Online Puja Services

స్నేహబంధం

3.133.144.217
సృష్టిలో బంధాలన్నింటికీ అర్థం ఉంటుంది. వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మనం ఎంతవరకు సామరస్యంతో, ప్రేమతో, బాధ్యతో వ్యవహరించగలమో అంతవరకూ అవి మనకు దూరం కావు. స్వార్థం కూడా బంధాల అమరికలో ముఖ్యపాత్ర పోషిస్తూ అమరికలకు ఆస్కారం ఇస్తూ ఉంటుంది. సంతోషం, ఇష్టం బంధాల రూపంలో దొరికినంత వరకూ మనలోని భావాలు పదిలంగా ఉంటాయి. కానీ కాస్త కష్టం కలిగిందో బంధాల మనోభావాలు తెబ్బతీస్తాయి. దూరంగా వెళ్లేందుకు సన్నద్ధం అవుతాయి. అయితే, అన్ని బంధాలు మన ప్రేమేయం లేకుండానే మన జీవితంలోకి వచ్చి చేరాయి. స్నేహబంధం మాత్రం మనం ఏరి,కోరి, నమ్మి, ఇష్టపడి చేరువయ్యే అద్భుతం, అదృష్టం. అది ఒక్కసారి బలపడిందో జీవితాంతం తోడుండేది.
 
 
 షరతులూ, హద్దులు లేనిది, స్వార్థం అంటని స్వచ్ఛమైనది స్నేహం. అటువంటి స్వచ్ఛమైన స్నేహం కుచేలుని రూపంలో ప్రపంచానికి పరిచయం అయింది. కృష్ణున్నే మైమరిపించింది. చిన్ననాటి స్నేహమే అయినా చిరకాలమై కుచేలునితత్వం కృష్ణుని మదిలో ఎదిగినదై స్థానం సంపాదించుకున్నది. కుచేలుని వ్యక్తివం విషయ విరక్తి అతన్ని నిశ్చయంగా ఉంచింది. కానీ బతుకు బాటలో ఆటుపోట్లు తప్పలేదు. చెదరని ఆత్మవిశ్వాసం, మేధస్సు, ప్రశాంత చిత్తం కుచేలుని బలాలు, బలహీనతలు.
 
 
-ప్రమద్వర
 
కుచేలుని అసలు పేరు సుదాముడు. ధర్మ మార్గాన్నే అనుసరించిన వాడై, శాంత స్వభావియై, నిష్కామయోగిలా బతికాడు కుచేలుడు. ఈతని భార్య వామాక్షి. వీరికి చాలామంది సంతానం. కటిక దారిద్య్రం అనుభవించే పేదవాడే అయినా, కుచేలుడు అభిమానాన్ని చంపుకొని ఏనాడూ బతుకలేదు. ఎంతటి కష్టమొచ్చినా అతనిలోని సంతోషం చెక్కుచెదురలేదు.
 
 
 కృష్ణునితో కుచేలుని స్నేహం సాంతీపుడనే గురువు దగ్గర విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో కుదిరింది. చదువు ముగియడంతో మనుషులు దూరమైనా వారి మనుసుల్లో స్నేహం పదిలంగా నిలిచిపోయింది. కృష్ణునికి కుచేలుడంటే ప్రత్యేకమైన అభిమానం, ఆదరణ. కుచేలునికీ కృష్ణుడంటే అవ్యాజమైన ప్రేమ. కృష్ణ లీలలు విన్నంతనే కుచేలుని మనసు ఉప్పొంగి పోయేది. ఎన్నడూ కృష్ణుడు తన స్నేహితుడనీ చెప్పుకొని గొప్పకు పోలేదు. ఎందుకంటే కుచేలునిది నిస్వార్థమైన స్నేహం. అతని ఉద్దేశం ప్రకారం కృష్ణుని స్నేహం వలన తనలో ఆనందమనే ప్రేమ జనించింది. అది కుచేలునిలో ప్రశాంతతను నెలకొల్పింది. శాంతం నిశ్శబ్ధ నిబద్ధతను కుచేలునికి అనుభవైకవేద్యంలా అందించింది. 
 
 
ఆ మౌనమే కుచేలునికి దైవత్వాన్ని ఆపాదించింది. అంటే బయట ప్రపంచం దృష్టిలో కృష్ణుడంటే రాజకుటుంబీకుడూ, దేవుడు. కుచేలుడంటే వేదవిదుడూ, పేదవాడు. కానీ కృష్ణునిలోని దైవత్వాన్ని తన వ్యక్తిత్వంలోనూ, కృష్ణునిపట్ల తనకున్న ప్రేమ, స్నేహంలోనూ పొందగలిగాడు కుచేలుడు. అందుకే ఇంతకన్నా గొప్ప సంపద స్నేహబంధంతో కాక మరెలా సాధ్యమని కుచేలుని సదాలోచన. 
కుచేలుడు ఒకనాడు తన కుటుంబ పరిస్థితిని గురించి ఆలోచిస్తుండగా అతని భార్య వామాక్షి, కృష్ణుడు మీ చిన్ననాటి మిత్రుడ కదా! ఒక్కసారి వెళ్లి ఆయన్ను కలిస్తే మన బాధలన్నీ తీరిపోతాయని అనిపిస్తుందని అంటుంది. పిల్లల దీనస్థితి, భార్య మాట కుచేలున్ని కృష్ణుని కలుసుకునేందుకు ప్రేరేపించాయనే కన్నా, తన మిత్రుని కలుస్తాననే ఆనందానికి తోవయ్యాయి. వట్టి చేతులతో వెళ్లడం సబబుకాదని ఇంట్లో మూలన దొరికిన కాసిన్ని అటుకులను తన ఉత్తరీయంలో మూటగట్టుకొని బయలుదేరుతాడు కుచేలుడు.కుచేలునికి తన కష్టాలకిక కాలం చెల్లిందనే సంతోషం ఏమాత్రం లేదు. ఎందుకంటే కృష్ణుని దర్శించడమే అతని మనసంతా నిండిన ముఖ్యోద్దేశం. దాని పొడుగునా అనేక సంశయాలు.
 
 
 ఎప్పటిదో చిన్ననాటి స్నేహం నాదీ, కృష్ణునిదీ. అనంతమైన ద్వారకలో ఉండే కృష్ణున్ని కలవడానికి, కనీసం చూడటానికి నాకు అనుమతి దొరుకుతుందో, ఈ పేదవాని రూపం అందుకు తగినదేనా ! అయినా సరే, నాలోని ప్రేమ, నాస్నేహం కృష్ణునిపట్ల నిశ్చయమైనవే అయితే, తప్పక కలుస్తానని సంకల్పించుకొని వెళతాడు కుచేలుడు.కృష్ణుని కోసం రాజద్వారం దగ్గర వాకబు చేస్తూ, నేను కృష్ణున్ని కలువడానికై వచ్చానని కుచేలుడు అలా చెప్పాడో లేదో, స్వయంగా తన మందిరం వదిలి కృష్ణుడు హుటాహుటిన వచ్చి చేయిపట్టుకొని తన మందిరానికి తీసుకెళుతాడు.
 
 
 బంగారు ఆసనంపై కూర్చోబెట్టి, బంగారు పళ్లెంలో కుచేలుని పాదాల నుంచి సేవ చేస్తాడు కృష్ణుడు. మంచి విందు భోజనాన్ని కొసరి, కొసరి వడ్డిస్తూ, విజామరతో విసురుతూ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కుచేలునికి గుర్తు చేస్తాడు. కుశలప్రశ్నలు ప్రేమగా అడుగుతాడు. తాను తెచ్చిన అటుకులు తనకెంతో ఇష్టమైనవని తృప్తిగా ఆరగిస్తాడు. ఇదంతా కుచేలునికి అంతుపట్టని విశేషం. నా స్నేహానికి ఇంతటి ఔదార్యమా! ఇంతటి ప్రేమాభిమానాలా! అని ఆశ్చర్యపోతాడు కుచేలుడు. మరునాడు కృష్ణుని దగ్గర తృప్తిగా సెలవు తీసుకొని ఇంటిదారిపట్టిన కుచేలుని మనసులో తన్మయత్వం తప్ప మరేమీ లేదు. కుచేలునికి తన కష్టాలేవి గుర్తులేవు. బాధల ఊసే లేదు. అలుపెరుగని ఆనందం తప్ప. 
 
 
ప్రపంచమంతా ఎవరిని సేవించాలనుకచుందో, అలాంటి కృష్ణుడు స్వయంగా నా కాళ్లు కడిగి శిరసున చల్లుకోవడమా! ఇంతకన్నా నాకు కావాల్సినదేంటని ఇంటికి చేరుకున్న కుచేలునికి తన పూరిగుడెసె స్థానంలో సకల సంపదలతో నిండిన అందమైన పాలరాతి మేడ కనిపించింది. కృష్ణుని వాత్సల్యానికి మనసారా నమస్కరించి కృతజ్ఞత తెలుపుకున్నాడు కుచేలుడు. కానీ ఆ సంపద వలన అహంకారాన్నీ, వాటిపై వ్యామోహాన్ని పెంచుకోక యోగిలా జీవిత చరమాంకం వరకూ బతికాడు కుచేలుడు.కుచేలుని విషయంలో జరిగిన ఈ అద్భుతం కృష్ణుని మహత్తులా కనిపించినప్పటికీ, కుచేలునికే పాత్రత, అర్హత లేకపోయినట్లయితే జరిగే పనేనా! కులచేలునిలోని నిస్వార్థ ప్రేమ, స్నేహం కృష్ణుడంతటి వాడినే తన్మయింపజేసిందనేది నిర్వివాదాంశం. స్నేహం పరస్పర వ్యక్తీకరణ కన్నా, భావ పరిభాషే అర్థమవుతుందనేది కుచేలుని వ్యక్తిత్వం చెబుతున్నద
 
!! కుచేలోపాఖ్యానం శ్రీ మహాభాగవతము !!
 
చిన్నప్పుడు గురుకులంలో ఉంటూన్నప్పుడు కృష్ణుడు కుచేలుడనే బ్రాహ్మణకుమారునితో మంచి స్నేహం చేసుకున్నాడు. ఆ తరువాత కృష్ణుడు ద్వారకలో, కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయారు. కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలా ధనార్జన మీద ఆశ లేకుండా, పరమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం సాగించుకుంటున్నాడు. అతని భార్య ఉత్తమురాలు. పతికి అన్నివిధాలా అనుకూలంగా నడుచుకుని బ్రతుకుతోంది.
 
ఆ దంపతులు యెంతో దారిద్ర్యం అనుభవిస్తూ, చివరికి బ్రతుకే కటకటలాడవస్తే, పాపం, ఆ యిల్లాలు ఒకనాడు భర్తతో, "మీరెప్పుడూ మీ మిత్రుడు కృష్ణుని గురించి చెపుతూ ఉంటారే? అతనో గొప్ప ప్రభువు కదా? ఐశ్వర్యవంతుడు. అతనిని అడిగితే, కాదనక తప్పక సహాయం చేయగలడు. దానితో మన దారిద్ర్యబాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది యెరుగకుండా జీవిస్తాం. ఆయనని వెళ్లి కలుసుకోరాదూ?" అని యెంతో దీనంగా వేడుకుంది. కుచేలుడు తనలో, "ధనమేమి దొరకక పోయినా, యీ నెపంతో నైనా చాలాకాలం తరువాత నా స్నేహితుడిని చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది" అని ఆలోచించి, "సరే్, అలాగే" అన్నాడు.
 
ద్వారకకి వెళ్దామని సిద్ధమవుతూ, "నా నేస్తానికి తీసుకు వెళ్లడానికి మనయింట్లో యేమైనా ఉందా?" అని కుచేలుడు భార్యని అడిగాడు. ఆమె, ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు నాలుగు పిడికెళ్లు, కుచేలుని అంగవస్త్రంలో ముడికట్టింది.
 
సంతోషంగా ద్వారక యెప్పుడు వస్తుందా, యెప్పుడు నేస్తాన్ని చూస్తానా అని కుచేలుడు అడుగులు వేసాడు.
 
ద్వారకలో మూడు ప్రహారీగోడలు దాటి కృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్లి, కుచేలుడు అందులోని ఒక భవనంలోకి ప్రవేశించాడు. అది రుక్మిణి భవనం.
 
దూరం నుంచి తన స్నేహితుని చూసి కృష్ణుడు లేచి, రెండు చేతులూ ముందుకు చాచి వెళ్లి, కుచేలుని కౌగిలించుకున్నాడు. కుచేలుడిని లోనికి తీసుకుపోయి, ఆసనమిచ్చి, దీపధూపాలతో నివాళించి సాదరంగా స్వాగతం పలికాడు.
 
కుచేలుడు, చిక్కి శల్యంలా మురికిగుడ్డలతో చూడ బిచ్చగాడిలా ఉన్నాడు. అతనికీ, ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణునికీ యేమంత స్నేహం అని అంతఃపురవాసులంతా ఆశ్చర్యపొయారు.
 
కుశల ప్రశ్నలయాక, చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ యిద్దరు మిత్రులూ మురిసిపోయారు. కొంచెం సేపయాక నవ్వుతూ, "మిత్రమా, నాకోసం యేం తెచ్చేవేమిటి?" అని కృష్ణుడు కుచేలుని అడిగాడు. కుచేలుడు అటుకులమూట పట్టుకుని, 'ఇంతటి ఐశ్వర్యవంతుడి కిదేనా తేగలిగేను" అని సిగ్గుతో తలవంచుకున్నాడు. అది చూసి కృష్ణుడు, ఆ అటుకులమూటని తీసుకుంటూ, "భక్తితో నాకు పత్రమర్పించినా చాలు. లేదంటే యేమి తెచ్చినా నాకు నచ్చదు" అని ఆ మూట విప్పి, రుక్మిణితో, "చూసేవా, ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడో" అని చెప్తూ, అందులోంచి ఓ పిడికేడు అటుకులు నోట్లో వేసుకున్నాడు. బాగున్నాయని తల ఆడించి, మరొ పిడికెడు వేసుకోబోయాడు, తన నోట్లో. అప్పుడు రుక్మిణి, "ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి యిహంలోనూ, పరంలోనూ సకలసంపదలూ కలుగుతాయి. చాలు" అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా, సరే అని ఊరుకున్నాడు. ఆ రాత్రికి కృష్ణుని మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గసుఖం పొందినట్లు హయిగా మెత్తని పరుపుల మీద కుచేలుడు నిదురించాడు. తెల్లవారగానే కుచేలుడు సెలవు తీసుకుంటానంటే, అతనితో కృష్ణుడు కొంతవరకూ వెళ్లి సాగనంపేడు.
 
ఇంటికి వస్తూ, తోవలో, "అరెరే, అ పరమసంతోషంలో మా ఆవిడ మరీమరీ చెప్పినది కృష్ణుని అడుగనే లేదు. ఐనా, ఎలా నోరు విప్పి, నాకేమైనా సర్దిపెట్టు అని అడుగను? ఆ మహాత్ముని చూడగలిగిన భాగ్యమే చాలు. ఎందరు నోచుకోగలరు అ భాగ్యానికి?" అని తృప్తిగా అడుగులు వేసాడు.
 
ఇంటి దరిదాపులకి చేరుకున్నాక, అక్కడ అంతా కొత్తగా కనిపించింది. అంత పెద్ద భవనం తన పల్లెలో యెన్నడూ చూడనే లేదు. ఆశ్చర్యంగా అలా కళ్లప్పగిస్తూ, వస్తూండగా నౌకరులు ముందుకు వచ్చి, " దయచేయండి స్వామీ" అని ఆ భవనంలోకి కుచేలుని తీసుకునిపోయారు. లోనికి వెళ్లగానే, ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య యెదురై, "స్వామీ! దయచేయండి" అని రత్నమాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతూన్న ఆ ఐశ్వర్య నిలయం లోనికి తీసుకుని వెళ్లింది. కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణపరమాత్ముని అనుగ్రహమే అని అర్థమయింది. అడుగకపోయినా యిచ్చే ఆ దాతకి, చిన్ననాడెంతో సఖ్యంగా ఉండేవాడో, అంతకంటే యెక్కువ మక్కువతో ఆదరించిన తన స్నేహితునికీ, కుచేలుడు నమస్కరించాడు.
 
కృష్ణుడు ప్రసాదించిన ఐహికభోగభాగ్యాలని అనుభవిస్తున్నా, వాటియందు మోహమే లెకుండా, నిరంతరమైన భక్తితో కృష్ణుని మొక్కుతూ, కుచేలుడు తన జీవితమంతా గడిపాడు. ఆ తరువాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు.
 
ఇందీవర శ్యాము వందిత సుత్రాముఁ
 
గరుణాల వాలు భాసురకపోలుఁ
 
గౌస్తుభాలంకారుఁ గామిత మందారు
 
సురుచిర లావణ్యు సురశరణ్యు
 
హర్యక్షనిభ మధ్యు నఖిల లోకారాధ్యు
 
ఘన చక్రహస్తు జగత్ర్పశస్తు
 
ఖగకులాధిపయానుఁ గౌశేయ పరిధానుఁ
 
బన్నగశయను నబ్జాతనయను
 
మకరకుండల సద్బూషు మంజు భాషు
 
నిరుప మాకారు దుగ్ధసాగర విహరు
 
భూతి గుణసాంద్రు యదు కులాంబోధి చంద్రు
 
విష్ణు రోచిష్ణు జిష్ణు సహిష్ణుఁ గృష్ణు.....
 
- అవధూత జ్యోతిష్యాలయం. 

Quote of the day

A small body of determined spirits fired by an unquenchable faith in their mission can alter the course of history.…

__________Mahatma Gandhi