Online Puja Services

ఏడురోజులు మిగిలింది

3.141.30.162

పరమాచార్యుల స్మృతులు 

వారు అప్పుడప్పుడూ అస్వస్థతకు లోనవుతూండేవారు. కానీ ఒక్కరోజుకూడా ఆ కారణంగా చంద్రమౌళీశ్వరపూజ మానలేదు. ఎన్నడూ పూజను త్వరగాముగించలేదు, ఏభాగమూ అలక్ష్యం చేయనూలేదు.

1945లో శ్రీవారికి గుండెపోటు వచ్చింది. నార్తార్కాటుకు చెందిన డాక్టరు, మైలాపూర్ టీ ఎన్ కృష్ణస్వామి శ్రీవారిని పరిశీలించి ఇలా అన్నారు - "శ్రీవారి నాడి బలహీనంగా ఉంది, గుండె పరిస్థితి బాగోలేదు. నేను చెయ్యగలిగినదంతా చేస్తాను, కానీ హామీ ఇవ్వలేను ."

శ్రీవారు ఆయుర్వేదానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు. వారు, మేలగరం ఘనపాఠిగారికి కబురుపెట్టారు. ఘనపాఠిగారు బహుశాస్త్రకోవిదులు. వేదములు, ఆయుర్వేదం, జ్యోతిషం మొదలైన వాటిలో అపారమైన పాండిత్యం ఉంది. వారు శ్రీవారి మణికట్టు పట్టుకుని నాడి పరిశీలించారు. ఇలాంటి వ్యక్తులకు వంశపారంపర్యంగా నాడీ పరిశీలనం వస్తుంది. చేతి లావు, బిగువు చూసి మనిషి పరిస్థితి చెప్పేస్తారు. ఇలా చెప్పటాన్ని ’దాదు’ అంటారు. స్త్రీ గర్భం ధరించిన నెలలోపలే, వైద్యులు గర్భం నిర్థారించకముందే, ఎడమచెయ్యి పట్టుకుని, ఖచ్చితంగా ’మీకు అబ్బాయ’నో, ’మనుమరాల’నో చెప్పేస్తారు. అలాగే జరిగితీరుతుంది. నాడి లెక్కబెట్టి ఈ మనిషి ఇన్ని రోజులు, వారాలు, సంవత్సరాలు బతుకుతాడని చెప్పేస్తారు. ఆరోగ్య పరిస్థితి అవగాహనకోసం మగవారికి కుడిచెయ్యి, ఆడువారికి ఎడమచెయ్యి పట్టుకుంటారు.

ఘనపాఠిగారు శ్రీవారి నాడి పరిశీలించి - "ఏడురోజులు మిగిలింది" అన్నారు. తరువాత శ్రీవారి జాతకం తెప్పించుకుని, దానిని పరిశీలించారు, లెక్కకట్టారు - "జాతకం ఈ రోజుకు ఎనిమిదిరోజులంటోంది" అన్నారు.

ఇంకా ఇలా అన్నారు - " నేను శ్రీవారికి వైద్యం చెయ్యటానికి సిద్ధం. నేను చెప్పినవి తుచ తప్పకుండా చెయ్యాలి. వారి సమక్షంలో నాలుగు వేదాల పారాయణ జరగాలి. రాత్రులు రాక్షసులకూ, పగళ్ళు దేవతలకూ చెందుతాయి. అందుకని వేదపారాయణ రాత్రింబగళ్ళు జరగాలి. ఒక ఆవుకి కేవలం నేరేడు ఆకులు మాత్రమే ఆహారంగా పెట్టాలి. నేరేడు ఆకులు, నీళ్ళు - అంతే. వేరే పశుగ్రాసం ఇవ్వరాదు. శ్రీవారు ఆ ఆవు పాలని మాత్రమే ఆహారంగా తీసుకోవాలి".

శ్రీవారు కంగారుపడ్డారు. "నా ఆరోగ్యం బాగవడానికి ఒక ఆవుని బాధించి కేవలం నేరేడుఆకులే ఆహారంగా పెట్టాలా ? ఆవుకి అది సరిపోతుందా ? ఆవుకి జరకూడనిదేమైనా జరిగితే ? ఆ పాతకం మనపైకి ఎందుకు తెచ్చుకోవటం ?"

"నాకు ఆవు ప్రాణాలని మంత్రాల ద్వారా రక్షించగల శక్తి ఉంది" అన్నారు ఘనపాఠిగారు. "శ్రీవారు ఆ విషయమై ఆలోచించనక్కరలేదు. ఆ ఆవుని సజీవంగా ఉంచటం నా బాధ్యత".

వైద్యం కొన్ని రోజులు నడిచింది. ఎన్ని రోజులో నాకు సరిగ్గా గుర్తులేదు. శ్రీవారు ఎప్పటిలానే చంద్రమౌళీశ్వరపూజ చేసేవారు, ఆ పాలు తప్ప వేరేవేమీ తీసుకోలేదు. వేదపారాయణం జరిగేది. ఘనపాఠిగారు ఫలానా రోజున ఫలానా సమయం గడవాలని చెప్పారు. ఆ సమయం తరువాత ఆహారనియమం సడలింది. ఆరోజు చాలా అసాధారణమైనది. సరిగ్గా ఘనపాఠిగారు చెప్పినరోజున ఆ సమయానికి , వారు ముందే చెప్పినట్టు ఒక పెద్ద పిశాచం భూమ్యాకాశాల మధ్యలో కనిపించింది. కనీసం పదిమంది - పాఠశాల వెంకట్రామన్, సిమిచి వంచిఅయ్యర్, కుల్ల శీను, ఇంకా కొంతమంది - దాన్ని చూశారు. సేతురామన్ అప్పటికి చిన్నవాడు, వాడూ చూశాడు. ఇది సత్యం, నేనిప్పుడు చెబుతున్నట్టే జరిగింది. ఘనపాఠివంటి వారు గొప్ప తపస్సంపన్నులు. ఎంతోమంది తపోనిష్టులు శ్రీవారివద్దకు వచ్చేవారు. శ్రీవారు ఎప్పుడూ పండితులమధ్యలో ఉండేవారు. ఇప్పుడు అంతా ఖాళీగా ఉంటున్నాం. ఘనపాఠిగారి అబ్బాయి జెమినీ ఇప్పుడు ఉన్నారు.

"ఇంక భయపడాల్సిందేమీ లేదు. పిశాచం పారిపోయింది. శ్రీవారు నూరేళ్ళు జీవిస్తారు" అన్నారు ఘనపాఠిగారు.

భగవంతుడి కరుణవల్ల ఆ ఆవు ఏ ఇబ్బందీ లేకుండా ఉంది. నేరేడు ఆకులే తిని, నీరు మాత్రమే త్రాగినా ఆరోగ్యంగానే ఉంది. శ్రీవారిని అమితంగా ప్రేమించే కొంతమంది భక్తులు ఇదంతా చూసి కదిలిపోయారు. వారు అన్నారూ -

" మానవజన్మ ఏపాటిది ? ఇలాంటి ఆవులా పుట్టినా ఈ జన్మలోనే మోక్షం లభించేది. ఈ ఆవు గతజన్మలలో ఎంత పుణ్యం మూటగట్టుకుందో ఎవరు చెప్పగలరు ?"


శంకరం లోక శంకరం శంకరం పాహి శంకరం

--SRIHARI SATYAWADA!

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore