితోర్రలో పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పారు. 

ఓహో! ఇంతకీ ఏమి చేశావే దాన్ని. అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడి వేడి నీళ్ళు మరగబెట్టి దానిమీద పోశాను. సలసలా కాగే నునె గుమ్మరించాను, అప్పటికి కసి తీరక కారం చల్లాను. అయిన కోపం తీరక రోట్లో వేసి రోకలిబండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది.
 
అప్పుడు జరిగింది చెప్పాడు. ఒసేయ్ వెర్రి మొహమా! అది నాపెళ్ళాం కాదే! దానిమీద చచ్చాక కూడా ఆపుర్రే అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది. అది ఎలా నిజమౌతుందో చూద్దామని నేను ఆ మర్రిచెట్టు తోర్రలొ ఉంచాను. ఇదిగో నీవల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది. గంగలో కలిస్తే మోక్షమే కదా! అన్నాడు. ఆ విధంగా బ్రహ్మ రాసిన రాత నిజమైంది.

బ్రహ్మ రాస్తే నిజమై తీరుతుంది. బ్రహ్మ రాసిన రాత మారాలంటే ఎం చేయాలి?

సద్గురువు కటాక్షం ఉండాలి. అప్పుడే రాతని మార్చుకోవచ్చు. లేదంటే ఇది నేనే చేశాను, నేనే చేయగలను. అనే భ్రమలో  బ్రతికేస్తారు.

- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha