విధిని ఎవ్వరూ మార్చలేరు

35.172.223.30
విధి
ఇంద్రుడి భార్య ఇంద్రాణి ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది. ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది. దిగులుపడి చిలుకను వైద్యునికి చూపించింది.
ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టమని చెప్పాడు.
ఆ మాట విన్న ఇంద్రాణి పరుగు పరుగున ఇంద్రుని వద్దకు వెళ్లి..!
" మీరేంచేస్తారో నాకు తెలియదు నా చిలుకకు బ్రతికించండి. లేదంటే నేనూ చనిపోతాను" అని కన్నీరుపెట్టుకుంది..!
దానికి ఇంద్రుడు...
"దీనికే ఇంత ఏడవడం ఎందుకు.!? అందరి తలరాతలు వ్రాసేది బ్రహ్మ కదా..! నేను వెళ్ళి ప్రార్ధిస్తాను.నువ్వేం దిగులు పడకు..!" అని బ్రహ్మ దగ్గరికి ఇంద్రుడు వెళ్ళాడు.
ఇంద్రుని ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ..!
"నేను తలరాతలు మాత్రమే వ్రాస్తాను. దాన్ని అమలు పరిచేది మహావిష్ణువు..! కావున మనం విష్ణువు దగ్గరికి వెళదాం పద.!" అంటూ బయలుదేరారు.
వీరిరాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు.
"నిజమే ప్రాణాలు కాపాడేవాణ్ణి నేనే..! కానీ..! చిలుక ప్రాణం చివరి దశలో ఉంది..! మళ్ళీ ఊపిరి పోయాలంటే శివునికే సాధ్యం..! మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి..! " అన్నారు.
ముగ్గురూ శివుని దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. శివుడు ఇలా అన్నారు.
" ఆయుష్షు పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని యమధర్మరాజుకు అప్పచెప్పాను..! మనం వెళ్ళి యమధర్మరాజు ను అడుగుదాం పదండి..! " అంటూ అందరూ బయలుదేరారు.
ఇంద్ర,బ్రహ్మ,విష్ణువు,శివుడు అందరూ యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాదారంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు.
"అయ్యో..! అదేమి పెద్ద పనికాదు. మాములుగా చావుకు దగ్గరగా ఉన్న వారి పేర్లను,వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకుమీద వ్రాసి ఒక గదిలో వ్రేలాడ తీస్తాము. ఏ ఆకు రాలి క్రిందపడుతుందో వారు ఆయా సమయంలో చనిపోతారు. పదండి వెళ్లి ఆ ఆకుని తొలగించి చిలుకకు కాపాడుదాం..! " అని అన్నాడు .
యముడు , అందరూ ఆ గదిలోకి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది.ఆ ఆకు ఎవరిదో అని అందులో ఏమి రాసిందో చూద్దామని ఆ ఆకును తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం వ్రాసి ఉంది ఇలా..!
"ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు, బ్రహ్మ, శివుడు, విష్ణువు, యమధర్మరాజు ఒకేసారి వస్తారో అప్పుడు చిలుక మరణిస్తుంది..! "అని వ్రాసి ఉంది.
ఇదే విధి..! విధిని ఎవ్వరూ మార్చలేరు. జీవించి ఉన్నప్పుడే ఇతరులమీద ప్రేమను చూపండి. ద్వేషించకండి. మన సహాయాన్ని ఇతరులకు అందివ్వడం నేర్చుకుందాం..!
 
ఆధ్యాత్మికం (ఆనంద సోపానం )
 

Quote of the day

The highest education is that which does not merely give us information but makes our life in harmony with all existence.…

__________Rabindranath Tagore