Online Puja Services

ప్రియురాలిని బ్రతికించుకున్న ఋషి !

3.138.138.144

తన ఆయుష్షులో సగభాగాన్నిచ్చి ప్రియురాలిని బ్రతికించుకున్న ఋషి !
లక్ష్మీ రమణ 

మహాభారతం పంచమ వేదం . కానీ ఈ కావ్యంలోని ఉదంతాలు నాగజాతికి విధించిన పరీక్షలు సామాన్యమైనవి కావు .  పరీక్షిత్తు మహారాజు మరణానికి ప్రతీకారం చేయడానికి జనమేజయుడు సర్పయాగం చేశాడు . ఉదంకుడు , పౌష్యుని భార్య కుండలాలని గురుదక్షిణగా తెచ్చే సమయంలో తక్షకుడు వాటిని అపహరించడం చేత తక్షకునిమీద కోపాన్ని మొత్తం నాగ జాతిమీద చెల్లించుకునే ప్రయత్నం చేశాడు . జనమేజయుని సర్పయాగానికి పురికొల్పాడు . ఇక తన తల్లిని అన్యాయంగా దాసిగా మార్చి , ఊడిగం చేయించుకున్నందుకు సుపర్ణుడు (గరుక్మంతుడు) ఆ జాతిమీద పగబూనాడు . ఒక్క ఆస్తిక మహాముని లేకపోయినట్లయితే, నాగజాతి అంతరించిపోయాయి ఉండేది. ఇదే విధంగా నాగజాతిమీద పగబూనిన మరో మహర్షికథ మనకి మహాభారతంలో కనిపిస్తుంది . ఆయనే రురుడు . 

చ్యవన మహర్షి, సుకన్యా దంపతులకి జన్మించిన మహానుభావుడు ప్రమతి . ఆయన ఘృతాచి అనే అప్సరసని వరించడం వల్ల , వారికి జన్మించిన వాడు రురుడు . మరో మన్మధుడా అన్నట్టుండే సౌందర్యం ఆయన సొంతం . ఘృతాచి సౌందర్యమూ , ప్రమతి తపస్సు యొక్క తేజస్సు ఆయనలో ప్రతిఫలిస్తూ ఉండేవి . 

ఇదిలా ఉండగా విశ్వావసుడనే గంధర్వరాజుకి మేనకా వలన ఒక కుమార్తె జన్మించింది . వారా బిడ్డకి జన్మనైతే ఇచ్చారు కానీ, బాధ్యత వహించలేదు . ఆమెని, స్థూలకేశుడనే ముని ఆశ్రమంలో వదిలి వెళ్లిపోయారు . ఆ మహర్షే ఆ బిడ్డకి ప్రమద్వర అనేపేరిట పెంచి పెద్ద చేశాడు .  ఆమె కూడా అసమాన తోజోరాశిగా, అద్వితీయ సౌందర్యంతో మరో రతీదేవిలా భాసించేది . 

రురుడు, ప్రమద్వరని చూసి ప్రేమించాడు . ఒకనాడు ప్రమద్వర చెలులతో కలిసి స్థూలకేశుని ఆశ్రమ ప్రాంతంలోని పచ్చికపై ఆడుకుంటోంది . అక్కడే ఉన్న ఒక క్రూరసర్పం ఆ యువతిని కాటువేసింది . అక్కడికక్కడే ప్రమద్వర మృత్యువు పాలయింది . ఆ వార్తని విని స్థూలకేశునితోపాటు, ఆశ్రమవాసులందరూ దుఃఖించారు. వుదయం విన్న రురుడు పరుగుపరుగున అక్కడికి చేరుకున్నాడు .  

చనిపోయిన తన ప్రేయసిని తిరిగి బ్రతికించమని, అలా చేస్తే, తన తపఃఫలాన్ని మొత్తాన్ని ధారపోస్తానని, దేవతలందరినీ పేరుపేరునా తలుచుకున్నాడు. ప్రార్ధించాడు . మొరపెట్టుకున్నాడు . అప్పుడు అశరీరవాణి ఆయన ఆయుష్షు లో సగాన్ని ఆమెకి ధారపోస్తే , బ్రతకగలదని మార్గఅంతరాన్ని బోధిస్తుంది .  దాంతో రురుడు మరోక్షణమైనా ఆలోచించకుండా, తన ఆయుష్షు లో సగాన్ని ప్రమద్వరకి ధారపోసాడు . ఆమెని బ్రతికించుకున్నాడు . 

రురుని చిత్తశుద్ధిని మెచ్చుకొని స్థూలకేశమహర్షి , ప్రమద్వరని రురునికే ఇచ్చి వివాహం జరిపిస్తాడు . కానీ రురుడు తన ప్రియురాలిని కాటందుకున్న సర్పజాతిమీద తగని కోపాన్ని, పగని పెంచుకున్నాడు. అప్పటినుండీ ఎక్కడ పాము కనిపిస్తే, అక్కడ దానిని అంతం చేయడం మొదలుపెట్టాడు . ఆయన పాదసవ్వడికే  పాములు ప్రాణభయంతో పరుగులు తీసేవి . 

ఒకనాడు అదేవిధంగా తనకి ఎదురుపడిన ఒక సర్పాన్ని కర్రెత్తి ఒక్క దెబ్బ వేశాడు  రురుడు . అంతే , ఆ పాము సర్పరూపాన్ని విడిచి ఒక బ్రాహ్మణ యువకునిగా మారిపోయింది . ఆశ్చర్యచకితుడైన రురుడు, ఆ బ్రాహ్మణుణ్ణి ‘ అయ్యా మీరెవరు ? దుష్టమైన ఈ సర్పరూపం మీకెలా ప్రాప్తినిచ్చింది?’ అని ప్రశ్నించాడు  .  

‘ నాయనా ! నా పేరు సహస్రపాదుడు. నేను నా మిత్రుడైన ఖగమునితో పరిహాసమాడుతూ అతనిపైకి ఒక గడ్డిపాముని విసిరాను . నాపై కోపించిన అతను  నన్ను సర్పానివై పడిఉండమని శపించాడు . ఆ తర్వాత శాంతించి, భార్గవ వంశస్థుడైన రురుడు నీకు శాపవిముక్తిని కలిగిస్తాడని చెప్పాడు . అప్పటినుండీ ఇలా పామునై సంచరిస్తున్నానని ‘ చెప్పారు . 

రురుడు ‘ అయ్యా ! తమరికి నావల్ల శాప విమోచనం కలిగినందుకు సంతోషంగా ఉందని ‘ నమస్కరించాడు . అప్పుడా సహస్రపాదముని , ‘ నాయనా నీ వినయం నాకు గొప్ప ఆనందాన్ని చేకూరుస్తోంది . ఉత్తమ కర్మలతో చిరకాలం వర్ధిల్లు. అని దీవించారు . ‘ ఇక ఇప్పటికైనా శాంతించి, పాముల్ని చంపడం మానుకో ! శమదమాడి శాంతగుణాలని అలవరుచుకో . హింస తపోసిద్ధికి మొదటి శత్రువని గుర్తుంచుకో ‘ అని రురునికి బోధించి సహస్రపాదుడు తన ఆశ్రమానికి వెళ్లిపోయారు . 

అప్పటినుండీ శాంతచిత్తుడై , రురుడు సర్పహింసని మానుకున్నారు . ఈ విధంగా మరో పాత్ర భారతంలో సర్పాల పట్ల ప్రతీకారేచ్చతో రగిలిపోతూ కనిపిస్తుంది .  

ఓం శాంతి . 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha