Online Puja Services

గుడి నిర్మాణం మన శరీర ఆకృతి లో

18.117.216.229

గుడి నిర్మాణం - జీవుడికి ఆధారమైన చక్రములు

సహస్రార చక్రము: (గర్భ గుడి)

 

జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.

ఆజ్ఞా చక్రము: రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)

విశుద్ధి చక్రము: (అంతరాలం)

మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.

అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం. అనాహత చక్రము: (అర్ధమంటపం) ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.

అర్ధమంటపం : గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.

మణిపూరక చక్రము: (మహామంటపం) నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది. ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది. 

స్వాధిష్ఠాన చక్రము: (ధ్వజస్తంభం) ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది. 

ధ్వజస్తంభం : ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.

మూలాధార చక్రము: అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.

మోకాలి స్థానం : స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.

పాదాలు : ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.

ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి.

 

సేకరణ: అంజు అంజు 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda