నియంత్రణ లేకుండా పరిగెత్తే ఆ గుర్రానికి కళ్ళెం వేయడం ఎలా ?

3.230.142.168

మనసు మాట వినదు. చదువు రాదు. నియంత్రణ లేకుండా పరిగెత్తే ఆ గుర్రానికి కళ్ళెం వేయడం ఎలా ?
లక్ష్మీ రమణ 

మనసు మాట వినదు . వద్దన్న దానినే కావాలని కోరుతుంది. సంకల్పం అనేది ఇక్కడ గట్టిగా పనిచేసే మంత్రం . ఉదాహరణకి చదివిందేదీ గుర్తుండదు .పనికిమాలిన విషయాలు బాగా గుర్తుంటాయి . సినిమాలు సీన్ టూ సీన్ గుర్తుండే వాడికి చదువు మాత్రం గుర్తుండదు . బలవంతంగా తిడితే, కొడితే అలాంటి పిల్లలు మారతారా ?  కానీ బలవంతంగా మనసుని స్వాధీనంలోకి తెచ్చుకుంటే, ఫలితం దారుణంగా ఉంటుందని రామాయణం చెబుతోంది. పంచతంత్రం కూడా ఇదే కథని చెబుతుంది. బలవంతంగా రాకుమారులకి ఏవిద్యనే నేర్పలేకపోతారు, ఆస్థానంలోని పండితులు .కానీ పంచతంత్రం కథలు వారికి అవసరమైన విజ్ఞానాన్ని బోధిస్తాయి . విష్ణుచిత్తుడు వారి చిత్తాన్ని మెల్లగా ధర్మ పరివర్తన వైపు మళ్లిస్తాడు . ఆ వివరాలేమిటో తెలుసుకుందాం పదండి . 

ఇంద్రియాలు పదకొండు విధాలుగా మనిషిని కష్టపెడతాయి. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయి. ఇంద్రియనిగ్రహం అనేది మనిషికి బతుకు సమస్య.

ఇంద్రియాలు గుర్రాల వంటివని, రథాన్ని నడిపే సారథి పగ్గాలను సమర్థంగా పట్టుకొని అదుపు చేయకపోతే గుర్రాలు ఇష్టం వచ్చిన దిక్కుకు ప్రయాణిస్తాయని, అప్పుడు ప్రమాదాలు సంభవిస్తాయని, కనుక సారథి వంటి మనిషి ఇంద్రియాలు అనే గుర్రాల పగ్గాలు లాగి అదుపులో పెట్టుకోవాలని అంటాడు మనువు.

ముందుగా అసలీ ఇంద్రియాలు ఏమిటి తెలుసుకోవాల్సిందే . ఎందుకంటె, వీటికి అధిపతి ఇంద్రుడు మరి . 

1.చెవులు(2) - మనిషి సంయమనాన్ని కోల్పోతే చెవులు చెడు మాటలనే వింటాయి.
2.చర్మం-  పనికిరాని స్పర్శను కోరుతుంది.
3.కళ్లు(2)- అశ్లీలాన్ని చూస్తాయి.
4.నాలుక- అనారోగ్యకరమైన రుచులను కోరుతుంది.
5.ముక్కు- దుర్గంధాలనే స్వీకరిస్తుంది.
6.మల, మూత్రద్వారాలు - పనిచేయకుండా పోతాయి.
7.కాళ్లూ చేతులూ- హింసను ఆచరిస్తాయి.
8.మాట - అదుపు తప్పుతుంది.
ఇలా పది ఇంద్రియాలు చేసే నష్టం ఒక ఎత్తయితే,
9.మనసు అనే పదకొండో ఇంద్రియం చేసే నష్టం ఒక ఎత్తు.

అసలు పది ఇంద్రియాలను మంచిగాను, చెడుగాను మార్చేది మనసే.
మనసు చెప్పినట్లే ఇంద్రియాలు వింటాయి.

అందుకే వాల్మీకి- ‘ఇంద్రియాల సత్‌ప్రవర్తనకు, అసత్‌ప్రవర్తనకు మనసే మూలకారణం’ అని రామాయణ మహాకావ్యంలో అంటాడు. రావణాసురుడు రామునిచేతిలో హతుడైపోతాడు . అపుడు మండోదరి చేత , ఆయన చెప్పించిన మాటలు ఇక్కడ మనం చెప్పుకుని తీరాలి . 

‘కోతులంటే చపల బుద్ధికి పెట్టింది పేరు.  అలాంటి కొన్ని కోట్ల కోతుల్ని రాముడు వెంట పెట్టుకుని సముద్రానికి సేతువు కట్టించి దాటి వచ్చాడు, నీకు అప్పుడైనా అనుమానం రాలేదా. ఇన్ని కోతులని ఒక్క మాటమీద నిలబెట్టగలిగినవాడు కేవలం  సామాన్యమైన మనిషి కాదని .  చివరికి నీవు ఆ మనుష్యుడైన మనీషి రాముడి చేతిలో చనిపోయావ " అని అంటుంది. ఇంకా వారిని అదుపు చేయగలిగిన రాముని చూసి ఆవిడ, ఇలా అంటారు . 

‘ రావణా!. నువ్వు రాముడి చేత సంహరింపబడ్డావని లోకం అనుకుంటుంది, నువ్వు ఎందువల్ల చనిపోయావో నాకు తెలుసు. ఒకప్పుడు నువ్వు తపస్సు చెయ్యాలనుకొని నీ ఇంద్రియాలని బలవంతంగా తొక్కి పెట్టావు. అప్పుడు నీ ఇంద్రియాలు నీ మీద పగబట్టాయి. అందుకని నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే నిన్ను చంపాయి.

ఒక్కసారి గా నీకు మోహం పుట్టింది అనడానికి నీ విషయంలో ఆస్కారం లేదు. మహా సౌందర్యరాసులైన భార్యలు నీకు కొన్ని వేల మంది ఉన్నారు, వారితో నువ్వు ఎవరితో క్రీడించినా నీ కోరిక అదుపులో ఉంటుంది. ఎక్కడో అరణ్యంలో ఉన్న సీతమ్మపైన మోహం పుట్టి ఆవిడని నువ్వు కోరుకోవడం కాదు, నువ్వు, నీ రాజ్యము, నీ వారు భ్రష్టమవ్వడం కోసమే  నీకు ఆ కోరిక పుట్టింది. ‘  అని . 

ఇక్కడ గమనించాల్సినవి రెండు విషయాలు. 1. చపలచిత్తములని అదుపు చేయగలిగిన రాముడు ఆ మనస్సులతో స్నేహం చేశారు . వాటిని ప్రేమగా తన దారికి తెచ్చుకున్నారు . ఏకపత్నీవ్రతుడై గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించారు . ధర్మ పక్షాన నిలిచారు . అందువల్లే అసురీ శక్తులని ఎదురించి పరంధామునిగా నిలిచారు. స్వయంగా ఇంద్రుడే మాతలి అనే తన సారధిని , రథాన్ని రామునికి పంపించారు అని యుద్ధకాండ చెబుతుంది. 

2. బలవంతంగా తన కోరికలని అణిచిపెట్టి, భగవంతుని ప్రసన్నతని పొందాడు . అధర్మ పక్షాన నిలిచాడు. ఇంద్రుడిని, గ్రహాలనీ శాశించాడు. కానీ తనలో ఉన్న ఇంద్రియ చాపల్యాన్ని గెలవలేకపోయాడు. ఎంతటి వీరుడు, శూరుడు అయినా చివరికి యుద్ధంలో నేలకొరిగాడు . ఆ యుద్ధానికి ముందయినా అతను తన కోరికని జయయించగలిగితే, మంచి మాటలు అతనికి రుచించేవి . 

అందుకే, చెడు వినకుండా, చెడు కనకుండా, చెడు అనకుండా, చెడు తినకుండా, చెడు ఆఘ్రాణించకుండా ఉండగలిగేవాడే, జితేంద్రియుడని శాస్త్రాల ప్రబోధం. రాముడు అటువంటివారు . ఇలా ఉండాలంటే మనిషి మొదట జ్ఞానవంతుడు కావాలి. జ్ఞానం లేని కర్మాచరణ పిచ్చివాడి చేతిలో రాయి వంటిదే కదా ! కాబట్టి ఏదైనా మనల్ని డిస్ట్రబ్ చేసేప్పుడు దానితోటి స్నేహం చేసి, గుర్రాన్ని మచ్చిక చేసుకున్న చందంగా  దారిలోకి తెచ్చుకోవాలి తప్ప , బలవంతంగా నిగ్రహించడం వలన తిరిగి పదేపదే అదే దారిలోకి వెళ్ళమనే గుర్రం మాటని మనం వినాల్సి వస్తుంది . 

Quote of the day

The season of failure is the best time for sowing the seeds of success.…

__________Paramahansa Yogananda