Online Puja Services

1000 సంవత్సరాలుగా భద్రపరచబడిన శ్రీ రామానుజాచార్యుల పవిత్ర శరీరం...

18.226.28.197

వేదానికి సరైన అర్ధం చెప్పి, విశిష్టద్వైత గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయులు శ్రీ రామానుజాచార్యులు. ఆయన పరమపథం చెంది వెయ్యేళ్లు అయినా ఇప్పటికీ ఆ శరీరం భద్రపరిచి ఉండడం విశేషం.

శ్రీ రామానుజాచార్యులు

భారతదేశంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎంతో విశిష్టమైనది. ప్రతి రాష్ట్రంలోనూ అబ్బురపరిచే ప్రఖ్యాత దేవాలయాలు మనకు కనిపిస్తాయి. వాటిలో తమిళనాడులోని తిరుచ్చునాపల్లికి ఆనుకుని ఉభయ కావేరీ నదుల మధ్య ఉన్న శ్రీరంగం పట్టణం కూడా ఒకటి. ప్రసిద్ధ వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటైన శ్రీరంగం ఆలయంలో విష్ణు మూర్తి స్వయంభువుగా అవతరించినట్లు చెబుతారు. ఏడు ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయంలో అడుగడుగునా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గది శ్రీ రామానుజాచార్యుల వారి శరీరం.

శ్రీరామానుజాచార్యులు పరమపదించి వెయ్యేళ్లకు పైగా గడిచినా ఆయన శరీరాన్ని నేటికీ ఇక్కడ భద్రపరిచి ఉంచడం విశేషం. అయితే చాలా మంది భక్తులకు దీని గురించి తెలియకపోవడం విచారకరం. కొందరు శ్రీరంగంలోని 4వ ప్రాకారంలో ఉన్న రామానుజాచార్యుల ఆలయాన్ని సందర్శించినా... అక్కడ ఉన్నది ఆయన దివ్య శరీరం అని మాత్రం గుర్తించలేరు.

పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చుని రామానుజులు ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టారు. ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తుంది. ప్రతి ఏటా రెండు సార్లు ఆయన కోసం ఓ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సమయంలో కర్పూరం, కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు. అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది. అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్లు, గోర్లను మనం స్పష్టంగా గుర్తించవచ్చు. కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవడం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి.

రామానుజాచార్యుల గొప్పదనం:

రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు. ఆయన జీవిత కాలంలో సగభాగం తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం క్షేత్రాల్లోనే గడిపారు.

కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి విగ్రహం విష్ణువు రూపానిదా? శివ రూపానిదా? అని వైష్ణవులు, శైవులకు మధ్య ఏర్పడిన వాదోపవాదాలకు రామానుజాచార్యులు పరిష్కారం చూపించారు. తిరుమల స్వామి వారి గర్భాలయంలో శంఖు చక్రాలను ఉంచగా తెల్లవారి చూసే సరికి స్వామి వాటిని ధరించి కనిపించడంతో ఈ సమస్య సులువుగా పరిష్కృతమైంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్య కైంకర్యాలను, సేవలను కూడా రామానుజాచార్యులే నిర్ణయించారు.

కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహ జీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు. హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు.

ప్రాచుర్యంలోకి రాని రహస్యం:

క్రీస్తు శకం 11 - 12 శతాబ్ధాల మధ్య రామానుజాచార్యులు శ్రీరంగంలో శరీరాన్ని విడిచి పెట్టారు. అప్పటి నుంచి ప్రత్యేక లేపనాలను అద్ది ఆయన శరీరాన్ని భద్రపరుస్తున్నారు. అయితే రామానుజాచార్యుల మాదిరిగానే 15వ శతాబ్ధంలో మరణించిన సెయింట్ జేవియర్ పార్ధివ దేహాన్ని కూడా గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ అనే చర్చిలో భద్రపరిచారు. గోవాను పోర్చుగీసు వారు పాలిస్తున్న సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ అనే క్రైస్తవ మతస్తుడు ఇక్కడ సువార్త వ్యాప్తికి కృషి చేశాడు. ప్రజలకు సహాయం అందిస్తూ క్రైస్తవ మతంపై నమ్మకాన్ని కలిగించాడు. ప్రపంచ వ్యాప్త పర్యటనల్లో భాగంగా మకావూలో క్రైస్తవ మత ప్రచారాలకు వెళ్ళిన ఆయన అక్కడ మరణించడంతో ఆ శరీరాన్ని గోవాలోని బసిలికా ఆఫ్ బాంబ్ చర్చికి తరలించారు. క్రైస్తవ మత వ్యాప్తిలో జేవియర్ చేసిన కృషికి గుర్తుగా ఆయన శరీరాన్ని ఓ గాజు పెట్టెలో ప్రత్యేక మూలికలతో కుళ్లిపోకుండా భద్రపరిచారు. దీంతో ఈ చర్చికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. గోవా పర్యాటకంలో ఇది ఒక ముఖ్యమైన సందర్శనీయ స్థలంగా పేరుగాంచింది. అయితే ఈ ప్రదేశానికి వచ్చిన ప్రాచుర్యం దీనికి ముందే శ్రీరంగంలో ఉన్న రామానుజాచార్యుల దివ్య దేహానికి మాత్రం లభించలేదు. అందుకే అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన రహస్యంగా ఇది మిగిలిపోయింది. కాబట్టి శ్రీరంగం పర్యటనకు మీరు వెళ్లినట్లయితే రామానుజుల పవిత్ర దేహాన్ని తప్పక సందర్శించండి.

ఓం నమో నారాయణాయ

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya