Online Puja Services

మహవతార్ బాబా..!!!

3.144.48.135

ఒక చరిత్ర.. కొన్ని విషయాలు.. 

మహవతార్ బాబా గారి వయసు రెండు వేల సంవత్సరాలకి పైగా ఉంటుందని ఆ స్వామి ఇప్పటికి ఇంకా హిమాలయాల్లో బ్రతికే ఉన్నారని చాలా మందిలో ఒక నమ్మకం అనేది ఉంది. భారతదేశ చరిత్రలో అతి ప్రాచీనమైన విద్య క్రియా యోగ. ఈ విద్యని భగవద్గీత లో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడని చెబుతారు. ఆ తరువాత పతంజలి మహర్షి తన యోగ సూత్రాలలో ఈ విద్య గురించి వివరించాడు. ఇక ఈ విద్యని తిరిగి మళ్ళీ ప్రాచిన్యంలోకి తీసుకువచ్చింది మహావతార్ బాబా అని చెబుతారు.

మరి మహావతార్ బాబా ఎవరు?

బాబా సిద్ధిని ఎలా సంపాదించాడు? ఆ విద్యని ఎలా నేర్చుకున్నాడు? అయన శిష్యులు బాబా గురించి ఏమని చెప్పారనే ఇలాంటి మరెన్నో విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రం, ఫరంగిపేట గ్రామంలో ఒక నంబూద్రి బ్రాహ్మణుడైన అర్చకునికి రోహితి నక్షత్రంలో 203 నవంబర్ 30 వ తేదీన ఒక మగబిడ్డ జన్మించాడు. ఆయనే మహావతార్ బాబా. అయన తండ్రి కుమారస్వామి ఆలయంలో అర్చకునిగా చేసేవాడు. ఇలా రోహితి నక్షత్రంలో జన్మించిన ఆయనకి వారు నాగరాజు అని పేరు పెట్టారు. అయితే తనకి ఐదు సంవత్సరాల వయసు ఉన్నపుడు ఆలయంలో పెద్ద ఉత్సవం జరుగుతుండగా వేరే ప్రాంతానికి చెందిన ఒకడు ఆయన్ని అపహరించి కలకత్తా నగరానికి తీసుకువెళ్లి అక్కడ ఒక ధనవంతుడికి అమ్మేశాడు. ఇంట్లో బానిసగా ఉంటున్న ఆయన్ని చూసి జాలిగుణంతో కొన్ని రోజులకే ఆ ధనవంతుడు ఆయనకి స్వేచ్చని ఇస్తూ తనకి నచ్చిన చోటుకు వెళ్ళమని చెప్పగా. అంత చిన్న వయసులో అయన బయటి ప్రపంచంలోకి రాగా,  ఆయనకి ఒక సాధువుల బృందం కనిపించగా వారితో పాటు వెళ్లి వారికి  సేవలను చేయడం ప్రారంభించాడు. ఇలా ఆ సాధువులు అయన చేసే సేవలకు సంతోషిస్తూ  పురాణ ఇతిహాసాలు చెబుతుండేవారు. 

ఇలా అన్ని తెలుసుకుంటూ మంచి పండితుడిగా ఎదిగిన అయన కేవలం పాండిత్యం వలన భగవంతుడి ఆశీర్వాదం సంపాదించలేను అని అనుకోని దివ్యజ్ఞానం, సిద్ది పొందాలంటే ఎలా అనుకుంటూ విచారిస్తుండగా. ఆ సాధువుల బృందం కాశీకి వెళుతుండగా వారితో పాటు కాశీకి వెళ్లి అక్కడ నుండి శ్రీలంకకు చేరుకున్నాడు. ఇక శ్రీలంకలో కతిర్గామ అనే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది.

ఇక్కడే సుబ్రహ్మణ్యుడు వల్లీదేవిని వివాహం చేసుకున్నాడని పురాణం. అయితే ఈ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి యంత్రానికి పూజలు అందుకోడం చూసాడు. అంటే ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం అంటూ ఉండదు. ఒక బంగారు యంత్రం, అందులో సుబ్రహ్మణ్యస్వామి వారి రూపం ఉండగా ఆ మహిమగల యంత్రానికే పూజలు చేసేవారు. ఇంకా ఈ ఆలయంలో బోగనాధుడు అనే ఒక సిద్ధపురుషుడు ఉండేవాడు. ఆ సిద్ద పురుషుడు సాక్షాత్కరించడంతో అక్కడే ఉంటూ ఆరు నెలల పాటు కదలకుండా ధ్యానం చేసాడు. ఇలా ఆరు నెలలు సమాధి స్థితిలో ఉన్న ఆయనకి చివరికి సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షమవ్వగా ఆయనికి ఎల్లపుడు యువకుడిగా ఉండే సిద్ది లభించింది. ఆ తరువాత బోగనాధుడు అయన తో ఇలా అన్నాడు, ద్రవిడ దేశంలో కుర్తాలంలో అగస్త్య మహర్షి ఉన్నాడు అక్కడికి వెళ్లి అయన అనుగ్రహాన్ని పోందంటూ సూచించాడు. దీంతో అయన కుర్తాళం చేరుకొని అగస్త్య మహా ముని కోసం 47 రోజులు ధ్యానంలోనే ఉంటూ ఘోర తపస్సు చేయగా అప్పుడు అగస్త్య మహర్షి ప్రత్యేక్షమై దివ్య ప్రసాదాన్ని తినిపించి యోగ విద్యలోని ఎన్నో రహస్యాలు చెప్పి సిద్ధిని ప్రసాదించి, హిమాలయాల్లో ఉన్న బదరీనాధ్ కి వెళ్లి అక్కడ మహా సిద్ధిని పొందమని చెప్పాడు.

ఇలా బదరీనాథ్ క్షేత్రానికి వెళ్లిన బాబా మహాసిద్ధిని పొంది నిత్యా యవ్వనుడిగా, అమరుడిగా ఎదిగిన నాగరాజు మహవతార్ బాబా గా స్థిరపడిపోయారు. క్రీస్తు శకం 788 -820 మధ్య బ్రతికిన ఆదిశంకరాచార్యకు సన్యాస దీక్ష ఇచ్చినవారు గోవింద భగవత్పాదులు కాగా యోగ దీక్ష ఇచ్చినది మహా అవతార్ బాబా. ఇంకా కొందరు చెప్పిన దానిప్రకారం కేదారనాథ్ పర్వత శిఖర ప్రాంతంలో ఉన్న సిద్ధాశ్రమానికి శంకరులు వెళ్లాలని ప్రయత్నించగా ఆయనకి వీలు కాలేకపోవడంతో అప్పుడు మహావతార్ బాబా కొన్ని యోగ సాధనాలు వారితో చేయించగా అప్పుడు శంకరులు శిఖర ప్రాంతంలో ఉన్న ఆ సిద్ధాశ్రమానికి వెళ్లారని చెబుతారు.

ఇలా కేదార్ ప్రాంతంలో ఉండే సిద్ధాశ్రమ యోగులు రహస్యంగా ఉంటూ మానవ జాతికి అవసరమైన శుభాలు చేస్తుంటారు. ఆ సిద్ధాశ్రమ యోగులే రమణ మహర్షి ,అరవింద యోగి ,కావ్యకంట గణపతి ముని అని ధ్యాన యోగులు చెప్తున్నారు. బాబా గారి శిష్యులలో పరమహంస యోగానంద వంటి ఎంతో మంది యోగ గురువులు ఉన్నారు.

ఇక మొదటిసారిగా ప్రపంచానికి బాబా గురించి వెలుగులోకి తీసుకువచ్చింది లాహిరి మహాశయుల గురువుగారు. ఇక లాహిరిబాబా విషయానికి వస్తే, ఈయన మిలటరీ లో అకౌంటెంట్ గా పనిచేస్తుండేవారు. హిమాలయాల్లో రాణిఖేద్ లో పనిచేస్తున్న రోజుల్లో ఒకరోజు జరిగిన సంఘటన అయన జీవితాన్నే మార్చేసింది.

ఒక రోజు సాయంత్రం సమయంలో హిమాలయాల్లో తిరుగుతుండగా ఒక ఎత్తైన పర్వతం నుండి ఎవరో ఒకరు అతడిని పేరు పెట్టి పిలుస్తున్నారని అనిపించగా, ఈ మంచు కొండలో నాకు తెలిసినవారు ఎవరు లేరు, నేను ఇక్కడ ఉద్యోగానికి వచ్చి కూడా కొన్ని రోజులే గడించింది నన్ను గుర్తు పట్టి ఎవరు పిలుస్తున్నారని కొండ పైకి వెళ్లగా ఒక గుహలోకి వెళ్లగా అతడిని నీవు ఇంకా గుర్తు పట్టలేదా అంటూ ఒక్కసారి ఆయన్ని స్మృశించగా లాహిరి గారికి తన గత జన్మలు గుర్తుకు వచ్చి నన్ను తాకిన ఆ దివ్య శక్తి మహవతార్ బాబా గారిది అని గ్రహించాడు. ఇక బాబాజీ లాహిరి మహాశయులకు క్రియాయోగ దీక్షని ప్రసాదించారు. ఈ సంఘటన 1861 లో జరుగగా ప్రపంచానికి అప్పుడే బాబా రెండు వేల సంవత్సరాల నుండి ఇంకా హిమాలయాల్లోని జీవించి ఉన్నాడని అర్ధం అయినది. ఇక లాహిరి యొక్క శిష్యుడు యుక్తేశ్వర్‌గిరిబాబా. లాహిరి యొక్క ప్రియ శిష్యుడైన యుక్తేశ్వర్‌గిరిబాబా 1894లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో మహావతార్ బాబాని ప్రత్యేక్షంగా కలుసుకున్నాను అంటూ చెప్పాడు. ఈ విషయం యుక్తేశ్వర్‌గిరిబాబా వ్రాసిన కైవల్య దర్శనం అనే పుస్తకంలో ఉంది.

ఇక మహావతార్ బాబా శిష్యుడు లాహిరి మహాశయుల గురువు అయితే ఈయన శిష్యుడు యుక్తేశ్వర్‌గిరిబాబా. ఇంకా యుక్తేశ్వర్‌గిరిబాబా శిష్యుడు పరమహంస యోగానంద. అయితే పరమహంస యోగానంద వ్రాసిన ఒక యోగి ఆత్మకత అనే పుస్తకం ఆధ్యాత్మిక చరిత్రని సృష్టించింది. ఈయన కారణంగానే క్రియా యోగ అనే విద్య అన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది.

ఈవిధంగా నాగరాజుగా జన్మించిన ఆయన దేవుడి అవతారం కానప్పటికీ పూర్వ జన్మ పుణ్యఫలమో, దేవుడి లీలానో తెలియదు కానీ చిన్నతనంలోనే ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసి కుమారస్వామి దర్శనం పొంది అగస్త్యమహర్షి అనుగ్రహంతో సిద్ది పొంది క్రియా యోగ వంటి ఎన్నో యోగ రహస్యాలను తెలుసుకొని అమరుడిగా ఇప్పటికి హిమాలయాల్లో ఉండే రహస్య గుహలో జీవించే ఉంటున్నాడని చాలా మంది నమ్మకం.

- వెంకట కృష్ణ ప్రసాద్ ఏలేశ్వరపు 

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda