ఋషి పంచమి

54.165.57.161

ఋషి పంచమి

భవిష్యోత్తర పురాణంలో ఈ ఋషి పంచమి యొక్క వ్రత ప్రాశస్త్యమును వివరిస్తోంది...
పేరుకు ఋషి పంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబందించిన వ్రతంగా చెప్పబడినది.

ఒకానొకప్పుడు సివాశ్వడు అనే రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించే వ్రతం గురించి అడుగగా బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించినట్లుగా " వ్రతకల్పం" పేర్కొన్నది...

పూర్వం విదర్భలో ఉత్తంగుడనే బ్రాహ్మణునకు బాలవితంతువు అయిన ఒక కుమార్తె, వేదాధ్యయనం చేసే ఒక కుమారుడు ఉన్నారు. 
విద్యార్ధులకు వేదం నేర్పుతూ ఈ బ్రాహ్మణుడు జీవనం చేస్తూ ఉండగా, ఒక రోజు ఆయన కుమార్తె దేహం నుండి పురుగులు రాలిపడ్డాయి. 
ఈ సంఘటనతో ఆ బాలిక స్పృహతప్పి పడిపోగా, ఉత్తంగుడు తన ఉపాసనా బలం వలన ఆమె పూర్వ జన్మలో రజస్వల అయి ఉండి , ఇంటిలోని అన్నపు గిన్నెలను ముట్టుకోవడం వలన ప్రస్తుతం తన కుమార్తె దేహం క్రిమిభూయిష్టమైనదని తెలుసుకున్నాడు...
అప్పుడా బాపనుడు తన కూతురు చేత ఋషిపంచమీ వ్రతాన్ని చేయించి, గత జన్మలో ఆమె రజస్వలగా ఉన్న సమయంలో చేసిన పాపాలను హరించివేశాడు...

భాద్రపద శుద్ధ పంచమి నాడు ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తుందో, ఆమె రజస్వలగా ఉండి చేసిన దోషాలన్నీ హరించబడతాయి.

పూర్వకాలంలో ఇంద్రుడు వృత్తాసుర వధ చేసి బ్రహ్మహత్యా పాతకం పొందాడు.
అప్పుడు ఇంద్రుడు తన పాపంలో ఒక పావు వంతు భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడు. 
ఆనాటి నుండి స్త్రీలు రజో ధర్మాన్ని పొంది, రజస్వలలు కావడం ప్రారంభమైనది. 
రజస్వలా కాలంలో వారు తెలిసీ తెలియక చేసే పాపాలను పోగొట్టడానికి బ్రహ్మ ఈ ఋషిపంచమి వ్రతాన్ని కల్పించాడని పురాణ కథనం...

విదర్భలో శ్వేతజితుడనే క్షత్రీయుడు, సుమిత్ర అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు.

శ్వేతజితుడు కృషి కర్మలో ఉండటం వలన, తెలియక రజస్వల, అయిన స్త్రీలను తాకడం , వారితో సంబాషించడం వంటి పనులు చేశాడు. 
సుమిత్ర కూడా రజస్వలగా ఉన్నా అందర్నీ ముట్టుకుంటూ ఉండేది, అవసానకాలంలో వారు ఇద్దరూ మృతి చెంది, సుమిత్ర కుక్క గానూ, శ్వేతజితుడు ఎద్దుగానూ సుమిత్ర కొడుకైన గంగాధరుని ఇంటినే జన్మించారు.

కాలం గడుస్తున్నది, సుమిత్ర శ్రాద్ధదినం వచ్చింది, గంగాధరుడు శ్రద్ధగా, శ్రాద్ధ క్రియ ఆచరించి, బియ్యపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించేలోగా, పాయసాన్ని ఒక పాము ముట్టడం చూసిన కుక్క, అతిథులకు ఆ పాయసం పెడితే మరణిస్తారని తలంచి, అందరూ చూస్తూండగానే తాను ఆ పాయసాన్ని ఎంగిలి చేసింది. 

కుక్కముట్టిన పాయసం పనికి రాదు కనుక వంట మనిషి మళ్ళీ పాయసం వండి అతిథులను తృప్తి పరచింది. 
కానీ కుక్క పాయసాన్ని ముట్టినందున కోపంతో, ఆ రోజు దానికి ఆహారం ఇవ్వలేదా వంటమనిషి...
కుక్కరూపంలోఉన్నది తానని తెలియక కొడుకు సైతం తన పట్ల నిర్లక్ష్యం వహించడం చూసిన సుమిత్ర ఈనాడు నా కొడుకు చేసిన శ్రాద్ధం వ్యర్ధం అయింది కదా! అని ఎద్దురూపంలో ఉన్న క్షత్రియునకు చెప్పుకుంది. 
ఈ రెండు మూగ జీవాల భాషను తెల్సిన గంగాధరుడు మర్నాడు తన గురువు వద్దకు వెళ్ళి, వాళ్ళ శాపవృత్తాంతము తెలుసుకుని, తాను ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించి, వారికి పశుజన్మల నుండి విముక్తి కలిగించి, ఉత్తమ గతులు పొందునట్లు చేసి మాతృఋణ విముక్తుడయ్యాడు.

ఈ వ్రతం ఎల ఆచరించాలి?

ఋషిపంచమి వ్రతం ప్రాయశ్చితాత్మకమైన వ్రతం. 
ఈ వ్రతం విధానాలు మనలో చాలామందికి తెల్సినా ఆచరించే వాళ్ళు తక్కువ! 
ఒకవేళ ఆచరించినా చాలా అశాస్త్రీయంగా చేయడం విచారకరం.

పంచమినాటి తెల్లవారుఝామున స్త్రీలు స్నానం చేసి పుష్పసంచయనం చేయాలి. 
స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి...
అనంతరం గణపతి పూజ పూర్తిచేసి, ఉత్తరేణి మొక్కకు పూజసల్పి, దాన్ని సమూలంగా పెరికివేసి,దాని కొమ్మతో దంతధావనం ( పళ్ళుతోమడం) చేయాలి. 
పుణ్యస్త్రీలు విభుడి, గోపిచందనం,పంచగవ్యములతో స్నానించాలి. 
ఈ తంతు ముగియగానే ఆకాశంలోని సప్తఋషులను, అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి...
పూజలో నాల్గువత్తుల దీపం ఉండాలి, పూజానంతరం, భోజనంలో బఱ్ఱె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూరను భుజించాలి.

వివాహితలు ఈ వ్రతంవల్ల భర్త ప్రేమనూ, వితంతువులు రాబోయే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని " వ్రతోత్సవ చరిత్ర " స్పష్టం చేస్తున్నది. 
ఋషిపంచమి మధ్యాహ్నకాల వ్యాపిని అయి ఉండాలి. 
పంచమి తిధి ఉభయదినవ్యాపినిగా ఉంటే మొదటిరోజునే ఈ వ్రతం ఆచరించాలి...
నీలమతపురాణం ఋషిపంచమిని వరుణపంచమిగానూ, " జ్యోతిషీ" రక్షాపంచమిగానూ, స్మృతి కౌస్తుభమౌ - చతుర్వర్గ చింతామణి - పురుషార్ధ చింతామణి వంటి పలు ప్రాచీన గ్రంథాలు"ఋషిపంచమి" గానూ పేర్కొనడం జరుగింది.

నామాలు వేరు అయినప్పటికి స్త్రీలు ఈ రోజున ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మలందు రజస్వలయై చేసిన దోషములు హరించబడతాయి. 
ఇది స్త్రీల వ్రతం, ప్రతి స్త్రీ ఆచరించవలసిన వ్రతం ఋషి పంచమి...

- వాట్సాప్ సేకరణ 

Quote of the day

There is nothing that wastes the body like worry, and one who has any faith in God should be ashamed to worry about anything whatsoever.…

__________Mahatma Gandhi