Online Puja Services

మృత సంజీవనీ విద్య బృహస్పతికి ఎందుకు తెలియలేదు ?

18.222.179.186

మృత సంజీవనీ విద్య బృహస్పతికి ఎందుకు తెలియలేదు ?
- లక్ష్మీరమణ 

బృహస్పతి దేవతలకి గురువు. శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు. ఇద్దరూ వేదవేదాంగాలలో , ఇతర విద్యల్లో సమఉజ్జీలు. ఆమాటకొస్తే , ఇద్దరూ ఒకే గురువు శిష్యులు .  అయినప్పటికీ, శుక్రాచార్యుడికి తెలిసిన మృత సంజీవిని విద్య బృహస్పతికి తెలియ లేదు . అనంతర కాలంలో బృహస్పతి కొడుకైన కచుడు శుక్రాచార్యుని మెప్పించి ఆ విద్యని గ్రహించాడు . కచదేవయానిల వృత్తాంతం లోకవిదితమే . కానీ, ఈ విద్యా విషయంలో బృహస్పతి కన్నా శుక్రాచార్యుడు ఏవిధంగా అధికుడయ్యాడు ?

శుక్రుని గాధ మత్స్య పురాణంలోనూ, వ్యాస మహాభారతంలోనూ, కాశీఖండంలోనూ, దేవీ భాగవతంలోనూ చెప్పబడింది. బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ కూడా బృహస్పతి తండ్రి అయిన ఆంగీరసుని వద్దే విద్యను అభ్యసించారు. గురువు ఎప్పుడూ కూడా విద్యార్ధులందరినీ సమ దృష్టితోనే చూడాలి . అయితే, అంగీరసుడు ఇద్దరు శిష్యులకీ సమానంగా విద్యని బోధించడం లేదని, ఒకింత కొడుకైన బృహస్పతి పట్ల పక్షపాతం వహిస్తున్నారని శుక్రాచార్యునికి అనిపించింది .  ఆయనలో ఆ అసంతృప్తి అంతకంతకూ పెరిగిపోనారంభించింది . దాంతో శుక్రుడు అంగీరసునుని  విడిచి, మరో సమర్ధుడైన గురువుని అన్వేషిస్తూ వెళ్లారు . 

ఆ విధంగా అన్వేషిస్తూ,  శుక్రుడు గౌతమమహాముని వద్దకు వెళ్లారు.  విద్యను అర్థించారు.  గౌతముడు, శుక్రుని వల్ల జరిగినదంతా  తెలుసుకున్నారు.  ఇప్పుడు గౌతముడు సంకటంలో పడ్డారు. ఆయన శుక్రునికి విద్యాబోధన చేయడం అంటే, కోరి అంగీరస మునితో వైరాన్ని కొనితెచ్చుకోవడమే! మరో వైపు విద్యని ఆరాధించిన అర్హుడైన విద్యార్థినీ కాదనకూడదు . అందుకని ఒక చక్కని తరుణోపాయాన్ని సూచించారు . 

సర్వవిద్యాలకీ మూలభూతుడైన పరమాత్ముడు శివుడు ఒక్కడేనని, ఆయనను అర్చించి కోరిన విద్యలను పొందమని గౌతముడు శుక్రునికి హితువు చెప్పాడు. అప్పుడు శుక్రుడు శివుని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు.  ఆయన తపస్సుకు మెచ్చి, దర్శనమిచ్చిన శివుడి నుండి శుక్రుడు సర్వ విద్యలతో పాటుగా మృత సంజీవిని విద్యను కూడా వరంగా  పొందాడు. 

ఆ విధంగా శుక్ర, బృహస్పతిలకు గురువైన ఆంగీరసులకి ప్రమేయం లేకుండానే శుక్రుడు విద్యలని గ్రహించారు.  అలా గ్రహించిన మృతసంజీవనీ విద్యని ఉపయోగించే, దేవతల మీద యుద్ధంలో చనిపోయిన రాక్షసులని తిరిగి బ్రతికించేవారు. ఈ కారణంగానే శుక్రునికి తెలిసిన మృత సంజీవిని విద్య బృహస్పతికి తెలియ లేదు.  అదీ కథ . 

#mruthasanjeevani #brihaspati #sukracharya

Tags: mrutha sanjeevani, brihaspati, bruhaspati, sukracharya, kacha,kachudu

Quote of the day

To be idle is a short road to death and to be diligent is a way of life; foolish people are idle, wise people are diligent.…

__________Gautam Buddha