Online Puja Services

ఖాళీ తత్త్వ రహస్యం

3.144.187.103

దైవీ శక్తి

 వివేకానందులు అమెరికా చేరిన మొదటి వారంలోనే అన్ని ఆధారాలూ పోగొట్టుకుని "ఖాళీ"గా నిలబడ్డారు.  అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.  అరవిందులు పాండిచ్చేరి సముద్రతీరంలో తన వద్ద మిగిలిన చివరి నాణేన్ని సముద్రంలోకి విసిరిపారేసి "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.  రమణులు ప్రయాణంలో మిగిలిన పైకాన్ని కోనేరులో విసిరివేసి, దుస్తులను సైతం వదిలి కేవలం ఓ గోచీతో "ఖాళీ"గా నిలబడ్డారు. అక్కణ్ణుండి దైవీశక్తి అతడ్ని నడిపింది.  ఒకరు గురువుగారిని అడిగారు దైవీశక్తిని నేను చవిచూడాలంటే ఏంచేయాలి? అని..అతనికి గురువుగారు ఇలా చెప్పారు-

500 రూపాయిలు జేబులో ఉంచుకుని, ఆ పైకంతో బస్సులోగానీ, రైలులోగానీ ఎంతదూరం ప్రయాణం చేయగలవో అంతదూరం ప్రయాణం చేసి అక్కడ దిగేయ్.నీ జేబులో ఒక్కరూపాయి కూడా ఉండకూడదు....అక్కడ ఓ నెలరోజులు గడిపి, తిరిగి నీ స్వస్థలానికి చేరుకోగలిగితే తెలుస్తుంది..ఆ దైవీశక్తి నిన్ను ఎలా నడిపించిందో అనేది. ప్రత్యక్షానుభవం కలుగుతుంది. కోటి ఆధ్యాత్మికగ్రంథాలు చదివినా కలగని అనుభవం, ఈ ఒక్క పని *చేయడం వలన కలుగుతుంది...అన్నారు. 

 అతడు నవ్వుతూ ఓ హాస్యకథలాగా విన్నాడేగానీ, ప్రయత్నం చేయలేకపోయాడు. ఈ ఘట్టం విని అతని స్నేహితుడు, గురుభక్తుడు అయిన సుధాకర్ అనేవాడు అలా రైలులో బయలుదేరి దత్తక్షేత్రమైన గాణ్గాపురం చేరాడు..అక్కడ దిగి మిగిలిన చిల్లరపైకాన్ని పారవేసి, ఊళ్లోకి ప్రవేశించాడు. 

 అక్కడే ఓ కాషాంబరధారి వద్ద శిష్యుడిగా చేరి, ఊళ్లో భిక్షం చేసుకుంటూ ఓ నెలరోజులు గడిపి, తిరిగి స్వస్థలమైన శ్రీకాళహస్తి చేరాడు. గురు బోధను అతనొక్కడే అలా  ప్రయత్నం చేసి దైవీశక్తిని అనుభవించాడు. 

 తిరిగొచ్చాక అతడు ఓ అవధూతలా మారిపోయాడు..  కొందరు "అతడు పిచ్చివాడైపోయాడు" అని దూరమైపోయారు...  కొందరు అతన్ని ఓ గురువుగా ఆరాధించడం మొదలుపెట్టారు. 
 అతడు పిచ్చివాడో, అవధూతో దైవానికెరుక. 
 వాస్తవానికి ప్రతి ఒక్కరు ఈ భూమ్మీదకు దిగంబరంగానే  వస్తారు."ఖాళీ"గానే ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తారు.. 

 తనువును, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను, భార్యాబిడ్డలను, సంపదలను, అనుభవాలను ఉచితంగానే పొందుతారు...తిరిగి అందరినీ, అన్నింటినీ, చివరకు తనువును కూడా "ఖాళీ" చేసి వెళ్లిపోతారు.  " ఖాళీ" అవడం తథ్యం....  కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా "ఖాళీ"గా ఉండడమే  గురువుగారు చెప్పిన "మెలకువలో నిద్ర".

 భగవద్గీతలో చెప్పినట్టు- "అందరూ మేలుకుని ఉంటే, యోగి నిద్రిస్తుంటాడు."  నిద్ర అంటే పడుకుని నిద్రపోవడం కాదు.  "ఖాళీ"గా ఉండడం. అదే యోగనిద్ర.  భగవద్గీత చరమశ్లోకంలో-సర్వధర్మాన్ పరిత్యజ్య....అన్నాడు కృష్ణభగవానుడు. సర్వధర్మాలను వదిలేసి "ఖాళీ" అయిపొమ్మన్నారు. 

 ధర్మములన్నీ ఇహానికి సంబంధించినవి.  "ఖాళీ" అనేది పరానికి సంబంధించినది.  శ్రీరామకృష్ణులు ఆరాధించిన "ఖాళీ"యే కాళీమాత.  కాళీమాత అనేది ఓ విగ్రహం కాదు, 

 అర్థరాత్రి... ప్రపంచంలో ఉండే నిశ్శబ్ధాన్ని(మౌనాన్ని) అంధకారాన్ని(అభేదాన్ని) 
 ఆస్వాదించడమే కాళీమాత దర్శనం. 
 పట్టపగలు కూడా ఆ నిశ్శబ్ధాన్ని, ఆ "ఖాళీ"ని అనుభవించగలగడమే సహజ సమాధి.  కర్తృత్వభావన "ఖాళీ" అయిపోవడమే కర్మయోగం.  వ్యక్తిత్వభావన "ఖాళీ" అయిపోవడమే భక్తియోగం.  అహమిక "ఖాళీ" అయిపోవడమే జ్ఞానయోగం. 

 నిజానికి తాను "ఖాళీ" అయిపోతే.... ఆ ఖాళీ ఖాళీగా ఉండదు... ఆ ఖాళీ దైవంతో నిండిపోయి ఉంటుంది. ఇదే "ఖాళీ తత్త్వ రహస్యం".

 అదే ఇది.... ఎవరూ లేకపోవడమే దేవుడు ఉండడం. ఏమీ తెలియకపోవడమే దేవుణ్ణి తెలియడం. ఏ అనుభవమూ లేకపోవడమే దైవానుభవం.  నేను చేస్తున్నాను అనేది మన బ్రమ అదే మన కర్మ కు మూలం. అలా కాకుండా ఈ జగత్తు మొత్తం  జగన్మాత(ఖాళీ)  నడుపుతోంది. అని అనుకుంటే  అది దైవ దర్శనం మార్గం అవుతుంది మన ప్రయాణం శక్తి (ఖాళీ) తో కూడి చక్కగా సాగిపోతుంది అదే ఖాళీ తత్వ మార్గం. ఈ మార్గం కర్మలకు దూరంగా వున్న సర్వ సంతోషాల నిలయానికి  చేరుకోవడానికి సహాయపడుతుంది. ఆ సంతోషి మాత దర్శనం మనకు లభిస్తుంది.  తింటేనే రుచి తెలుస్తుంది,అనుభవంతోనే అమ్మ (ఖాళీ) గొప్పతనం తెలుస్తుంది...

 

విమర్శలన్నింటిలోనికి ఉత్తమమైనది........      
        "ఆత్మవిమర్శ"...

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gautama Buddha