Online Puja Services

ఉపవాసం అంటే ఏమిటి ? బామ్మోవాచ !

18.191.157.186

ఉపవాసం అంటే ఏమిటి ? బామ్మోవాచ !
-లక్ష్మీ రమణ . 
 
ఉపవాసం అంటే ,  కేవలం నీళ్ళు తాగి భోజనం చేయకుండా ఉండడం . మరి అదే ఉపవాసమైతే, ఏకాదశి ఉపవాసం చేసిన రాజు అంబరీషుడు కేవలం నీళ్లు తాగి ఎలా ఉపవాసాన్ని ముగిస్తాడు ? పెద్దవాళ్ళు ఒకమాట చెప్తారు కదా లంఖణం పరమౌషధం అని !ఆ మాటకొస్తే ఇందులో ఉన్నదీ ఉపవాసమే కదా ! అంటే, ఉపవాసాల్లో 4 రకాలుంటాయి అంటూ చెప్పుకొచ్చింది మా బామ్మ . ఆ విశేషాలు మీకోసం ఇక్కడ. 


ఉపవాసంలో 4రకాలు ఉన్నాయి:

1 - నిర్జలోపవాసం.
 2 - జలోపవాసం.
3 - రసోపవాసం.
4 - ఫలోపవాసం.

1. నిర్జలోపవాసం:
మంచినీరు కూడా ముట్టకుండా చేసే  ఉపవాసమును ‘నిర్జలోపవాసం’ అంటారు. ఈ ఉపవాసం ముఖ్యంగా శరీరంలో నీరు ఎక్కువ చేరినప్పుడు , అంటే  శరీరం వాచినప్పుడు రెండు లేదా మూడు రోజులపాటు చేయాలి.  మూడురోజులకు మించి ఈ ఉపవాసం చేయకూడదు . 

2. జలోపవాసం:
కేవలం మంచినీరు మాత్రమే తీసుకుంటూ చేసే ఉపవాసమును ‘జలోపవాసం’ అంటారు . దీనిని మూడురోజుల నుంచి ఏడు రోజుల వరకు మాత్రమే చేయాలి . అంతకు మించి చేయకూడదు . శరీరంలో మాలిన్యాలు అధికంగా చేరి ఏ రసాహారమును కూడా జీర్ణం చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం మంచినీరు తాగించి ఉపవాసం చేయించవచ్చు . ఈ పద్దతిలో దాదాపు  రెండులీటర్లు మంచినీరు తాగాలి .

3. రసోపవాసం:
ఈ రసోపవాసమును సాధారణంగా ప్రకృతిచికిత్సాలయాల్లో రసోపవాసం చేయిస్తారు. కేవలం పండ్లరసాలతో చేయు ఉపవాసమును ‘రసోపవాసం’ అంటారు. ఈ ఉపవాసం వారం రోజులు మొదలుకుని నెలరోజులు వరకు కూడా చేయవచ్చు. రసోపవాసంలో ముఖ్యంగా నిమ్మరసం, పలుచని నారింజరసం, బత్తాయిరసం, కమలారసం, తేనెనీరు, కొబ్బరినీరు, బార్లినీరు మొదలగునవి రోజుకు మూడుసార్లు నుండి అయిదుసార్లు లోపలికి తీసుకోవచ్చు.

4. ఫలోపవాసం:
ఉపవాసం చేయలేనివారు ఫలోపవాసం చేయవచ్చు. కేవలం రసము నిండిన ఫలములు మాత్రమే ఆహారంగా తీసికొనవలెను. అరటిపండు తీసుకోకూడదు. ఎక్కువ బత్తాయి, నారింజ, కమలా, ద్రాక్షా, అనాస, దానిమ్మ, మామిడి, పుచ్ఛ మొదలగు పండ్లు తినవచ్చు .

ఈ ఉపవాసం రోగిని అనుసరించి పది నుంచి నలుబది రోజుల వరకు అనుసరించవచ్చు.

ఉపవాసం చేయుట వలన వివిధ అవయవాలలో కలుగు మార్పులు:

జీర్ణక్రియకు మంచి విశ్రాంతి లభించి అజీర్ణం తొలగిపోయి ఆకలివృద్ధి అవుతుంది .

మలాశయంలో మురికి బహిష్కరింపబడి అజీర్ణం తొలగించబడి క్రిములు , బాక్టీరీయా నాశనం అవుతాయి .

మూత్రపిండాలలోని విషపదార్ధాలు, రాళ్లు బహిష్కరింపబడతాయి .

ఊపిరితిత్తులలోని నంజు, నీరు బహిష్కరించబడి ఆయాసం నివారించబడుతుంది . శ్వాసక్రియ చక్కగా జరుగుతుంది .

గుండెచుట్టు, లోపల చేరిన కొవ్వు, నీరు తగ్గి గుండె చక్కగా కొట్టుకుంటుంది . గుండెజబ్బులకు రసోపవాసం మంచిది.

లివర్ , స్ప్లీన్ ఆహారం జీర్ణం అయ్యేందుకు  ఇవి చక్కగా పనిచేయడం అవసరం .  ఈ ఉపవాసం చేయడం  వలన వీటికి విశ్రాంతి దొరుకుతుంది  . వాటిలోని మాలిన్యం తొలగించబడి జీర్ణక్రియ వృద్ది అవుతుంది. 

శరీరంలో రక్తప్రసారం చురుకుగా ఉంటుంది . ఉపవాసం చేయడం వలన  రక్తదోషములు నివారించబడతాయి . తిమ్మిర్లు, మంటలు , నొప్పులు కూడా తగ్గిపోతాయి .

కీళ్లలో పేరుకుపోయిన కొవ్వు, నీరు, మాంసము వంటి మాలిన్యాలు తొలగించబడి వ్యాధి నివారణ జరుగుతుంది .

నాడీమండలం శుభ్రపడుతుంది . 

జ్ఞానేంద్రియాలలో మాలిన్యాలు అన్ని తొలగిపోతాయి . 

చర్మం కాంతివంతం అవుతుంది . చర్మవ్యాధులు హరిస్తాయి  . శరీరానికి చక్కటిరంగు సంప్రాప్తిస్తుంది .

మనస్సు ప్రశాంతంగా ఉండి కోపం వంటి ఉద్రేకాలు  మన అదుపులో ఉంటాయి . 

ఉపవాసం చేయకూడని వారు:

చాలా బలహీనంగా ఉన్నవారు, గుండెజబ్బులు కలవారు, బాలురకు, వృద్దులకు గర్భిణీస్త్రీలకు, బాలింతలకు, క్షయ మరియు రక్తహీనత కలిగిన రోగులు, మధుమేహంతో ఉన్నవారికి ఎక్కువ రోజులు ఉపవాసం చేయకూడదు.

 ఉపవాసం చేయదగిన వారు:
స్థూలకాయులు, ఉబ్బసం, సంధివాతం, రక్తపుపోటు, చర్మవ్యాధులు మొదలగు దీర్ఘకాలిక రోగులకు ఉపవాసం చేయడం మంచిది.

ఉపవాసం ముగించిన వెంటనే ఘనాహారం తీసుకోకూడదు. ఉపవాసం తరువాత ఎక్కువ ఆహారం తీసుకొకూడదు. క్రమేపి ఆహారాన్ని పెంచుకుంటూ రావలెను. కారం, మసాలా పదార్దాలు, పిండివంటలు పచ్చళ్ళు తినకూడదు. అలా తీసుకున్నచో విరేచనాలు, వాంతులు, కడుపులో మంట, నొప్పి కలగవచ్చు . 


ఇదంతా ఉపన్యాసం బానే ఉందిగానీ, వారంరోజులూ, రోజుకో దేవుడి పేరు చెప్పి ఉపవాసం చేస్తావు కదా బామ్మా ! సోమవారం పూరీలు, మంగళవారం గారెలు , బుధవారం బొబ్బట్లు , గురువారం బొబ్బర్లు అని వారమంతా ఒకపూట రకరకాల టిఫెన్ లు లాగించేస్తావుగా ! మరి అదేమి ఉపవాసం అని అడిగితె, అసలైన ఉపవాసం అంటే అదేనే ! అయినా ఎవరి నియమాలు వాళ్ళవి ! అని బుగ్గలు సొట్టపోయి బోసిపళ్ళు కనిపించేలా నవ్వేసింది మా బామ్మ . కానీ, ఉపవాసం పద్ధతిగా చేస్తే , బోలెడన్ని ప్రయోజనాలున్నాయని మాత్రం ఆవిడ మాటల్లో అర్థమయ్యింది . 

లాస్ట్ పంచ్ మనదయితే వచ్చే ఆ కిక్కే వేరప్పా ! అని అదేదో సినిమాలో హీరో అన్నట్టు , అందుకే నే నామాట వినమనేది, కాస్త వాళ్ళు తగ్గి పెళ్లినాటికైనా నాజూకుగా తయారవుతావ్ . వారానికోసారి నిర్జలోపవాసం చెయ్యి ! అని సలహా ఇచ్చిన బామ్మ గారిని చూసి తెల్లమొఖం వెయ్యడం నావంతయ్యింది .

Quote of the day

From the solemn gloom of the temple children run out to sit in the dust, God watches them play and forgets the priest.…

__________Rabindranath Tagore