ధర్మరాజుకి బొంది తో స్వర్గం

18.207.132.226

బొందితో స్వర్గానికి వెళ్లిన ధర్మరాజుకి నరకద్వార దర్శనం అయ్యింది ?
కూర్పు: లక్ష్మీరమణ  

ఉత్తరాఖండ్ రాష్టం లోని ఉత్తరకాశి జిల్లాలోని  ఘర్వాల్ హిమాలయ ప్రాంతంలో స్వర్గారోహిణి అనే ఆరు పర్వతాల సముదాయం ఉంటుంది . ఈ దారిలో ప్రయాణించే పాండవులు తమ అంతిమదశలో స్వర్గారోహణ చేశారని ప్రతీతి . ఈ దారిలో ప్రయాణిస్తూ చివరికి  ధర్మరాజు మాత్రం బొందితో (ప్రాణంతో) స్వర్గాన్ని చేరుకున్నారని ఇతిహాసాలు చెబుతున్నాయి . అయితే, స్వర్గానికి చేరిన ధర్మరాజు ఏంచేశారు . ఏమయ్యారు ? అక్కడ తనవాళ్ళని చూశారా ? అంటే, దానికి సమాధానము మహాభారతంలోని స్వర్గావరోహణా పర్వం చెబుతుంది . 

బొందితో స్వర్గానికి వెళ్లినా ఈ ప్రాణానికి ఉండే బంధాలు , బాంధవ్యాలూ  ఇంకా వెంటాడతాయని ఈ కథ చెబుతోంది . వ్యక్తి తనలోని వైరము, మాత్సర్యము, స్నేహము, చంచల స్వభావము, గర్వము, దుఃఖము మొదలైన అరిషడ్వార్గాలని జయించడం అంత సామాన్యమైన విషయంకాదుకదా ! కురుక్షేత్రంలో విజయం సాధించినా , మనోక్షేత్రంలో ఈ వర్గాలతో జరిపినపోరులో పూర్తి విజయం దక్కలేదనే చెప్పాలి . ఈ విశేషాలని జనమేజయ , వైశంపాయనుల సంభాషణ మనకి తెలియజేస్తుంది . సర్పయాగం చేసిన జనమేజయుడికి తమ తాతలైన పాండవులు స్వర్గావరోహణం చేశాక ఎటువంటి పరిస్థితులని ఎదుర్కొన్నారో తెలుసుకోవాలనే కుతూహలం కలిగింది .  స్వయంగా వైశంపాయనుడు ఆ కథని వివరిస్తారు .
 
స్వర్గానికి చేరిన ధర్మరాజు ఇంకా బాంధవ్యాలని మరిచిపోలేదు . తన బంధువులను చూడవలెనని పట్టుపట్టారు .  ధర్మరాజు కోరికను ఇంద్రుడు మన్నించాడు. వెంటనే ఒక దూతను పిలిచి " ఈయన ధర్మరాజు. ఈయనకు తన వారిని చూడాలని కోరికగా ఉంది. నీవు ఈయనను తీసుకు వెళ్ళి ఆయన బంధువులను అందరినీ చూపించు” అని ఆదేశించారు . ఆ దేవదూత ధర్మరాజును తన వెంట తీసుకువెళ్ళాడు. ధర్మరాజు వెంట నారదుడు, దేవఋషులు కూడా వెళ్ళారు.

సుయోధనుడు :
 ముందుగా వారు పెద్ద సింహాసనము మీద కూర్చున్న సుయోధనుడు కనిపించాడు. ఆయన చుట్టూ దేవకాంతలు సేవలు చేస్తున్నారు. సుయోధనుడు అంతులేని సుఖాలు అనుభవిస్తున్నాడు. అది చూసి ఆశ్చర్యపోయిన ధర్మరాజు దేవమునులతో " దేవమునులారా ! ఈ సుయోధనుడు పరమ లోభి. ఇతడికి ముందు చూపు లేదు. అనేక దేశములు ఏలే రాజులను యుద్ధముకు పిలిపించి వారి రధ, గజ, తురంగ, కాల్బలములతో సహా మరణించేలా చేసాడు. రాజసూయ యాగము చేసి పవిత్రురాలైన ద్రౌపదిని నిండు కొలువుకు ఈడ్చుకు వచ్చి ఘోరముగా అవమానించాడు. అలాంటి వాడు స్వర్గసుఖాలు అనుభవిస్తునాడు. వీడితో చేరి నేను స్వర్గసుఖాలు అనుభవించాలా ! వీలులేదు నన్ను నా తమ్ములు భీమార్జున నకుల సహదేవులు ఉన్నచోటికి తీసుకు వెళ్ళండి " అని వెనకకు తిరిగాడు.

నారదుడు సమాధానపరచడం :
గురువు తోడున్నప్పుడు అజ్ఞానంలోనూ జ్ఞానజ్యోతి ప్రకాశాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలం . అలాగే, ఇంకా బంధాల వ్యామోహం వీడని ధర్మరాజుని నారదుడు ఇలా సమాధానపరిచారు . " ధర్మరాజా ! సుయోధనుడు లోపభూయిష్టమైన తన శరీరమును వదిలి పెట్టాడు. ఇప్పుడు దివ్యదేహముతో ప్రకాశిస్తునాడు. అందు వలన దేవతల చేత గౌరవించబడుతున్నాడు. ఇతడు యుద్ధములో మరణించి వీరమరణం పొందాడు .

ఇది పుణ్యలోకము. ఇక్కడ ఏ పాపము అంటదు. ధర్మరాజా ! నీవు స్వర్గలోకానికి వచ్చి కూడ మానవ సహజమైన ఈర్ష్యా ద్వేషాలను వదలక ఉన్నావు. ఇక్కడ వాటికి తావు లేదు. కనుక నీలోని కోపతాపములను, ఈర్ష్యా ద్వేషములను వదిలి సమత్వమును పొందుము. 

నీవు ఆడిన జూదము దాని వలన కలిగిన దుఃఖమును మరచి ప్రశాంత చిత్తుడవై ఉండు " అన్నాడు. ధర్మరాజు " మహర్షీ ! ఈ సుయోధనుడు పాపి. ఇతడు ఇతరులకు అపకారము తప్ప ఉపకారము ఎన్నడూ చేయ లేదు. ఇతడు కురువంశ వినాశకుడు. రాజులందరిలో అధముడు. పుణ్యము చెసిన వారికి స్వర్గము పాపులకు నరకము ప్రాప్తిస్తుంది అని అంటారు కదా ! ఇతనికి స్వర్గసుఖాలు ఎలా కలిగాయి ?  సరే,  నన్ను నా తమ్ములు, నా భార్య, నా కుమారుల వద్దకు తీసుకు వెళ్ళండి. నేను వారిని చూడాలి.అన్నారు . 

ధర్మరాజు నరక ప్రవేశము . 
పరమాత్ముని పరీక్షకి ఎంతటివారైనా అతీతులు కారుకదా ! అనుకున్న  దేవదూత " మహాత్మా ! నీ మనసులో ఏ కోరిక పుడుతుందో దానిని నెరవేర్చమని దేవేంద్రుడు నాకు ఆనతి ఇచ్చాడు. నేను అలాగే చేస్తాను. మీరు నాతో రండి " అన్నాడు. ధర్మరాజును, దేవదూత తీసుకువెడుతున్న దారి అంతా దుర్గంధభూయిష్టముగా ఉంది. దారిలో వెండ్రుకలు, ఎముకలు కుప్పలుగా పడి ఉన్నాయి. దోమలు, ఈగలు ముసురుతూ ఉన్నాయి. శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. ఆ శవాల కొరకు కాకులు తిరుగుతున్నాయి. శవాల మీది నుండి వచ్చే దుర్గంధము ముక్కులను బద్దలు కొడుతుంది. వారు వైతరణీ నదిని సమీపించారు. నదిలోని నీరు సలసలా కాగుతున్నది. నది ఒడ్డున సూదులవలె, కత్తుల వలె ఉన్న ఆకులు ఉన్న మొక్కలు ఉన్నాయి. అక్కడ నానావిధములైన పాపములకు శిక్షను అనుభవిస్తున్న పాపులను చూసి ధర్మరాజు " ఇంకా ఎంతదూరము వెళ్ళలి " అని అడిగాడు. దేవదూత " ఇదంతా దేవతల ఆధీనములో ఉంది. మనము రావలసిన ప్రదేశముకు వచ్చాము " అన్నాడు. 

కాని ధర్మరాజుకు పాపులు అక్కడ పడుతున్న అవస్థ చూస్తూ ఉండడానికి మనస్కరించ లేదు. అందుకని అక్కడ నుండి వెళ్ళి పోవాలని అనుకున్నాడు. అప్పుడు ధర్మరాజుకు కొన్ని గొంతులు ఇలా వినిపించాయి. " ఓ పుణ్యచరితా ! నీ రాకవలన మా పాపములు అన్నీ పోయాయి. నీ శరీరము నుండి వచ్చే పరిమళము వలన మా బాధలు ఉపశమించాయి. మాకు ఇక్కడ హాయిగా సుఖముగా ఉంది. నిన్ను చూడడము వలన మా బాధలు దూరము అయ్యాయి. నీవు కాసేపు ఇక్కడే ఉండి మాకు సంతోషము కలిగించు " అన్న మాటలు వినిపించాయి. అప్పుడు ధర్మరాజు " ఆహా ! వీరు ఇక్కడ ఎన్ని బాధలు అనుభవిస్తున్నారో కదా ! " అనుకుని అక్కడే నిలబడ్డాడు. ధర్మరాజు పెద్దగా " మీరు ఎవరు ఎందుకు ఈ బాధలు అనుభవిస్తున్నారు? " అని అడిగాడు. వారు " మేము ఎవరమో కాదు. నీ అన్నదమ్ములము కర్ణుడు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవులము. మేమంతా ఇక్కడ నరకబాధలు అనుభవిస్తున్నాము " అని వినిపించింది. మరొకపక్క నుండి " మహారాజా ! నేను ద్రౌపదిని, నేను ధృష్టద్యుమ్నుడిని, మేము ద్రౌపది పుత్రులము " అన్న మాటలు వినిపించాయి.

తనవారిని నరకములో చూసిన ధర్మారాజు :
ఆ మాటలు విన్న ధర్మరాజు ఒక్కసారిగా నిశ్చేష్టుడై " అయ్యో భగవంతుడా ! మా తమ్ములకు, ద్రౌపదికి ఈ దుర్గతి పట్టడము ఏమిటి ? వారు ఏపాపము చేసారని ఇటువంటి నరకయాతనలు అనుభవిస్తున్నారు. ఇంద్రుడు దేవతలు పరమనీచులు కాకపోతే నా తమ్ములకు, ద్రౌపదికి ఇలాంటి నరకబాధలు అనుభవించ వలసిన అగత్యము ఏమిటి. ఇక్కడ ధర్మము లేదు, న్యాయము లేదు. లేకున్న నా తమ్ములు, ద్రౌపది సామాన్యమైన వారా ! వారు పరమ నిష్ఠాగరిష్ఠులు, సత్యము, దయ కలిగిన వారు, దానశీలురు, యజ్ఞయాగములు చేసిన వారు. అటువంటి వారికి ఈ దుర్గతి పట్టడము ఏమిటి ? 

కనీసము జీవితములో ఒక్కరికి కూడా మేలు చేయని సుయోధనుడికి స్వర్గసుఖాలా ! అతడి చుట్టూ అంతమంది దేవకాంతలా ! అంతులేని భోగాలా ! కనిసము వీసమెత్తైనా పాపము చెయ్యని నా వారికి నరకయాతనలా ! దైవము న్యాయము, ధర్మము మరచినట్లు ఉంది " అని చింతించసాగాడు. తిరిగి " ఇదంతా నిజమా ! లేక దేవతల మాయా ! నా భ్రాంతియా ! లేక నేను కలగంటున్నానా ! " అని పరిపరి విధముల చింతించసాగాడు. ధర్మరాజుకు ఇంద్రుడి మీద చాలా కోపము వచ్చింది. పక్కనే ఉన్న దేవదూతను చూసి " ఓ దేవదూతా ! ఇక నాకు నీ సాయము అవసరము లేదు. నిన్ను ఎవరు పంపారో వారి వద్దకు తిరిగి వెళ్ళు. నా తమ్ములు, నా భార్య నరక బాధలు అనుభవిస్తున్నప్పుడు నాకు స్వర్గసుఖాలతో పని లేదు. వారు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నా మాటలు యధాతధంగా ఇంద్రుడికి చెప్పు " అని అన్నాడు.

దేవతలే ధర్మరాజు దగ్గరికి వచ్చారు :
దేవదూత ఇంద్రుడి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. వెంటనే దేవేంద్రుడు దిక్పాలకులను, దేవఋషులను తీసుకుని ధర్మరాజు వద్దకు వచ్చాడు. యమధర్మరాజు కూడా తన కుమారుడిని అనునయించడానికి వారితో వచ్చాడు. వారి రాకతో అక్కడ ఉన్న వాతావరణము అంతా మారి పోయింది. నరకయాతనలు లేవు, దుర్గంధము లేదు. శవాలగుట్టలు మాయమయ్యాయి. ఎముకల పోగులు లేవు. పాపుల ఆక్రందనలు ఆగిపోయాయి. పైన తిరుగుతున్న కాకులు గద్దలు లేవు. వైతరుణీనది జాడలులేవు. పిల్లతెమ్మెరలు వీచసాగాయి. అహ్లాదకరమైన చల్లని వాతావరణముతో అంతటా మనోహరమైన పరిస్థితి నెలకొన్నది. 

ఆ సమయములో ధర్మరాజు వద్దకు రుద్రులు, గంధర్వులు, వసువులు, ఆదిత్యులు, నాగులు, సిద్ధులు ఆనందముగా వచ్చారు. అప్పుడు ఇంద్రుడు ధర్మరాజుతో " నీవు నరకములో ఉండడము ఏమిటి ? నిన్ను తీసుకు పోవడానికి దేవతలు అందరూ ఇక్కడకు వచ్చారు. నీకు శాశ్వతబ్రహ్మలోక పదవి లభించింది. నీలోని వికారములు అన్నీ నశించాయి. నీకు సద్భుద్ది కలిగింది. ధర్మనందనా ! ఒక్కమాట. రాజ్యంతే నరకం ధ్రువం అని వేదములు చెప్తున్నాయి. అంటే రాజ్యము చేసిన వాడికి నరకము తప్పదు. అందుకే నీకు నరకద్వార దర్శనము అయ్యింది. 

ధర్మనందనా ! పుణ్యము, పాపము ఒక దానిని వెన్నంటి ఒకటి ఉంటాయి. పుణ్యము చేసుకున్న వారికి స్వర్గము, పాపము చేసుకున్న వారికి నరకము ప్రాప్తిస్తుంది. కొద్దిగా పుణ్యము చేసుకున్న వాడు తాను చేసుకున్న పుణ్యముకు సరిపడా స్వర్గసుఖములను ముందుగా అనుభవించి తరువాత దీర్ఘకాలము నరకవాసము చెయ్యాలి. కొద్దిగా పాపము చేసిన వారు ముందుగా నరకయాతన అనుభవించి తరువాత స్వర్గసుఖాలను దీర్ఘకాలము అనుభవించాలి. ఇది ఇక్కడి నియమము. నీవు చెసిన కొద్ది పాపముకు నీకు నరకద్వార దర్శనము అయింది. ఇక నీవు దీర్ఘకాల స్వర్గమును అనుభవిస్తావు. నీకు కలిగిన మనస్థాపము వలన నీకు ఇది చెప్పవలసి వచ్చింది. నీ అన్న కర్ణుడికి ఉత్తమ లోక ప్రాప్తి కలిగింది. నీ తమ్ములు భీమార్జున నకులసహదేవులకు ఉత్తమ లోకప్రాప్తి కలిగింది. వారందరూ తమతమ ఉత్తమ స్థానాలలో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు. నీవు వారిని అందరిని చూసి సంతోషించు. నీవు చేసిన స్వల్ప పాపముకు నీకు నరకద్వార దర్శనము నీవు చేసిన రాజసూయయాగము, అశ్వమేధయాగము, యజ్ఞములు, దానములు, ధర్మములు, వ్రతములకు నీకు ఉత్తమలోకప్రాప్తి కలిగింది. 

నీ పూర్వీకులు అయిన మాంధాత, నలుడు, హరిశ్చంద్రుడు, దుష్యంతుడు, భరతుడు ఎటువంటి ఉత్తమలోకాలు పొందారో అటువంటి ఉత్తమలోకాలు నీకు ప్రాప్తించాయి. నిన్ను అభినందించడానికి సిద్ధులు, సాధ్యులు, గరుదులు, గంధర్వులు, నాగులు వచ్చారు అని వారిని అందరిని చూపాడు. ధర్మరాజు వారందరికి వినయముగా నమస్కరించాడు. ఇంద్రుడు తిరిగి " ధర్మరాజా ! ఇది ఆకాశగంగ. పుణ్యమే ఇలా ఆకృతి దాల్చింది. నీవు ఇందులో స్నానము చేసి దివ్యదేహముతో ప్రకాశించు " అన్నాడు.

యమధర్మరాజు చేసిన ధర్మోపదేశం :
తరువాత యమధర్మరాజు ధర్మరాజు వద్దకు వచ్చి " కుమారా ! నేను నిన్ను మొదటిసారిగా ద్వైతవనంలో, రెండవసారి మేరుపర్వతములో కుక్క రూపములోమూడోసారి ఇక్కడా నిన్ను పరీక్షించాను. నీ మనసుచలించ లేదు. నీ మనసులో శమము, దమము మొదలగు గుణములు పుష్కలముగా ఉన్నాయి. నీవు జితేంద్రియుడవు. నీకు పెట్టబడిన పరీక్షలు పూర్తి అయ్యాయి. నీవు గెలిచావు. ఇక నీవు స్వర్గసుఖములు అనుభవించ వచ్చు. రాజులకు నరకము తప్పదు అని వేదోక్తి కనుక నేను ఇంద్రుడు కలసి నీకు నరకద్వార దర్శనము కలిగించాము. నీవు విన్న కర్ణ, భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది ఆక్రందనలు అన్నీ మేము కల్పించినవి. నీ తమ్ములు, కర్ణుడు, ద్రౌపది పుణ్యలోకాలు చేరుకున్నారు. ఇంద్రుడు చెప్పినట్లు నీవు ఆకాశగంగలో మునుగు. నీకు ఈ సంసారభావము నేను, నీవు అన్న భేదభావము నశిస్తాయి. మానవసహజమైన రాగముద్వేషము, సుఖముదుఃఖము నశిస్తాయి. దైవత్వము సిద్ధిస్తుంది. తరువాత స్వర్గసుఖములు అనుభవిస్తున్న నీ సోదరులను, నీ భార్యను ఆనందంగా చూడు. ఆలస్యము ఎందుకు ఆకాశగంగలో స్నానము చెయ్యి " అని చెప్పాడు. తరువాత యమధర్మరాజు ధర్మరాజును ఆకాశగంగ వద్దకు తీసుకుని వెళ్ళాడు. 

ధర్మరాజు ఆకాశగంగలో పుణ్యస్నానము చేసాడు. వెంటనే తన మానుష శరీరమును వదిలి దివ్యశరీరము ధరించాడు. ఎప్పుడైతే ధర్మరాజు దివ్యకాంతితో కూడిన శరీరము ధరించాడో అతడిలోని వైరము, మాత్సర్యము, స్నేహము, చంచల స్వభావము, గర్వము, దుఃఖము అన్నీ సమసి పోయాయి. ధర్మరాజు సాక్షాత్తు అగ్ని వలె ప్రకాశించ సాగాడు. ఎదురుగా ఉన్న ఇంద్రుడిని, యమధర్మరాజును స్తుతించి వారితో కలసి ముందుకు సాగాడు.

అందుకే మనసు కురుక్షేత్రంకన్నా భయంకరమైనది. ఇక్కడ రక్తపుటేరులు పొంగవు . అంతకన్నా మించిన ఇంద్రియాల కత్తులు స్వైరవిహారం చేస్తాయి. ఇక్కడ విచక్షణా జ్ఞానం , గురువు యొక్క మార్గనిర్దేశనమే అనుసరణీయం .

శుభం .

Quote of the day

Purity of speech, of the mind, of the senses, and of a compassionate heart are needed by one who desires to rise to the divine platform.…

__________Chanakya