తినే ఆహారాన్ని బట్టి ప్రవర్తన

3.236.121.68

తినే ఆహారాన్ని బట్టి ప్రవర్తన 

పూర్వం ఒక శివభక్తుడు కాశీ నడిచి వెళుతూ, ప్రతీరోజు చీకటి పడేటప్పటికి దగ్గర్లోని గ్రామంలో ఎవరో ఒక గృహస్తు ఇంట ఆశ్రయం సంపాదించి అతిధిగా ఉండేవాడు. అలాగే ఒకరాత్రి ఒక గ్రామంలోని ఇంట ఆశ్రయం సంపాదించాడు.

ఆ రాత్రి ఆ ఇంట భోజనం చేసి పడుకున్న శివభక్తుడికి, ఆ ఇంటి ముందు కట్టి ఉన్న 'ఆవు' కనిపించింది. ఆ ఆవుని దొంగతనంగా తీసుకుపోవాలనే ఆలోచన ఆ భక్తుడికి కలిగింది. ఇంట్లోని వారందరూ నిద్ర పోగానే, ఏ మాత్రం చప్పుడు లేకుండా, ఆవుని తీసుకుని బయలుదేరాడు. ఉదయానికి ఆవుతో సహా ఒక చెరువు వద్దకు చేరుకుని, అక్కడ ఆవుని కట్టి, కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసాడు. అప్పుడు అతనికి రాత్రి తాను చేసిన పాపపు పని గుర్తుకు వచ్చింది. వెంటనే పశ్చాత్తాప పడుతూ, ఆ ఆవును తీసుకుని ఆ గ్రామం చేరి, ఆవును ఆ ఇంటి యజమానికి అప్పగించి "అయ్యా, నన్ను క్షమించండి, ఆవును దొంగలించాలన్న దుర్భుద్ది ఎలా కలిగిందో నాకు అర్ధం కాలేదు. ఉదయం కాలకృత్యాలు తరువాత నాపని నాకే చాలా సిగ్గుగా అనిపించింది" అన్నాడు.

ఆ ఇంటి యజమాని శివభక్తుడికి నమస్కారించి "అయ్యా! అది మీ తప్పు కాదు. నేను ఒక దొంగను. రాత్రి మీరు తిన్నది నేను దొంగలించి తెచ్చిన డబ్బుతో తయారుచేసిన భోజనం. దాని ప్రభావంతో మీకు దొంగ బుద్ధి కలిగింది.కాలకృత్యాల తరువాత దాని ప్రభావం మీలో పూర్తిగా పోయింది. అందువల్ల ఆవును తిరిగి తీసుకువచ్చారు" అన్నాడు. అప్పుడు శివభక్తుడు సంతోషించి, అక్కడి నుండి బయలుదేరాడు. తినే ఆహారాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుందని దీని అర్ధం

Quote of the day

Happiness is when what you think, what you say, and what you do are in harmony.…

__________Mahatma Gandhi