Online Puja Services

కర్పూర హారతి ఎందుకు ఇవ్వాలి?

3.144.127.232

హారతి ఎందుకు

ఆలయంలోకి వెళ్లి ఆ దైవాన్ని దర్శించుకున్నా, ఇంట్లోనే ఉండి పూజలు నిర్వహించినా.... హారతి ఇవ్వనిదే మన మనసుకి తృప్తిగా ఉండదు. షోడశోపచారాలలో ఒకటైన హారతి లేనిదే, పూజ సంపూర్ణం కాదు. మరి ఆ హారతిని ఎందుకు ఇస్తామంటే...

- హారతిని సాధారణంగా కర్పూరంతోనే ఇస్తాము. ఈ కర్పూరం అనేది సంస్కృత పదం. వేదకాలం నుంచీ మన జీవన విధానంలో ఇమిడిపోయిన పదార్థం. అందుకే ఆంగ్లంలోని ‘camphor’ అనే మాట సైతం కర్పూరం అన్న పదం నుంచే వచ్చింది.

- ఆలయంలోకి ప్రవేశించిన భక్తుడు ధ్వజస్తంభానికి మొక్కుతూ, ప్రదక్షిణలు చేస్తూ, భగవన్నామస్మరణను సాగిస్తూ... చివరికి గర్భాలయాన్ని చేరుకుంటాడు. ఆ గర్భాలయంలోని దైవం నూనెదీపాల వెలుగులో అస్పష్టంగా కనిపిస్తే, అతని మనసులో ఏదో ఒక మూల అసంతృప్తి కలగడం సహజం. హారతి ప్రకాశంతో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దేదీప్యమానంగా చూసే అవకాశం కలుగుతుంది. అప్పటివరకూ భగవద్దర్శనం కోసం తపించిపోయిన మనసు సేద తీరుతుంది. ఇప్పటికీ కొన్ని దక్షిణాది రాష్ట్రాలలో ఒక్కసారి ఆ భగవంతుని చూపించండి అని భక్తులు అడగడం, పూజారిగారు హారతిని వెలిగించి వలయాకారంగా తిప్పుతూ ఆ మూర్తిని దర్శింపచేయడం జరుగుతుంటుంది.

- ఒకప్పుడు ఆలయాలలో ఎలాంటి కృత్రిమమైన దీపాలూ ఉండేవి కావు. పైగా గాలి కూడా చొరబడని రాతితో ఆ నిర్మాణాలు సాగేవి. అలాంటి ప్రదేశాలలో తేమ అధికంగా ఉండటం సహజం. ఈ తేమతో దుర్వాసన, సూక్ష్మక్రిములు దరిచేరక తప్పదు. కర్పూరానికి సూక్ష్మక్రిములను సంహరించే శక్తి, అంటువ్యాధులను నివారించే గుణం ఉన్నాయని ప్రాచీన వైద్యుల నమ్మకం. ఇక కర్పూరం వెలిగిస్తే... దుర్గంధం అన్న మాట ఎక్కడిది.

- ఇప్పుడంటే కర్పూరపు తయారీలో రసాయనాలను ఉపయోగిస్తున్నారు. కానీ ఒకప్పుడు అంతటి సాంకేతికత ఎక్కడిది! దానిని పూర్తిగా కర్పూరం చెట్ల నుంచే సేకరించేవారు. ఆ రకంగా ఫలపుష్పార్చనకూ, ధూపదీపాలకూ పూర్తిగా వృక్షాల మీదే ఆధారపడేవారు. పూజ అంతా ప్రకృతి సిద్ధంగానే సాగేది.

- భగవంతునికి అందించిన హారతిని కళ్లకు అద్దుకోవడం సహజం. ఈ ప్రక్రియతో కళ్లకి చలువ చేసే మాట అటుంచి, భగవంతుని మూలవిరాట్టుని నేరుగా తాకలేము కాబట్టి, ఈ హారతి ద్వారా ఆయనను స్పర్శించుకుంటున్నామన్న తృప్తి కలుగుతుంది.

- హారతితో పాటుగా ఘంటానాదాన్ని చేయడం సహజం. అదే సమయంలో మనం కళ్లు మూసుకుని హారతిని అద్దుకుంటూ ఉంటాము. అంటే మనసు, చెవులు, ఆఘ్రానించే శక్తీ, స్పర్శా... ఇన్ని ఇంద్రియాలు భగవంతుని ధ్యానంలో లగ్నమవుతాయి.

చివరగా.... కర్పూరానికి రెండు సుగుణాలు ఉన్నాయి. ఒకటి ఎలాంటి అవశేషమూ మిగలకుండా దహించుకుపోవడం. రెండు- సుగంధాన్ని, ప్రకాశాన్ని వెదజల్లడం. బహుశా మనిషి జీవితం కూడా ఇలాగే సాగాలన్నది మన పెద్దల అభిలాష కాబోసు. భక్తుడు ఎలాంటి కర్మ ఫలమూ మిగలకుండా, మోక్షం వైపుగా సాగిపోవాలనీ... జీవించినంతకాలమూ జ్ఞానమనే ప్రకాశాన్నీ, సద్గుణాలు అనే సుగంధాలనీ వెదజల్లుతూ ఉండాలనీ పెద్దల అభిమతం

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore