Online Puja Services

కంప్యూటర్ - కరుణ

3.140.185.147
శ్రీమతి రమా రాజగోపాలన్ తమ జీవితంలో పొందిన పరమాచార్య స్వామివారి అనుగ్రహాన్ని ఇలా తెలుపుతున్నారు.
 
రమా భర్త చేస్తున్న ఉద్యోగం వదిలి, కొత్త ఉద్యోగానికై ప్రయత్నాలు చేస్తున్నారు. తను కూడా తన భర్తకు ఇంటికి ఏదైనా సహాయం చెయ్యాలని నిర్ణయించుకుంది.
 
“ఉద్యోగం లేనివారికి ప్రభుత్వం ఇచ్చే ఏదైనా సహాయాన్ని మనం కూడా పొందవచ్చు కదా” అని తన భర్తను అడిగింది. అతను నిర్లక్ష్యంగా, “నువ్వు చదువుకోలేదు. మరి ప్రభుత్వ సహాయం పొంది నువ్వు ఏమి చేస్తావు” అని బదులిచ్చాడు. రెండురోజుల తరువాత, ఉద్యోగం వెతకటం కోసం బాంబేకు వెళ్ళిపోయాడు.
 
కుటుంబ పరిస్థితి గమనించి రమా చాలా బాధపడుతోంది. ఆర్ధిక సహాయం గురించిన వివరాలేమైనా తెలుస్తాయేమోనని రోజూ వార్తాపత్రికలు చూస్తోంది. వ్యవసాయానికి, కుట్టుమిషన్లకు, టైప్ రైటర్లకు, చిన్నపాటి ఉద్యోగాలకి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుందని ఒక వార్తను చూసింది.
 
వెంటనే ఆమెకు ఒక ఆలోచన కల్గింది. అప్పుడే కంప్యూటర్ల వాడకం మొదలవుతోంది. ఒక కంప్యూటరు కొనడానికి కావాల్సిన లోను కోసం ధరకాస్తు చేసుకుంది. ఆ వారంలోనే, ఇంటర్వ్యు కోసం తమని వచ్చి కలవమని బ్యాంకు నుండి సమాధానం వచ్చింది.
 
ఏ కార్యమైనా చెయ్యబోయే ముందు పరమాచార్య స్వామిని తలచుకుని ప్రార్థించడం రమకు అలవాటు. ధరకాస్తు పంపేటపుడు కూడా మహాస్వామి వారి పాఠం ముందు నిలబడి, ప్రార్థించిన తరువాతనే బ్యాంకుకు పంపింది. ఇప్పుడు ఇంటర్వ్యుకు వెళ్లేముందు, స్వామివారి పటానికి నమస్కారం చేసి ఇంటర్వ్యు కోసం కాంచీపురానికి బయలుదేరింది.
 
ప్రయాణంలో తనకు కంప్యూటర్ల గురించి బొత్తిగా ఏమి తెలియదు కనుక ఇంటర్వ్యులో వారు ఏదైనా కంప్యూటర్లకు సంబంధించిన విషయం అడిగితే తను ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తోంది. బ్యాంకు వారు తనని నమ్మి కంప్యుటర్ కొనడానికి ఆర్ధిక సహాయం ఎలా చేస్తారు అని అనుకుంటోంది. కాని తనకు పరమాచార్య స్వామిపై గట్టి నమ్మకం, వారు తప్పక దారి చూపి, సహాయం చేస్తారని.
 
ఇంటర్వ్యుకు వెళ్లేముందు కాంచీపురం శ్రీమఠానికి వెళ్లి దర్శనం కోసం పరమాచార్య స్వామివారి ముందు నిలబడింది. మొత్తం విషయం అంతా తెలిపి ఆశీస్సులు అర్థించింది. స్వామివారు చిన్నగా నవ్వి, “కంప్యూటర్ల వెనుక ఉన్న విజ్ఞానం ఏంటో తెలుసా?” అని అడిగి, వారే వాటి గురించి చెప్పడం మొదలుపెట్టారు.
 
“మనిషి తెలివితో చేసే పనులన్నింటిని ఆ యంత్రాల చేత చేయించేలాగా వాటిని రూపొందిస్తున్నారు. ఎక్కువగా మతిమరుపు ఉంటున్న ఈరోజుల్లో అది ఒక వరం. మనం ఇచ్చిన మొత్తం సమాచారాన్ని అందులోకి ఇస్తే, దాన్ని మొత్తం అది దాచిపెట్టుకుని, మనం కావాలన్నప్పుడు ఎటువంటి తప్పులు లేకుండా తిరిగి ఇస్తుంది. కాని కంప్యూటర్లు మానవ మేధస్సుకు సమానం కావు” అని స్వామివారు చెప్పగానే, ఆవిడకు కంప్యూటర్ల గురించిన ప్రాథమిక అవగాహన, వాటి అవసరం తెలిసింది.
 
తరువాత స్వామివారు, “కంప్యూటర్ల గురించి ఏం చదువుకున్నావు?” అని అడిగారు. ఇప్పుడు రమా ఇరకాటంలో పడింది.
 
“ఇప్పుడే నేర్చుకోవడం మొదలుపెట్టాను పెరియవ” అని బదులిచ్చింది.
 
“పని మొదలుపెట్టక ముందే దాని ఫలితం పొందాలని ఆలోచిస్తున్నావన్నమాట” అని చిన్నగా నవ్వి కుంకుమ, కలకండ ఆమె ఫైలు మీద పెట్టి ఆశీర్వదించారు.
 
అంతులేని విశ్వాసంతో వెళ్లి ఇంటర్వ్యుకు వెళ్ళింది. అక్కడ వాళ్ళు తన చదువు గురించి కానీ, కంప్యూటర్లతో తను చెయ్యబోయే పని ఏంటని కాని అడగలేదు. వారు అడిగిన విషయం కంప్యూటర్ల వల్ల ఉపయోగం ఏంటని. తను ఇంటర్వ్యుకు వచ్చే ముందు పరమాచార్య స్వామివారిని కలిసినప్పుడు స్వామివారు కంప్యూటర్ గురించి చెప్పిన విషయాన్ని మొత్తం వాళ్లకు చెప్పింది. ఇక్కడ ఇటువంటి ప్రశ్ననే అడుగుతారని మహాస్వామివారికి తెలుసు కాబట్టి, ఇదే విషయం స్వామివారు రమకు తెలిపారు. తన సరళమైన, స్పష్టమైన సమాధానాన్ని విని అధికారులు సంతోషించారు.
 
ఇక ఎటువంటి ప్రశ్నలు అడగకుండా వెళ్ళవచ్చని చెప్పారు. తనకు సహాయం అందదని బాధతో ఇంటికి వచ్చి పరమాచార్య స్వామివారి చిత్రపటం ముందు నిలబడి, “వికలాంగునికి తేనే కావాలని కోరిక” (తమిళ సామెత) అని ఏడ్చింది.
 
కాని స్వామివారి ఆశీస్సుల వల్ల, వారంలోపే తనకి ముప్పైఅయిదు వేల రూపాయల ఋణం లభించింది. పరమాచార్యుల ఆశీస్సులు ఉంటే, వికలాంగునికైనా తేనె నేరుగా వచ్చి నోటిలోకే పడదా?
కేవలం భక్తి, శరణాగతి మాత్రమె మనల్ని పరమాచార్య స్వామివారికి దగ్గర చేస్తుంది. శ్రేయస్సును కలిగిస్తుంది.
 
--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి.
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha