Online Puja Services

అన్నదమ్ముల మధ్యలో కలహానికి మోహం కారణం కాకూడదు .

3.145.143.239

అన్నదమ్ముల మధ్యలో కలహానికి మోహం కారణం కాకూడదు . 
- లక్ష్మీరమణ 

ఐదుగురు అన్నదమ్ములైన పాండవులు ద్రౌపతిని పెళ్లి చేసుకున్నారు . ఐదుగురికి భార్యగా ద్రౌపతి పాంచాలి అయ్యింది .  అయితే ఈ సందర్భంలోనే దేవర్షి నారదుడు ధర్మరాజుని కలిసి ఒక అద్భుతమైన కథ చెబుతారు . అది అన్నదమ్ముల మధ్యలో ఒక స్త్రీ వ్యామోహం  పెట్టె చిచ్చు ఎంత భయంకరమయినదో తెలియజేస్తుంది . పంచమ వేదంలోని ఈ సుందోపసుందులునే రాక్షసులకు చెందిన ఆ కథని ఇక్కడ చెప్పుకుందాం . 

సుందోపసుందులు హిరణ్యకశిపుని వంశంలో జన్మించిన వారు .  నికుంభుడు అనే రాక్షసుని సంతానం . అల్లరి చేయడంలో ఉద్దండులు . రాజుగారి పిల్లలవ్వడం చేత మరీ గారాబంగా పెరిగారు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉండే వాళ్ళంటే , ఏ క్షణంలోనూ, ఏ విషయంలోనూ వాళ్ళు  ఒకరిని విడిచి ఇంకొకరు ఉండేవారు కాదు. వారిద్దరిదీ ఒకే కోరిక. ఈ త్రిలోకాలనూ జయించాలి . అజేయులుగా , అమరులుగా నిలిచిపోవాలి .   కానీ అది అంత సులువుగా కుదిరే పని కాదుగా ! త్రిలోకాల్లోనూ  దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధాను యోధులు ఇలా ఎందరో ఉంటారుగా ! వాళ్ళందరినీ ఓడించాలంటే  కేవలం భుజబలం ఉంటే సరిపోదు.  దైవ బలం కూడా ఉండాలి. 

అందుకోసం ఏం చేయాలి ? పెద్దల సూచన, గురువుల ఆశీర్వాదం తీసుకొని తపస్సు మాత్రమే దానికి మార్గమని తెలుసుకున్నారు. అందుకని  నార వస్త్రాలు కట్టి, జటాజూటం పెట్టి, వింధ్య పర్వతం మీద తల్లకిందులుగా నిలబడి తపస్సు చేశారు.  ఆ తపస్సు నుంచి పుట్టిన వేడికి దేవతలు భయపడ్డారు.  ఎన్నో విఘ్నములు కూడా  కలిగించారు.  అయినా సుందోపసుందులు చలించలేదు .  ప్రకృతి కూడా వారి తపో  దీక్షకు స్తంభించిపోయింది.  వింధ్య పర్వతాలు కదిలిపోయాయి. లోకాలన్నీ ఉక్కిరిబిక్కిరయ్యాయి.  దేవతలు అల్లాడారు.  వాళ్లంతా బ్రహ్మ దగ్గరికి పరిగెత్తి, “మహానుభావా! రక్షించండి.  సుందోపసుందుల తపస్సును ఆపి పుణ్యం కట్టుకోండి” అని ప్రార్థించారు.  వెంటనే విరించి సందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై, “నాయనా! మీ తపస్సుకు మెచ్చాను.  మీ కోరికలు ఏమిటో చెప్పండి” అని అడిగాడు. వాళ్ళిద్దరూ  నమస్కరించి “స్వామి! మేము ఎక్కడికి కావాలంటే అక్కడికి ఏ క్షణాన్నైనా వెళ్లగలిగే కామ గమన విద్యను, ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపాన్ని పొందగలిగే కామరూప విద్యను, వాటికి తోడుగా సకల మాయా ప్రదర్శన శక్తిని అనుగ్రహించండి. మాకు ఎవ్వరి వల్లా చావు లేకుండా అమరత్వాన్ని ప్రసాదించండి” అని వేడుకున్నారు. 

“ నాయనా అమరత్వం అనేది సాధ్యం కాని విషయం. పుట్టిన ప్రతిప్రాణీ గిట్టక మానదు. అయితే ఎవరివల్లా మీకు చావు రాదు . మీవల్ల మాత్రమే మీకు మరణం రావాలి . కాబట్టి, ఇక తపస్సు ఆపి ఇళ్లకు వెళ్ళండి” అన్నారు బ్రహ్మగారు.  ‘మా చేతిలో మేము చావడమా? అది జరిగే పని కాదు.  అనుకుని వారు సంతోషంతో కలిసి కట్టుగా దండయాత్రలు ప్రారంభించారు.  స్వతహాగా వచ్చిన రాజాతిశయం, రాక్షస జన్మం, వీటికి తోడు  ఇప్పుడు కొత్తగా తోడైన బ్రహ్మదేవుని వరాలు.  ఇక అడ్డూ ఆపు లేకుండా తోక తెగిన కోతుల లాగా లోకం మీద పడ్డారు. 

ముల్లోకాలూ వారి ఆగడాలకు గడగడలాడిపోయాయి . లోకంలో జపతపాలు ఆగిపోయాయి. యజ్ఞ యాగాదులు నిలిచిపోయాయి.  పుణ్యాశ్రమాల మీదకి వన్యమృగాలుగా కామరూపాలలో విరుచుకుపడేవారు. వారి హింసకాండను భరించలేక దేవ, గాంధర్వ, సిద్ధ గణాలు బ్రహ్మను మళ్లీ ప్రార్థించాయి.  

రాక్షత్వానికి , రాక్షస తత్వానికి మోహం జయింపరాని బలహీనత .  బ్రహ్మగారు ఇప్పుడు దాన్నే తన అస్త్రం గా చేసుకోదలుచుకున్నారు . విశ్వకర్మను పిలిచి నీ ప్రతిభనంతా ఉపయోగించి ఒక అతిలోక సౌందర్య రాశిని సృష్టించాలని ఆదేశించారు.  ఆయన తన శక్తిని అంతా ధారపోశి సృష్టి సౌందర్యమే ప్రతిఫలించే ఒక అందాల బొమ్మని సృష్టించాడు.  బ్రహ్మగారు  ఆమెకు ప్రాణం పోశారు .  ఆ సౌందర్యరాశి పేరు తిలోత్తమ.  ఆమె అందానికి శరీర లావణ్యానికి అందరూ అబ్బురపడ్డారు. పరవశానికి లోనయ్యారు.  బ్రహ్మగారు  ఆ కుందనపు బొమ్మని దగ్గరకు పిలిచి “నువ్వే ఈ ఆపదను తొలగించాలి.  నీ మూలంగా సందోప సుందల మధ్య విరోధం రావాలి.  ఆ కోపంలో ఇద్దరూ  ఒకరినొకరు చంపుకోవాలి.  ఎలా ఈ పని సాధించుకొస్తావో ఇక నీ ఇష్టం. మాగాళ్ళనే మరిపించగలిగిన మాయలేడిలా నువ్వు మారాలి”అని  తిలోత్తమ జన్మ కారణాన్ని వివరించారు బ్రహ్మగారు . 

 బ్రహ్మగారి  ఆజ్ఞను శిరసా వహించింది తిలోత్తమ. సందోపసుందల దృష్టిపడేలా సంచరించింది.  ఆవిడని చూస్తూనే ఆ రాక్షసులిద్దరూ ఆనంద పరవశులయ్యారు.  ఈమె నా ప్రాణం అని అన్నగారంటే, ఈ అతిలోక సౌందర్యవతి నా భార్య.  తమ్ముడి భార్య నీకు మరదలు అవుతుంది.  దూరంగా ఉండు, అని ఉపసుందుడన్నాడు. ఇక అక్కడి నుండీ వాళ్ళిద్దరి మధ్యా ఆమె కోసం పాకులాట , వాదోపవాదన పెదిగిపోయింది. 
 
అంతవరకూ  పరస్పర వాత్సల్యంతో ఉన్న అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్లారు . పిడుగులు గుద్దుకున్నారు.  ఆమె తనకు దక్కాలంటే, తనకు దక్కాలంటూ ఘోరంగా పోట్లాడుకున్నారు.  చివరికి ఒకరి నొకరు పొడుచుకుని రక్తం కక్కుతూ  నేలకూలారు. అది విని ముల్లోకాలు పండుగ చేసుకున్నాయి. ఆ విధంగా తిలోత్తమ సౌందర్యం అన్నదమ్ములైన ఇద్దరు లోకకంటకులైన రాక్షసుల మరణానికి కారణమయ్యింది. 

 అన్నదమ్ముల మధ్య కలహానికి ఈ విధంగా మోహం కారణమవ్వగలదని, చెబుతూ నారద మహర్షి పంచమవేదంలో ధర్మరాజుకి ఈ కథ చెప్పారు.  అన్నదమ్ముల ఐదుగురికి ద్రౌపదీ దేవి భార్య కనుక ఎటువంటి పొరపచ్చాలూ రాకుండా జాగ్రత్తపడి, అన్యోన్యంగా అన్నదమ్ములైదుగురూ ఆవిడతో అనురాగంతోనూ , అన్నదమ్ములతో సఖ్యతగానూ  మెలగండని పాండవులకు హితువు పలికారు . 

 

Quote of the day

The Vedanta recognizes no sin it only recognizes error. And the greatest error, says the Vedanta is to say that you are weak, that you are a sinner, a miserable creature, and that you have no power and you cannot do this and that.…

__________Swamy Vivekananda