Online Puja Services

నేనే రాజు ఎందుకయ్యాను?

3.144.77.71

నేనే రాజు ఎందుకయ్యాను?
సేకరణ: లక్ష్మి రమణ 

విక్రమాదిత్య మహారాజు ఒక రాత్రి తన జాతకం వ్రాయబడిన కాగితాన్ని చదువుతుంటే ఆయనకు ఒక అనుమానం వచ్చింది. నేను పుట్టిన రోజే ప్రపంచం లో అనేకమంది పుట్టి వుంటారు. కానీ వాళ్ళంతా రాజులు కాలేదు. నేనే ఎందుకయ్యాను ?ఈ గొప్ప స్థానం నాకే ఎందుకు దక్కింది ? అని 

మరుసటి రోజు సభ లో పండితుల ముందు ఇదే ప్రశ్న పెడితే వాళ్ళు చెప్పిన జవాబు రాజుకు తృప్తి ఇవ్వలేదు. అపుడు ఒక వృద్ధ పండితుడు '' రాజా! ఈ నగరానికి తూర్పున  బయట వున్న అడవిలో ఒక సన్యాసి వున్నాడు. ఆయనను కలవండి. జవాబు దొరుకుతుంది'' అన్నాడు. 

రాజు వెళ్ళాడు. అపుడు ఆ సన్యాసి బొగ్గు తింటున్నాడు. 

అది చూసి రాజు ఆశ్చర్యపోయి తన ప్రశ్న ఆయన ముందు పెడితే, ఆయన ''ఇక్కడికి నాలుగు మైళ్ళ దూరం లో ఇలాంటిదే మరొక గుడిశె వుంది. అందులో ఒక సన్యాసి వున్నాడు , ఆయన్ను కలవండి.''అని , 

రాజు కొంత నిరాశపడినా, మళ్ళి తన సమాధానం వెతుక్కుంటూ , రెండవ సన్యాసి కోసం వెళ్ళాడు. 

రాజు ఆయన్ని చూసినపుడు , ఆ సన్యాసి మట్టి తింటున్నాడు. 

ఆ పరిస్థితిలో ఉన్న ఆయన్ని చూసి , రాజు కాస్త ఇబ్బందిపడ్డాడు. కానీ తన ప్రశ్ననైతే అడిగాడు. అప్పుడా ఆ సన్యాసి రాజు మీద కోపంతో గట్టిగా అరచి, అక్కడినుండి వెళ్ళిపో అని కసురుకున్నాడు

 రాజుకూ కోపం వచ్చినా, సన్యాసి ని గౌరవించాలిగానీ, ఆయన మీద కోపగించుకోకూడదు ,  కాబట్టి ఆయన్ని ఏమీ అనలేదు. 

మౌనంగా తిరిగి వెళ్ళి పోతుంటే, సన్యాసి రాజుతో ఇలా చెప్పాడు . ''ఇదే దారిలో వెళితే ఒక గ్రామం వస్తుంది. అక్కడ ఒక బాలుడు చనిపోవడానికి సిద్ధంగా వుంటాడు. వెంటనే అతన్ని కలవండి. మీకు సమాధానం దొరుకుతుంది '

రాజుకంతా గందరగోళంగా వుంది. అయినా అక్కడికెళతాడు. చనిపోవడానికి సిద్ధంగా వున్న ఆ అబ్బాయిని కలిసి తన ప్రశ్న అడిగాడు. 

అపుడు ఆ అబ్బాయి అన్నాడు, 

''గత జన్మ లో నలుగురు వ్యక్తులు ఒక రాత్రి అడవిలో ప్రయాణిస్తూ, దారి తప్పిపోయారు . 
ఆకలేస్తే వాళ్ళ దగ్గరున్న రొట్టెలు తిందామని చెట్టు క్రింద ఆగారు . సరిగా వారు తినబోతుంటే అక్కడికి బాగా ఆకలేసి, నీరసంగా వున్న ఒక ముసలి వ్యక్తి వచ్చి, తనకూ కొంచెం ఆహారం ఇవ్వమని అడిగితే ఆ నలుగురిలో మొదటివాడు కోపంతో కసురుకుంటూ ,

''నీకు ఇస్తే నేను బొగ్గు తినాలా?'' అన్నాడు . 

రెండవ వ్యక్తిని అడిగితే..
''నీకు ఈ రొట్టె ఇస్తే,నేను మట్టి తినాల్సిందే'' అని వెటకారం చేశాడు .

మూడవ వాడు 
''రొట్టె తినకపోతే ఈ రాత్రికే చస్తావా ?'' అని నీచంగా మాట్లాడాడు. 

కానీ నాల్గవ వ్యక్తి మాత్రం ''తాతా! నీవు చాలా నీరసంగా వున్నావు. ఈ రొట్టె తిను.'' అని తాను తినబోతున్న రొట్టెను ప్రేమగా ఆ ముదుసలి వ్యక్తికి ఇచ్చేసాడు.

ఆ నాల్గవ వ్యక్తివి నువ్వే రాజా'' అని చెప్పాడు . 

రాజు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఇంకా ఆ వ్యక్తి , ‘రాజా అప్పుడు నీవు చేసుకున్న నీ పుణ్యం వల్ల, ఇప్పుడు నీవు  రాజుగా జన్మించావు. అనవసరమయిన మీమాంసలతో కాలం వృథా చేయక ప్రజలను కన్న తండ్రి వలె పాలించు అని చెప్పి , దేహాన్ని విడిచిపెడతాడు . 

కాబట్టి మనం చేసుకున్న పుణ్యమే మనవెంట కడదాకా వచ్చేది . ఈరోజు దానం చేశామంటే, దానికి వేయింతల ఫ్లాన్ని పొందేందుకు ఈ రోజు ఇంట పుణ్యాన్ని బ్యాంకులో వేసుకుంటున్నామన్నమాటే, అలాగని ఫలితాన్ని ఆశించే ఉద్దేశ్యంతో కాక, నలుగురికీ మంచి చేయాలని , జరగాలనే ఉద్దేశ్యంతో , దాన్నొక పూజగా భావించి చేయండి . ప్రతిఫలంగా అది అనంత పుణ్యాన్ని తప్పకుండా  అందిస్తుంది. మానవ సేవే మాధవ సేవ కూడా ! 

ఓ చెడ్డ మాట అప్పులాంటిది. ప్రతిగా వడ్డీ కలిపి చెల్లించాల్సి వస్తుంది.

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi