గోత్రము - సూత్రము

3.235.101.141
తిరుచ్చి రైల్వేస్టేషన్ లో పనిచేసే ఆ వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె. అతను పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు. మహాస్వామి వారు ఎక్కడ మకాం చేసినా, సంవత్సరానికి కనీసం నాలుగైదు సార్లు కుటుంబంతో సహా దర్శించుకునేవాడు. కేవలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోకుండా కనీసం రెండు రోజులు స్వామివారితో ఉండి వారి కరుణా సముద్రంలో మునుగిపోయేవాడు.
ఒకసారి స్వామివారితో, “ఈ అబ్బాయికి తొమ్మిది సంవత్సరములు. ఉపనయనం చెయ్యాలి” అన్నాడు.
“తప్పకుండా చెయ్యి” అన్నారు స్వామివారు.
“ఇతని గోత్రము సూత్రము నాకు తెలియవు” అని బదులిచ్చాడు అబ్బాయి తండ్రి.
“అతను మీ అబ్బాయే కదా?”
”కాదు. ఇతను తన తల్లి కడుపులో ఉండగా తండ్రి మరణించాడు. పుట్టిన రెండు నెలల తరువాత తల్లి కూడా కాలం చేసింది. ఈ పసివాని బాగోగులు చూడడానికి ఆ పల్లెటూరిలో ఎవరూ లేకపోవడంతో, మేము తీసుకుని వచ్చాము. యాతని గురించి కాని, యాతని బంధువుల గురించి గాని ఎటువంటి సమాచారము లేదు. తిరునల్వేలిలో ఒక ఆగ్రహారానికి సంబంధించిన వాడుగా తప్ప ఇతర వివరాలు ఏవి తెలియవు పెరియవ” అని మొత్తం చెప్పాడు.
మహాస్వామివారి మోహంలో అసాధారణమైన చిరునవ్వు కనిపించింది. అక్కడే ఉన్న కణ్ణన్ మామతో, “చూడు, ఇతను ఒక అనాథను పెంచుకుంటున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా పెంచడమే కాకుండా ఇప్పుడు ఉపనయనం చేయాలని కూడా యోచిస్తున్నాడు. ఎంతటి ఉన్నతుడు ఇతను” అన్నారు స్వామివారు.
“ఇప్పటి దాకా ఆ పిల్లవాడు అతని కుమారుడే అనుకున్నాము” అన్నాడు కణ్ణన్ మామ.
మహాస్వామివారు ఎంతో సంతోషంతో, “నేను విన్నట్టుగా గోత్రము తెలియని వారికి కాశ్యప గోత్రమని, సూత్రము తెలియక పొతే భోదాయన సూత్రమని ప్రమాణం. అలాగే సంకల్పించి ఈ బాలునికి ఉపనయన సంస్కారం జరిపించు. అతను అనాథ అని, పరాయివాడని ఎన్నటికి ఆలోచించకు. అతను నీవాడు; నీ కుమారుడు” అని ఆదేశించారు.
ఆ వ్యక్తీ స్వామికి నమస్కరించి ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాడు.
అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
 

Quote of the day

Without peace, all other dreams vanish and are reduced to ashes.…

__________Jawaharlal Nehru