Online Puja Services

సౌభాగ్యాన్నిచ్చే వటసావిత్రీ వ్రతం

3.147.104.120

ముత్తైదువులకి సౌభాగ్యాన్నిచ్చి, కుజదోషమున్న యువతులకు వివాహ సౌభాగ్యాన్నిచ్చే వటసావిత్రీ వ్రతం . 
- లక్ష్మి రమణ 

హైందవ ధర్మం గొప్పదనం స్త్రీ పాతివ్రత్య ప్రభావంలోనూ నిరూపించబడింది . మహా పుణ్యమూర్తులైన ఆ మాతృమూర్తుల ధర్మ నిష్ట సూర్యోదయాన్ని ఆపదలిగింది.  రావణుడి వంటి ప్రతాపశాలిని భయకంపితుడ్ని చేసింది.  త్రిమూర్తులనే పసిపాపాలుగా చేసి లాలించగలిగింది . అంతటి మహిమ కేవలం తన భర్తకి సేవచేయడం ద్వారా భార్య పొందగలుగుతుంది . అటువంటి ప్రభావంతో  యముణ్ణే జయించి భర్త సూక్ష్మ శరీరాన్ని దక్కించుకోగలిగిన  ఆ సావిత్రిని సత్యవంతుని సహితంగా ఆరాధించడం వటసావిత్రీ వ్రతంలో విశేషం . దీనివల్ల పుణ్యవతులకి దీర్ఘమైన మాంగళ్య సౌభాగ్యం కలుగుతుందని విశ్వాసం. 

ఉత్తమురాలైన స్త్రీ మనసులోనైనా, కలలోనైనా పరపురుషుని చింత ఉండదు అంటాడు తులసీదాసు. సావిత్రి అటువంటి గొప్ప పతివ్రత. ఆమె సత్యవంతుడికి 21 సంవత్సరాలు మాత్రమే ఆయుర్దాయమని తెలిసి కూడా, అతణ్ణి మనసారా వరించిన కారణంగా, వివాహం చేసుకుంది . కాలం ఆగదు కదా ! సత్యవంతునికి సమయం ఆసన్నమయింది .  సత్యవంతుడు పేరుకి తగిన ధర్మవంతుడు కనుక యముడు స్వయంగా అతని సూక్ష్మప్రాణాలు తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఆయన పాశం కర్కశమైనది .  అది ధర్మానికి మాత్రమే లొంగుతుంది.  బంధాలకీ , అనుబంధాలకీ , లౌకికమైన ప్రేమాప్యాయతలకీ అతీతమైనది . 

వట వృక్షం క్రింద సావిత్రి ఒడిలో తలపెట్టుకొని ఉన్న సత్యవంతుని ప్రాణాలని హరించింది . 

కానీ, సావిత్రీదేవి ధర్మజ్ఞానము, వివేకము, పతివ్రత లక్షణాలు యమధర్మరాజు మనసును కలిగించాయి. యెంత దూరం వెళ్లినా తన వెంటే రాగలిగిన ఆమె పాతివ్రత్య మహిమ ఆ ధర్మ నిరతుణ్ణీ అనుగ్రహించేలా చేశాయి . సత్యవంతుని ప్రాణాలను తన పాశము నుంచి విడిచిపెట్టాడు. వినయంతో సావిత్రి యమధర్మరాజుకి నమస్కరించింది. సావిత్రి సత్యవంతుని ప్రాణాలు తీసుకుని భర్త పార్థివ శరీరం ఉన్న వటవృక్షం దగ్గరకు వచ్చింది. అప్పటి వరకూ తన భర్త దేహాన్ని రక్షించిన ఆ వటవృక్షానికి నమస్కరించి ప్రదక్షిణ చేసింది.  అదే సమయంలో సత్యవంతుడు ప్రాణాలతో లేచి కూర్చున్నాడు. ఈ విధంగా హైందవ సతి ధర్మం ఈ విధంగా మృత్యుని జయించింది. 

 అప్పటినుంచి స్త్రీలు వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తున్నట్లు, వట సావిత్రి వ్రతం అమలులోకి వచ్చినట్లు ఒక విశ్వాసం.  

వటసావిత్రి వ్రత విధానం :
 
వ్రతాన్ని చేసేవారు ముందు రోజంతా ఉపవాసం ఉండాలి .  ఆ తర్వాతి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి.  పూజా వస్తువులు తీసుకుని వటవృక్షం దగ్గరకు వెళ్లి, చెట్టు మొదలుని శుభ్రం చేసి, చక్కగా ఆవుపేడతో అలికి ముగ్గులు పెట్టాలి. సావిత్రి, సత్యవంతులను ప్రతిష్టించాలి.  వారి చిత్రపటాలు దొరకకపోతే పసుపుతో గౌరమ్మలు చేసుకున్నట్టుగా రెండు మూర్తులనీ చేసి వాటిని సావిత్రీ , సత్యవంతులుగా భావనచేసి ప్రతిష్టించుకోవాలి . ముందుగా  వినాయకుడిని తరువాత వరుసగా సావిత్రి, సత్యవంతులను, యమధర్మరాజు, బ్రహ్మదేవుని, వటవృక్షాన్ని పూజించాలి.  పూజ అనంతరం వటవృక్షానికి దారం చూడుతూ 108 ప్రదక్షిణలు చేయాలి . ఆ తర్వాత నైవేద్యం సమర్పించి ముత్తైదువులకు, బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాదులను సమర్పించాలి. ఆ విధంగా వ్రతం ఆచరించి వ్రత కథను చదువుకోవడమో లేక పురోహితుని ద్వారా కథను వినడము చేయాలి 

మర్రిచెట్టుకి దారం ఎందుకు చుట్టాలి ?

ఇలా మర్రిచెట్టుకి దారాన్ని చుట్టడం వల్ల మర్రిచెట్టు దీర్ఘాయుర్దాయంతో తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లు అవుతుందని, దానివల్ల వారి  ఐదవతనం ఆ మర్రిచెట్టులా బలంగా వర్ధిల్లుతుందనేది ప్రతి ఇల్లాలి నమ్మకము.  

వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి ?

వట సావిత్రి వ్రతాన్ని అమావాస్య నాడు చేయడం లోక విధానం.  భవిష్యత్తు పురాణం, నిర్ణయసింధుల్లో వటసావిత్రీ వ్రతాన్ని జేష్ట మాసం అమావాస్య నాడు ఆచరించాలని ఉంది.  అయితే కొందరు జ్యేష్ట శుద్ధ పౌర్ణమి నాడు కూడా చేసుకుంటారు. 

ఎవరు చేసుకోవచ్చు ?

వివాహిత స్త్రీలందరూ ఈ వ్రతాన్ని చేయడం మంచిది. కుజదోష పీడిత కన్యలు త్వరగా వివాహం జరగడానికి, కలకాలం దాంపత్యం సుఖంగా వర్ధిల్లడానికీ  ఈ వ్రతాన్ని చేయడం శుభప్రదం.  సావిత్రి వ్రత ప్రభావం వల్ల ముత్తైదువుల సౌభా గ్యం అక్షయమవుతుంది.  వారికి వైధవ్య దుఃఖం నుండి విముక్తి లభించి, మంచి సంతానం కలుగుతుంది.  వారి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది. 

శుభం !!

#vatasavitrivratam

Tags: vata Savitri Vratam

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi