Online Puja Services

సుస్వర లక్ష్మి - MS సుబ్బులక్ష్మి

3.17.75.227

సుస్వర లక్ష్మి - MS సుబ్బులక్ష్మి 
-లక్ష్మీ రమణ 
 
భారతీయ సంప్రదాయానికి చీరకడితే ... అది ఆమె స్వరూపం. కర్ణాటక సంప్రదాయ సంగీతం తంబురామీటితే ... అది ఆమె గళ మాధుర్యం. నైటింగేల్ అఫ్ ఇండియా గా సుపరిచితురాలు.   సంగీత సరస్వతికి ప్రతిరూపమా  అనిపించేలా ... తన గాత్రం తో తన్మయులను చేసిన ఆమె ms సుబ్బు లక్ష్మి . ఆధ్యాత్మిక కీర్తనలు, స్తోత్రాలు, మంత్రాలు, కవచాలు, సుప్రభాతాలు .. ఆమె గళం లో శుద్ధంగా, స్వచ్చంగా ... శృతిబద్ధంగా జాలువారాయి .  ఆధ్యాత్మిక గానమంటే ... సుబ్బులక్ష్మిదే నన్న పేరు తెచ్చుకొన్నారు.
 
"కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ... ఉత్తిస్ఠ నరశార్దూలా కర్తవ్యమ్ దైవ మాహ్నికం."  అంటూ  విశ్వామిత్రుడు తోలి సారి రఘు నందనుడికి సుప్రభాతం పాడాడు. ఆ తర్వాత ఎంతమంది సుప్రభాత సేవ చేసినా ... స్వామికి, ఆయన భక్తులకి  M.S. సుబ్బు లక్ష్మిగాత్రమే ఇంపుగా ఉందేమో !! తిరుమల ఆస్థాన గాయక పదవినిచ్చి ప్రతిరోజూ సుప్రభాతసేవ చేయించుకొన్నాడు స్వామి . ఇక ఆయన భక్తులు ... ప్రతినిత్యం ms ఆధ్యాత్మిక గానామృతం వింటూ ...స్వామినే ప్రత్యక్షం గా చూసిన అనుభూతిని పొందుతుంటారు.  ఆమె గళం విననిదే భారతీయులకు  పొద్దుపోదు, తెల్లవారదంటే .. అతిశయోక్తి కాదు. కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి గా కళా ప్రేమికుల హృదయాల్లో .. సుస్థిర స్థానం సంపాదించారు సుబ్బులక్ష్మి. దేశములో మొట్ట మొదటి సారిగా భారతరత్నపురస్కారం అందుకున్న గాయకురాలుగా చరిత్ర సృష్టించారు. ఎందరికో స్ఫూర్తినిచ్చి చరిత్రలో తన గానంతో అజరామరురాలు అయ్యారు.
 

సంగీత ప్రస్తానం :

సంగీత ప్రియులు అభిమానంగా ms అని పిలుచుకొనే ఆమె అసలు పేరు మదురై షణ్ముఖవడిపు సుబ్బు లక్ష్మి . సెప్టెంబర్ 16, 1916 న  తమిళ నాడు లోని మధురై లో జన్మించారామె. , ప్రముఖ వీణావాద్య విద్వాంసురాలు షణ్ముఖవడివు అమ్మాళ్ , ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య అయ్యర్ సుబ్బు లక్ష్మి తల్లిదండ్రులు . బాల్యంలో పాఠశాలలో అకారణంగా టీచరు కొట్టడంతో చిన్నతనంలోనే బడికి వెళ్ళడం మానేసింది సుబ్బలక్ష్మి.  ఇంట్లోనే ఉంటూ...  ఆమె అక్క, అన్నదమ్ములతో కలసి సంగీత సాధన చేసేది.  సెమ్మంగుడి శ్రీనివాస్ అయ్యర్ వద్ద సంగీతంలో శిక్షణ  ఆమె  ప్రతిభకు స్పష్టమైన రూపుదిద్దింది. అయితే .. తల్లే ఆమెకు ఆది గురువు. పదేళ్ళ ప్రాయం నుంచే MS సంగీత ప్రస్థానం ప్రారంభమైంది. ఆమెలో భక్తితత్వానికి బీజం వేసింది మాత్రం  తండ్రి సుబ్రహ్మణ్యఅయ్యరే .  జీవితకాలమంతా ఆమె భారతీయ సంప్రదాయాన్ని, సంస్కారాన్ని అమితంగా ప్రేమించింది.
 
అమాయకత్వం, వినసొంపైన కమ్మని స్వర మాధుర్యం, అద్భుమైన సంగీత ప్రతిభ కలబోసుకొన్న సుబ్బు లక్ష్మి సుమారు 10 సంవత్సరాల వయసులో తొలి ప్రదర్శననిచ్చింది. గుడిలో పాటలు పాడడంతో ఆమె  సంగీత ప్రదర్శన మొదలైంది. ఆనాటి  జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ ."తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాను. అప్పుడు మా అమ్మ నన్ను పిలిచింది.పాట పాడమన్నది. ఒక పాట పాడాను. అప్పుడు చప్పట్లు మారుమ్రోగాయి. ఐతే, నాకు అవేవీ బోధపరచుకొనని వయసు. పాట పాడటము అయిపోగానే మళ్ళీ స్కూలు పిల్లలతో మట్టిలో ఆడుకుంటూ కూర్చున్నాను." అని ఒక సందర్భంలో బాల్య స్మృతులను మననం చేసుకున్నారు సుబ్బులక్ష్మి . ఆ తర్వాత లెక్కలేనన్ని కచేరీలనిచ్చారు MS.
 

వివాహం : 

సుబ్బలక్ష్మిలోని ప్రతిభను గుర్తించిన తల్లి మధురై నుంచి చెన్నై కి మకాం మార్చటంతో ఆమె జీవితంలో మరో అధ్యాయం ప్రారంభమైంది. ఆమె 1933 లో మద్రాస్ సంగీత అకాడెమీలో మొట్ట మొదటి సంగీత కచేరీకి శ్రీకారం చుట్టింది. సంగీతపరంగా సుబ్బలక్ష్మి జీవితంలో ఇది ఒక మలుపైతే...  తన గురువు, మార్గదర్శి, త్యాగరాజన్ సదాశివన్ తో 1940 లో ఆమె ప్రేమవివాహం మరో ముఖ్యమైన మలుపు.
 
భక్తిగాయనిగా సుబ్బలక్ష్మి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంలో సదాశివన్ కృషి ఎంతో వుంది. ఎన్నో సందర్భాల్లో … “నా భర్త సదాశివం ప్రోత్సాహము వలన నేను ఇంత కీర్తి శిఖరాలను అధిరోహించగలిగాను." అని ఆమె కృతజ్ఞతతో చెప్పింది. సదాశివన్ స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది . ఆనంద వికటన్ పత్రికకి  సీనియర్ ఎగ్జిక్యూటివ్ గానూ  వుండేవారు. సదాశివన్ సినీ నిర్మాత కూడ కావడంతో సుబ్బలక్ష్మి సినీ జీవితానికి శ్రీకారం చుట్టింది.  1938 సంవత్సరంలో సేవాసదనం సినిమా ద్వారా సుబ్బలక్ష్మి సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టింది.  తమిళ సినిమాలలో గాయనిగానే కాక తెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించింది.
 

వెండితెరపై వెలిగిన సంగీత సామ్రాజ్ఞి :

1935 లోనే సుబ్బులక్ష్మి ‘భక్తకుచేల’ అనే తమిళ చిత్రంలో నటించింది.  నటనతోనే కాదు పాటతోనూ అందరిని మెప్పించింది . 1940 వ సంవత్సరంలో శకుంతలై అన్న తమిళ సినిమాలో ఆమె తొలిసారిగా గాయక నటిగా తెరపై కనిపించింది. 1945 వ సంవత్సరంలో నిర్మించిన తమిళ చిత్రం 'మీరా'ని   హిందీలో కూడా పునర్నిర్మించారు.   రెండింటిలోను సుబ్బులక్ష్మే మీరా పాత్రని పోషించారు . మీరా పాత్రలో ... ఆమె నటిగా, గాయనిగా జీవించింది . తాదాత్మ్యం తో మీరా పాడుతుంటే ... ప్రేక్షకులు పరవశులయ్యారు. సుబ్బులక్ష్మిని మీరాబాయి అవతారంగా వారు  కొనియాడారు. విజయవంతమయిన ఈ చిత్రాలతో సుబ్బలక్ష్మి పేరు భారతదేశమంతటికీ సుపరిచితమయింది. 'మీరా' సినిమాలోని ఆమె నటనకు, గాన మాధుర్యానికి జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత ఆమె ఇక సినిమాల్లో నటించలేదు.  1947లో చిత్రగీతాలకు స్వరం అందిచడం కూడా  ఆపేసి.... శాస్ర్తీయ సంగీతాలాపన మాత్రమే చేశారు.జాతి గర్వించతగ్గ అంతర్జాతీయ సంగీత సామ్రాజ్ఞిగా ఎదిగారు.
 

కట్టు, బొట్టూ, స్వరం , సంగీతం అంతా భారతీయ సంప్రదాయ మధురమే !
 
వేదిక పై సుబ్బలక్ష్మి పాడుతుంటే స్వయంగా అమ్మవారే పాడుతున్నట్లు భావించేవారు.  m. s కచేరీ చేస్తుంటే ... సప్త స్వరాలూ మూర్తీ భవించి మానవ రూపంలో వేదిక నలంకరించి నట్లుండేది . భారతీయతను తన ఆహార్యం లో అణువణువునా నింపుకొన్నఆమె తంబురా మీటుతుంటే .... స్వర గంగా ప్రవాహం ఉత్తుంగ తరంగమై ఉవ్వెత్తున ఎగసి పడేది. ఆ భక్తి భావ తరంగాలు హృదయాన్ని తాకి,  సరాసరి సర్వేశ్వరుడి సన్నిధికి తీసుకెళ్ళేవి.
 
పట్టుచీర, నుదుటి మీద 'కాసంత' ఎర్రటి కుంకుమబొట్టు, కళ్లకు నిండుగా కాటుక, కొప్పు, కొప్పు నిండా మల్లెలు, చేతుల నిండా గాజులు, చేతిలో తంబూర ఇది M . S . నిండైన రూపం. భారతీయ కట్టు బొట్టుతో వేదిక పై సాక్షాత్తు వీణాపాణి దర్శనం లా తోచేది.ఆమె కచేరీ ప్రారంభించగానే శ్రోతలు ఆమె గానలహరిలో మునిగిపోయేవారు. కర్ణాటక సంగీతంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక గానంలో ఆమె శైలి విశిష్టమైనది. గానం ఓ ధ్యానంలా సాగేది. పదికి పైగా భాషల్లో ఎన్నో కృతులను, కీర్తనలును, శాస్త్రీయ, లలిత గీతాలను, భజనలు, జానపద గేయాలు, మరాఠీలో అభంగాలు, దేశభక్తి గేయాలు కూడా పాడారు. ఏ భాషలో పాడినా అదే తన మాతృభాష అన్నట్లుగా స్పష్టమైన భాషా నుడికారంతో భావయుక్తంగా ఆలపించడం సుబ్బలక్ష్మి ప్రత్యేకత. మా తెలుగు తల్లికీ మల్లెపూదండా... అని తమిళ గాత్రం Ms పాడుతుంటే .... తెలుగు తేనెలు జాలువారేవి .
 
శృతి, లయ, ఆలపనతో పాటు భావాన్ని, భక్తిని సమపాళ్ళలో వ్యక్తీకరించడం, పామరులను సైతం శాస్త్రీయ సంగీతంతో మెప్పించడం ఆమెకు మాత్రమే సాధ్యం! ముఖ్యంగా సంక్లిష్ట సమాసాలతో కూడిన సంస్కృత భాషలోని భావం దెబ్బతినకుండా అలవోకగా ఆలపించడం ఆమె సాధన ద్వారా సాధించుకున్న గొప్ప వరం. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రివంటి సంగీత దిగ్గజాలు రూపొందించిన గీతాలకు సుబ్బలక్ష్మి తన గాత్రం ద్వారా ప్రాణం పోశారు.
 

ప్రముఖుల ప్రశంసలు : 

సుబ్బులక్ష్మి గానామృతం ఎందరో ప్రముఖులను మైమరచిపోయేలా చేసింది. జాతీయ, అంతర్జాతీయ వేదికలు ఆమె సంగీత సమ్మోహనాస్త్రానికి దాసోహమన్నాయి.  కర్నాటక సంగీతానికి మహారాణిగా పట్టం కట్టాయి .    
 
 "సుబ్బు లక్ష్మి పాటపాడే సమయాల్లో తనను తాను మరచిపోతుంది.తన సంగీతంతో మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకెళ్తుంది" అని .. మహాత్మా గాంధీ వ్యాఖ్యానించారు .
 
"సంగీతప్రపంచంలో మహారాణి సుబ్బులక్ష్మి. ఆమె పాడుతున్నప్పుడు  ...ఆ రాణి ముందు నేను , నా ప్రధానమంత్రి పదవి యెంత" అని పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ స్వయంగా ఆమెను ప్రశంసించారు. 
 
‘నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా’  అని భారతదేశపు కవి కోకిల సరోజినీ నాయుడు కితాబు నిచ్చారు . 
 
.‘‘సుబ్బులక్ష్మి ప్రార్థనతో ప్రారంభమైనదంతా తప్పక వృద్ధి చెందుతుంది’’ అని ఇందిరాగాంధీ , ఆమె ఎక్కాలు చదివినా శ్రావ్యంగా ఉంటుందని అని శ్రీకల్కి కృష్ణమూర్తి ,  ‘‘తపస్వినీ’’ అంటూ లతా మంగేష్కర్‌, ‘‘సుస్వర లక్ష్మి’’ అంటూ ఉస్తాద్‌ బడే గులాం అలీ ఖాన్‌ వంటి దేశీయ  ప్రముఖులెందరో ... సుబ్బులక్ష్మి ప్రతిభను కీర్తించారు.  భారత సంగీత ప్రపంచానికి సుబ్బులక్ష్మి ఒక నిధి అని అంటారు.
 

ఐక్యరాజ్యసమితిలో అమృతగానం :
 
ఎన్నో అంతర్జాతీయ వేదికలు సుబ్బలక్ష్మికి రెడ్ కార్పెట్ పరచి ఆహ్వానించాయి. ఐక్య రాజ్య సమితి లో పాడిన తొలి భారతీయ  గాయనిగా చరిత్ర సృష్టించారు . ఆ సందర్భంలో 'న్యూయార్క్ టైమ్స్' పత్రిక సుబ్బలక్ష్మిని ప్రశంసిస్తూ "తన సంగీతంతో సందేశాన్ని వినిపించగల సమర్థురాలిగా" పేర్కొంది. లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో , ప్రదర్శన యిచ్చినపుడు మధువులు చిలికే ఆమె గానం ఇంగ్లండ్ రాణిని కూడా తన్మయురాలిని చేసి, ప్రశంసించేలా చేసింది. 1977లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అమెరికాలలోని కార్నెజి హాల్‌‌‌లో, 1982 లో లండన్‌లోని రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో  గాన కచేరీలు నిర్వహించిన గౌరవం దక్కించుకున్నారు సుబ్బులక్ష్మి. కార్నెజి హాల్‌లో సుబ్బులక్ష్మి ప్రదర్శనను తరువాత కాలంలో సి.డి.ల రూపంలో ఆర్‌.పి.జి.గ్రామ్‌ఫోన్‌ కంపెని ‘ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి ఎట్‌ కార్నెజి హాల్‌’ పేరుతో విడుదల చేసింది. తన జీవితకాలంలో 2వందలకు పైగా చారిటీ కచేరీలు చెశారామె.
 

అవార్డులు - రివార్డులు 

 సుబ్బులక్ష్మి సంగీత ప్రాభవానికి  అనేక అవార్డులు రివార్డులు వరించి వచ్చాయి. భారరత్న, పద్మభూషణ్, పద్మ విభూషణ్, రామన్ మెగెసెసే వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకోన్నరామె . అనేక విశ్వవిద్యాలయాలు ఆమె ని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయనిగా గౌరవం దక్కించుకోవడం తో పాటు పూర్ణ కుంభ స్వాగతం అందుకొన్నారు శ్రీమతి సుబ్బులక్ష్మి.  తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ సుబ్బు లక్ష్మి కాంస్య విగ్రహాన్నినెలకొల్పింది .
 
ఇంటింటా పవిత్ర సుగంధాలను వెదజల్లిన ' సుప్రభాత ' గీతమై, ప్రతి ఇంటా ఆధ్యాత్మిక భావనలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్యస్తోత్రమై, ఈ ధరణీతలాన్ని కొన్ని దశాబ్దాల పాటు పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార...  2004, డిసెంబర్ 11న శాశ్వతంగా మూగబోయింది. కాని ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంత కాలం ప్రపంచం అంతా మారుమోగుతూనే ఉంటుంది. తన గానాన్ని భగవదర్పితం చేసి ,స్వర రాగ రంజిత తరంగమై ప్రపంచాన్ని పరవశింప జేశారామె. మధుర ,మంజుల గాత్రం తో సమ్మోహన పరచి ,భారత దేశానికి సాంస్కృతిక రాయ బారి గా నిలిచి భారత రత్నమైన సంగీత రత్నం స్వర్గీయ ఏం.ఎస్ .సుబ్బు లక్ష్మి .ఆమె పరమ పదించినా ఆ  పద మంజీరాలు ఎప్పటికీ ఘల్లు మంటూనే వుంటాయి .

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi