Online Puja Services

తిరుమల పై దుష్ప్రచారం నమ్మకండి..

18.222.205.211

తిరుమల, 14 జూన్‌ 2020: 

ఆన్‌లైన్లో ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్నాకే తిరుమ‌లకు రావాలి దూర ప్రాంతాల భ‌క్తులు తిరుప‌తికి వ‌చ్చి ఇబ్బంది ప‌డ‌కండి

జూన్ 21న సూర్య‌గ్ర‌హ‌ణం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌ 

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాల మీద ఇటీవ‌ల కాలంలో మీడియా, సామాజిక మాధ్య‌మాల్లో జ‌రిగిన దుష్ప్ర‌చారంపై ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తులకు వాస్త‌వాల‌ను తెలియ‌జేశామ‌ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఆగ‌మాలు, సంప్ర‌దాయాలు, భ‌క్తుల మ‌నోభావాల‌ను దృష్టిలో ఉంచుకునే దేవ‌స్థానం నిర్ణ‌యాలు తీసుకుంటుందని తెలిపారు. క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో నాలుగు నెల‌ల త‌రువాత ఆదివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది.


ఈ సంద‌ర్భంగా ఈవో భ‌క్తుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇప్ప‌టిదాకా డ‌య‌ల్ యువ‌ర్ ఈవో ప్ర‌తినెల మొద‌టి శుక్ర‌వారం జ‌రిగేద‌ని, భ‌క్తుల నుంచి అందిన స‌ల‌హా మేర‌కు ఈసారి ప్ర‌యోగాత్మ‌కంగా ఆదివారం ఉద‌యం 9 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించామ‌న్నారు. భ‌క్తుల నుంచి ఫీడ్‌బ్యాక్ బాగుంటే ఇదే విధానం కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. క‌రోనా వ్యాప్తి నివార‌ణ కోసం మార్చి 20వ తేదీ తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంతోపాటు టిటిడికి సంబంధించిన అన్ని ఆల‌యాల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేశామ‌న్నారు. అయితే, కొన్ని సామాజిక మాధ్య‌మాల్లో ఆల‌యం మూశామ‌ని, కైంక‌ర్యాలు జ‌ర‌గ‌డం లేద‌ని, అన్న‌ప్ర‌సాదాలు స‌రిగా నివేదించ‌డం లేద‌ని దుష్ప్ర‌చారం చేశార‌న్నారు. ఆల‌యాలు మూయ‌లేద‌ని, ఆల‌యాల్లో జ‌రిగే అన్ని సేవ‌లు, కైంక‌ర్యాలు, నివేద‌న‌లు, ఉత్స‌వాలను సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా, ఏకాంతంగా నిర్వ‌హించామ‌న్నారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్ నుంచి ఇచ్చిన మిన‌హాయింపుల మేర‌కు జూన్ 8వ తేదీ నుంచి తిరుమ‌ల‌తోపాటు అన్ని టిటిడి ఆల‌యాల్లో నిబంధ‌న‌ల మేర‌కు ప‌రిమిత సంఖ్య‌లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ప్రారంభించామ‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో 8, 9వ తేదీల్లో ఉద్యోగుల‌కు, 10న తిరుమ‌ల స్థానికుల‌కు ప్ర‌యోగాత్మ‌కంగా ద‌ర్శ‌నం క‌ల్పించి, 11వ తేదీ నుంచి గంట‌కు 500 మందికి చొప్పున రోజుకు 6 వేల మంది భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నామ‌ని వివ‌రించారు.

ఇందులో ఆన్‌లైన్ ద్వారా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు 3 వేలు, తిరుప‌తిలోని కౌంట‌ర్ల ద్వారా స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు 3 వేలు జారీ చేస్తున్న‌ట్టు చెప్పారు. ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు జూన్ 30వ తేదీ వ‌ర‌కు భ‌క్తులు బుక్ చేసుకున్నార‌ని, స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల‌ను జూన్ 21వ తేదీ వ‌ర‌కు కోటా పూర్త‌యింద‌ని తెలిపారు. ఆదివారం నుంచి జూన్ 22వ తేదీకి టోకెన్లు జారీ చేస్తున్నామ‌న్నారు. దూరప్రాంతాల నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తులు ఆన్‌లైన్‌లో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకుని రావాల‌ని, తిరుప‌తిలో జారీ చేసే స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల ద్వారా ద‌ర్శ‌నానికి రావాల‌నుకుంటే రోజుల త‌ర‌బ‌డి వేచి ఉండాల్సి వ‌స్తుంద‌ని అన్నారు. స‌ర్వ‌ద‌ర్శం టోకెన్లు పొందిన భ‌క్తులను వారికి కేటాయించిన తేదీల్లో మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తామ‌ని, ఒకరి పేరు మీద టికెట్ పొంది మ‌రొక‌రు ద‌ర్శ‌నానికి వ‌చ్చే అవ‌కాశమే లేద‌న్నారు.

ప్ర‌స్తుతం తిరుమ‌లలో భ‌క్తులు 6 నుంచి 7 అడుగుల దూరం పాటిస్తూ చేతులు శానిటైజ్ చేసుకుని సంతోషంగా ద‌ర్శ‌నం చేసుకుంటున్నార‌ని ఈవో తెలిపారు. టోకెన్ల సంఖ్య‌ను పెంచాల‌ని అనేక మంది ద్వారా విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయ‌ని, క్షేత్ర‌స్థాయిలో అంచ‌నాలు అనంత‌రం స‌రైన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకుంటామ‌న్నారు. క‌ల్యాణ‌క‌ట్ట‌, అన్న‌దానం కాంప్లెక్స్‌, ల‌డ్డూ కౌంట‌ర్ల వ‌ద్ద సామాజిక దూరం, జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నామ‌ని చెప్పారు. ఆన్‌లైన్‌లో వ‌స‌తి పొందిన వారు 24 గంట‌ల అనంత‌రం త‌ప్ప‌నిస‌రిగా ఖాళీ చేసేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, గ‌దికి ఇద్ద‌రిని మాత్ర‌మే అనుమ‌తిస్తున్నామ‌ని వివ‌రించారు. 65 సంవ‌త్స‌రాల పైబ‌డిన వారు, 10 ఏళ్ల లోపు ఉన్న‌వారిని ప్ర‌స్తుతానికి తిరుమ‌ల ద‌ర్శ‌నానికి రావ‌ద్ద‌ని కోరారు. ప్ర‌తిరోజూ గంట మాత్ర‌మే స్వ‌యంగా వ‌స్తున్న విఐపిల‌కు బ్రేక్ ద‌ర్శ‌నం అమ‌లుచేస్తున్నామ‌ని, మిగిలిన 12 గంట‌లు సామాన్య భ‌క్తుల‌కు సంతృప్తిక‌ర ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నామ‌ని తెలియ‌జేశారు.

ల‌క్కీడిప్ ద్వారా సేవా టికెట్లు పొందిన వారు త‌మ సేవ‌ల తేదీల‌ను వాయిదా వేయాల‌ని కోరుతున్నార‌ని, ఆర్జిత సేవ‌లు ప్రారంభించాక ఈ విష‌యంపై త‌గిన నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకున్నవారికి ర‌ద్దు చేసుకునే అవ‌కాశం క‌ల్పించామ‌ని, ఈ విధంగా రూ.28 కోట్లు రీఫండ్ చేశామ‌ని వెల్ల‌డించారు. అయితే, జూన్ నెల‌లో ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు బుక్ చేసుకుని ర‌ద్దు చేసుకోకుండా ఉన్న‌వారు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ తిరుమ‌ల‌కు వ‌చ్చి ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చ‌ని వివ‌రించారు.

లాక్‌డౌన్ నేప‌థ్యంలో 1300 మంది ఉద్యోగుల‌ను తొల‌గించామ‌ని దుష్ప్ర‌చారం చేశార‌ని, టిటిడి ఎ ఒక్క‌రినీ తొల‌గించ‌లేద‌న్నారు. ఆస్తుల అమ్మ‌కాల‌పైనా దుష్ప్ర‌చారం జ‌రిగింద‌ని, వాస్త‌వాల‌ను ప్ర‌జ‌ల ముందు ఉంచామ‌ని తెలిపారు. భ‌క్తుల‌కు స్వామి ద‌ర్శ‌నం లేనందువ‌ల్ల ల‌డ్డూ ప్ర‌సాద‌మైనా అందించాల‌ని వ‌చ్చిన విజ్ఞ‌ప్తుల మేర‌కు రూ.40/- నుంచి రూ.45/- ఖ‌ర్చు అయ్యే ల‌డ్డూను రూ.25/- కు భ‌క్తుల‌కు అందించామ‌ని, ఇందులో లాభాపేక్ష లేద‌న్నారు. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు భౌతిక‌దూరం పాటిస్తూ 22 ల‌క్ష‌ల‌కు పైగా ల‌డ్డూలు తీసుకున్నార‌ని చెప్పారు. ఈ విధానం ఇంకా కొన‌సాగించాల‌ని అనేక మంది భ‌క్తులు కోరుతున్నార‌ని, అయితే ఈ అవ‌కాశం లేద‌ని ఈవో తెలిపారు. టిటిడిపై జ‌రుగుతున్న దుష్ప్ర‌చారాన్ని భ‌క్తులు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న కోరారు.

జూన్ 21న సూర్య‌గ్ర‌హ‌ణం

ఈ నెల 21వ తేదీన ఆదివారం ఉదయం 10.18 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1.38 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుందని ఈవో తెలిపారు. జూన్ 21న ఉద‌యం 1.00 గంటకు శ్రీవారి ఆలయం త‌లుపులు మూసివేసి మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు తెరుస్తారని, ఆలయశుద్ధి అనంత‌రం భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంద‌ని వివ‌రించారు.

------------------------------------------------------------------

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya