ఇలా చేసుకుంటే, పుణ్యమూ పురుషార్థమూనూ!

54.174.225.82

ఇలా చేసుకుంటే, పుణ్యమూ పురుషార్థమూనూ!
-లక్ష్మీ రమణ 

ఉదయం లేవంగానే మన ఏం చేస్తాం ? చక్కగా కాఫీ తాగి, సెల్ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలలో విహారం చేస్తుంటాం . అది అంత మంచి విశేషం కాదని మనకీ తెలుసు . కాకపొతే, ఆధునిక జీవన శైలి వల్ల ఇలాంటి అలవాట్లు వచ్చాయి మనకి . అయితే ఉదయం లేచిన దగ్గరనుండీ పడుకునే వరకూ ఏం చేయాలనేది మన పెద్దలు మంత్రం యుక్తంగా దినచర్యని నిర్దేశించారు . వీటిని పాటించడం వల్ల పుణ్యం పురుషార్థం రెండూ దక్కుతాయి . ఆ విశేషాలు ఇక్కడ మీకోసం .   

నిద్ర లేవగానే , మొదటగా కళ్లుతెరిచి మన అరచేతులని చూస్తూ ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి . 

ప్రభాత శ్లోకం. 
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ | కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్ ||

ఆతర్వాత నిత్యం మన పాదతాడనాలతో హింసించినా , ఓర్పుగా భరించి , ఆహారాన్ని అందించే భూమాతని క్షమార్పణలు వేడుకుంటూ కాలు భూమిపై పెట్టాలి . ఆ శ్లోకం ఇదీ :

ప్రభాత భూమి శ్లోకం. 
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ||

సస్యములు సంవృద్ధిగా ఉంగాలనా , మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ప్రత్యక్ష నారాయణుడైన ఆ దినకరుని విస్మరించకూడదు . సూర్యనమస్కారం ఈ శ్లోక సహితంగా చేసుకోవాలి .  

సూర్యోదయ శ్లోకం. 
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ | సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ ||

స్నానం  చేసే జలాలలోకి పవిత్రమైన నదులని ఆహ్వానిస్తే, మనం చేసే ఆ స్నానం నదీజలాలతో చేసిన ఫలితాన్ని అందిస్తుంది . ఆ శ్లోకం ఇక్కడ మీకోసం . 

స్నాన శ్లోకం. 
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ, నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ||

స్నానానంతర అనుష్ఠాది కార్యక్రమాల్లో మొదట విభూతి ధారణ తప్పనిసరి . శోకానివారణం , పరమ పవిత్రం అయినా భస్మాన్ని ఈ శ్లోక సహితంగా ధరించాలి . 

భస్మ ధారణ శ్లోకం. 
‘శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణమ్ | లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనమ్ ||’

భగవత్ ప్రీతి కరమై , పంచప్రాణాలూ సంతృప్తిని చెందే విధంగా తీసుకునే ఆహారం ఉండాలని , అలా చేయమని ఆ పరమేశ్వరుని ప్రార్ధిస్తూ ఈ శ్లోకాన్ని భోజనానికి ముందు చెప్పుకోవాలి . 

భోజన పూర్వ శ్లోకం
‘బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ||
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ-మాశ్రితః | ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ ||
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే | గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ||’

తీసుకున్నటువంటి ఆహారాన్ని చక్కగా అగస్త్యుడు , భీముడు ఎలా జీర్ణం చేసుకొనే వారో అటువంటి విధంగా జీర్ణమై శక్తిని ప్రసాదించాలని ఆ పరమాత్మని ప్రార్ధించాలి ఇలా : 

భోజనానంతర శ్లోకం. 
‘అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనమ్ | ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరమ్ ||’

సంధ్యాదీపాన్ని వెలిగించి , ఆ దీపం వెలుగులు చీకట్లని పారద్రోలినట్లు, మనలోని అజ్ఞానం సమసిపోయి జ్ఞానం అనే దీపం వెలుగులు నిండాలని పరమాత్మ స్వరూపంగా దీపానికి నమస్కారం చేసుకోవాలి . 

సంధ్యా దీప దర్శన శ్లోకం. 
‘దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ | దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే ||’

నిద్రలో వచ్చే దుస్వప్నాల వల్ల , ఆలోచన చెదిరి, హృదయం కలవరపడకుండా, రక్షించమని మహావీరులైన రాముడు, స్కందుడు , హనుమంతుడు , వైనతేయుడు(గరుత్మంతుడు) ని, భీముడుని తలుచుకొని ప్రార్ధించాలి .  

నిద్రా శ్లోకం. 
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరమ్ | శయనే యః స్మరేన్నిత్యమ్ దుస్వప్న-స్తస్యనశ్యతి ||

మరిన్ని సందర్భోచితంగా, చేయవలిసిన కార్యాన్ని అనుసరించి నిత్యం పఠించాల్సిన శ్లోకమాలిక ఇక్కడ మీకోసం : 

కార్య ప్రారంభ శ్లోకం.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభః | నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ||

గాయత్రి మంత్రం. 
ఓం భూర్భువస్సువః | తథ్స’వితుర్వరే”ణ్యం | భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

హనుమ స్తోత్రం
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టమ్ | వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ||
బుద్ధిర్బలం యశొధైర్యం నిర్భయత్వ-మరోగతా | అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్-స్మరణాద్-భవేత్ ||

శ్రీరామ స్తోత్రం. 
శ్రీ రామ రామ రామేతీ రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే

గణేశ స్తోత్రాలు
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ | ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||
అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ | అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||

ఓం గజాననం భూత గనాది సేవితం, కపిత జంభు ఫల చారు భక్షణం; 
ఉమా సుతం శోక వినాశ కారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం

ఏక దంతయ విద్మహే, వక్రతుండాయ ధీమహీ; తన్నో దంతి ప్రచోదయాత్ 

శివ స్తోత్రం.
త్ర్యం’బకం యజామహే సుగంధిం పు’ష్టివర్ధ’నమ్ | ఉర్వారుకమి’వ బంధ’నాన్-మృత్యో’ర్-ముక్షీయ మా‌உమృతా”త్||

గురు శ్లోకం.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||

లేవగానే ఎవరిముఖం చూశానో ఇవాళ ఇలా అయ్యింది , అనుకోవడం మనలో చాలా మందికి పరిపాటే! సోషల్ మీడియాలో కి తొంగిచూస్తే , ఎవరొకరి ముఖాలే కనిపిస్తాయి కదా ! అదీ ఇదీ కాదంటే, హోమ్ స్క్రీన్ ఆన్ అవ్వని ఫోన్ లో ఒక్కోసారి మన ముఖమే మనకి కనిపించి బెంబేలు చేస్తుంది కూడా! అందుకే చక్కగా మన అరచేతుల్లో ఉన్న ముగ్గురమ్మల్ని లేవగానే తలుచుకొని , అలా చూసుకుంటే, పుణ్యమూ పురుషార్థమూనూ ! కాదంటారా !

Quote of the day

A man is born alone and dies alone; and he experiences the good and bad consequences of his karma alone; and he goes alone to hell or the Supreme abode.…

__________Chanakya