Online Puja Services

దీపం మధ్యలోనే కొండెక్కితే అపశకునమా ?

13.59.218.147

దీపం మధ్యలోనే కొండెక్కితే (ఆరిపోతే) అపశకునమా ?
-లక్ష్మీ రమణ 

‘జ్ఞానాగ్ని స్సర్వక ర్మాణి భస్మ సాత్కురుత’  జ్ఞానాగ్ని సర్వకర్మలను భస్మము చేస్తుందనీ అంటాడు పరమాత్మ (భగవద్గీత 4-37 శ్లోకంలో ).  స్వయం ప్రకాశము అయినా ఆ జ్ఞానాగ్ని ప్రతి వ్యక్తిలోనూ ఉన్నప్పటికీ దానికోసం తపించనంతవరకూ , తెలుసుకోవాలనే ప్రయత్నం చేయనంతవరకూ నివురు కప్పిన నిప్పులా ఉంటుంది . అటువంటి ప్రయత్నాన్ని ఎవరికి వారు స్వయంగా చేయాలన్న ఆ భగవంతుని మాటని సదా జ్ఞప్తిలో ఉంచే ప్రయత్నమే, భగవంతునికి దీపాన్ని అర్పించడం . అందులోని రెండు వత్తులు జీవాత్మ , పరమాత్మలు. ఆ దీపం నుండీ వచ్చే వెలుగు ఆ రెండూ ఏకమైన పరమాత్మ ప్రకాశం . అందుకే దీపాన్నుంచుతూ ఈ ప్రార్థన చేస్తారు . 

‘‘దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో స్తుతే’’ 

యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమిధలతో ఆహుతులు సమర్పిస్తాం. అక్కడ జ్వాల పెరిగితే పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియత్రిస్తారు. ఆకాశం నుంచి వాయువు.. వాయువు నుంచి అగ్ని.. అగ్ని నుంచి నీరు.. నీటి నుంచి భూమి..భూమిపైన ఓషధుల సాయంతో అన్నరూపంగా ఉన్న ఈ పంచతత్వాలను స్వీకరించి మనిషి ఏర్పడ్డాడు.

అగ్ని పెరగడానికి గాలి సాయపడుతుంది. అగ్ని చిన్నదిగా ఉంటే అదే గాలి దాన్ని ఆర్పివేస్తుంది. మనలోని జ్ఞానాగ్నికి దీపం ప్రతీక. అది నిరంతరం వెలుగుతూనే ఉండాలి. అందుకే దీపం చమురు పూర్తికాకుండానే , మధ్యలోనే కొండెక్కితే (ఆరిపోతే) అపశకునం అంటారు. 

ఇక , వెలుగుతున్న దీప శిఖలో నీలం, పసుపు, తెల్ల రంగులు కనిపిస్తాయి. ఈ మూడు రంగులూ త్రిజగన్మాతలైన శ్రీమహాకాళి, శ్రీమహాలక్ష్మి, శ్రీమహాసరస్వతి దేవతలకు ప్రతిరూపాలని పురాణోక్తి. అంటే దీపారాధన చేయడం అంటే ఆ త్రిశక్తులనూ, వారితో కూడిన త్రిమూర్తులనూ పూజించినట్టేనని పెద్దల మాట.

గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనుకోకూడదు అని కూడా పెద్దవాళ్లు చెబుతుంటారు. దాన్ని రక్షించుకోవడం కూడా మన బాధ్యతే. అయితే అనుకోకుండా జరిగే వాటిని ఎవరూ ఆపలేరు. ఒకవేళ పూజలో దీపారాధన గాలికి కొండెక్కితే, నూనె, ఒత్తులు మార్చి మళ్లీ వెలిగించుకోవచ్చు. తప్పేం లేదు. అది అపశకునం కూడా కాదు అంటున్నారు పండితులు.

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya